Konda Surekha Letter to EC on Bhadradri Live : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి కల్యాణ మహోత్సవాన్ని ప్రభుత్వం ప్రత్యక్షప్రసారం చేసేందుకు కేంద్ర ఎన్నికల కమిషన్ అనుమతి నిరాకరించింది. ఈ నేపథ్యంలో ఈ నెల 17న జరగనున్న కల్యాణ మహోత్సవాన్ని ప్రతి ఏడాది మాదిరిగా ప్రత్యక్ష ప్రసారం చేసేందుకు అనుమతివ్వాలని దేవాదాయ శాఖ ఈసీకి లేఖ రాసింది. ప్రత్యక్ష ప్రసారం చేయరాదని ఈసీ ఈ నెల 4న ప్రభుత్వానికి స్పష్టం చేసింది. కల్యాణ మహోత్సవం ప్రత్యక్ష ప్రసారంపై మరోసారి పరిశీలించి, అనుమతివ్వాలని కోరుతూ దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ తాజాగా రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్‌రాజ్‌కు లేఖ రాశారు.
భక్తుల మనోభావాలకు సంబంధించిన అంశం : శ్రీ సీతారామచంద్రస్వామి కల్యాణం దేశ ప్రజలు, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల భక్తుల మనోభావాలకు సంబంధించిన అంశమని, ప్రత్యక్షప్రసారం చేయడం సుమారు నలభై ఏళ్లుగా సంప్రదాయంగా ఉందని మంత్రి వివరించారు. కల్యాణ మహోత్సవం ప్రత్యక్ష ప్రసారాన్ని దేశ, విదేశాల్లోని లక్షల మంది వీక్షిస్తారని తెలిపారు. ఆలయం మారుమూల గిరిజన ప్రాంతంలో ఉన్నందున, కల్యాణ మహోత్సవానికి భక్తులు అందరూ హాజరు కాలేరని లేఖలో మంత్రి తెలిపారు. సుమారు నాలుగు వందల సంవత్సరాలుగా భద్రాచలం ఆలయం విశిష్టత, ఆచార సంప్రదాయాలు సమాజంలో అంతర్లీనమయ్యాయని వివరించారు.
భద్రాద్రి రామయ్య భక్తులకు గుడ్‌న్యూస్ - నవమి రోజు అందరికీ ఫ్రీ దర్శనం
దక్షిణాదిలోనే ప్రత్యేకత ఉందని, శ్రీరామచంద్ర స్వామి చతుర్భుజ రాముడిలా దిగివచ్చారని భక్తులు విశ్వసిస్తారని లేఖలో మంత్రి కొండా సురేఖ ప్రస్తావించారు. కుల, మత, జాతులకు అతీతంగా వివిధ ప్రాంతాల నుంచి భక్తులు కల్యాణ మహోత్సవానికి హాజరవుతారన్నారు. లక్షలాది భక్తుల మనోభావాలతో ముడిపడిన స్వామివారి కల్యాణ మహోత్సవం ప్రత్యక్ష ప్రసారానికి అనుమతివ్వాలని సీఈవోను మంత్రి కొండా సురేఖ కోరారు.
భద్రాద్రి రాముడు పెళ్లి కొడుకాయెనే, ఏప్రిల్ 17న కల్యాణానికి భారీ ఏర్పాట్లు
సర్వాంగ సుందరంగా ఆలయం ముస్తాబు : మరోవైపు భద్రాద్రి రామయ్య కల్యాణ ఘడియలు దగ్గర పడుతున్న వేళ, ఆలయం సర్వాంగ సుందరంగా ముస్తాబవుతోంది. దేశంలోనే రెండో అయోధ్యగా పేరుగాంచిన భద్రాచలం సీతారాముల కల్యాణం వీక్షించడానికి దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు వేల సంఖ్యలో కదలివస్తారు. కల్యాణ క్రతువులో పాల్గొనడం, దగ్గరుండి కల్యాణాన్ని చూడటం పూర్వజన్మ సుకృతంగా భావిస్తారు. సీతారాముల కల్యాణాన్ని నేరుగా వీక్షిస్తే, పాపాలన్నీ తొలగిపోయి అశ్వమేధ యాగం చేసినంత పుణ్యం కలుగుతుందని పురాణాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో భక్తులందరూ సీతారాముల కల్యాణాన్ని వీక్షించాలని కోరుకుంటుంటారు.
EC Focus On Digital Payments : డిజిటల్ చెల్లింపులపై ఈసీ నజర్.. రూ. లక్ష దాటితే లెక్క చెప్పాల్సిందే