Election Commission Transferred To Palamaner DSP and Sadum SI : అధికార వైఎస్సార్సీపీకు అంటకాగుతూ, ఎన్నికల విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోన్న పోలీసు అధికారులపై ఎన్నికల సంఘం చర్యలు కొనసాగుతున్నాయి. ఇటీవల డీజీపీని ఇతర అధికారులను బదిలీ చేసిన ఎన్నికల సంఘం తాజాగా చిత్తూరు జిల్లా పలమనేరు డీఎస్పీ మహేశ్వరరెడ్డి, సదుం ఎస్‌ఐ మారుతిని బదిలీ చేసింది. వారిద్దరినీ బదిలీ చేస్తూ ఈసీ ఆదేశాలు జారీ చేసింది. వారి బాధ్యతలను కిందిస్థాయి అధికారులకు అప్పగించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. బీసీవై పార్టీ అధ్యక్షుడు రామచంద్రయాదవ్‌పై దాడి ఘటన నేపథ్యంలోనే ఈసీ చర్యలకు ఉపక్రమించినట్లు సమాచారం. ఇటీవల ఏపీ డీజీపీ రాజేంద్రనాథ్‌రెడ్డితోపాటు అనంతపురం రేంజి డీఐజీ ఆర్‌ఎన్ అమ్మిరెడ్డిని ఎన్నికల సంఘం బదిలీ చేసిన విషయం తెలిసిందే. కొత్త డీజీపీగా హరీశ్ కుమార్ గుప్తా నియమితులయ్యారు.
వైఎస్సార్సీపీతో కలిసి అరాచకాలు - జగన్ వీరభక్త 'బంటు'లపై వేటు
ఎన్నికల వేళ ఈసీ బదిలీల పర్వం : ఏపీలో ఎన్నికల వేళ పోలీసు అధికారులపై ఈసీ బదిలీ వేట్ల పర్వం కొనసాగుతోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఇప్పటికే డీజీపీ సహా 10 మంది ఐపీఎస్ అధికారులపై బదిలీ వేటు వేసిన ఈసీ ఇవాళ మరో అధికారుల్ని విధుల నుంచి తప్పించింది. అదీ రాయలసీమలోని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇలాఖాలో కావడం మరో విశేషం. ఇప్పటివరకూ రాయలసీమలో పోలీసు అధికారులపై ఫిర్యాదులతో వరుస బదిలీలు చేస్తున్న ఎన్నికల సంఘం తాజాగా ఇదే క్రమంలో ఈ రెండు బదిలీలు కూడా చేసింది.
ముకేష్ కుమార్ మీనాకు ఆదేశాలు జారీచేసిన ఈసీ : చిత్తూరు జిల్లా పలమనేరు డీఎస్పీ మహేశ్వర్ రెడ్డితో పాటు సదుం ఎస్సై మారుతిపై ఇవాళ ఈసీ బదిలీ వేటు వేసింది. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముకేష్ కుమార్ మీనాకు ఆదేశాలు అందాయి. పుంగనూరులో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై పోటీ చేస్తున్న బీసీవై పార్టీ అధ్యక్షుడు రామచంద్రయాదవ్ పై తాజాగా దాడి జరిగింది. ఇందులో ఆయనకు గాయాలయ్యాయి. అలాగే ఆయన అనుచరులకూ దెబ్బలు తగిలాయి. ఈ వ్యవహారంపై స్పందించిన ఈసీ ఈ రెండు బదిలీలు చేసినట్లు తెలుస్తోంది.
ఎన్నికల్లోపు మరిన్ని బదిలీలు : ఇప్పటికే డీజీపీ కేవీ రాజేంద్రనాథ్ రెడ్డితో పాటు అనంతపురం రేంజ్ డీఐజీ అమ్మిరెడ్డిని విధుల నుంచి తప్పించిన ఈసీ ఇవాళ చేసిన బదిలీల నేపథ్యంలో రాయలసీమలో పోలీసు అధికారులు ఆందోళన చెందుతున్నారు. ఎన్నికల్లోపు మరిన్ని బదిలీలు ఉంటాయన్న ప్రచారం కూడా జరుగుతోంది. దీంతో ఎన్నికల విధుల్లో ఉన్న అధికారులు నియమావళి ప్రకారం విధులు నిర్వర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు.
ఇంటిలిజెన్స్ డీజీ, విజయవాడ సీపీపై బదిలీ వేటు - EC transfers Intelligence DG and SP
డీజీపీ రాజేంద్రనాథ్‌రెడ్డిపై ఈసీ వేటు - బదిలీ చేయాలని సీఎస్‌కు ఆదేశాలు - EC TRANSFERRED DGP