Mahabubnagar Earthquake : మహబూబ్‌నగర్ జిల్లాలో మరోసారి భూమి కంపించింది. సరిగ్గా మధ్యాహ్నం 12 గంటల 15 నిమిషాలకు కౌకుంట్ల మండల పరిధిలోని దాసరిపల్లి గ్రామంలో పలుచోట్ల భూ ప్రకంపనలు వచ్చాయి. రిక్టర్ స్కేలుపై 3.0 తీవ్రత నమోదైంది. భూమి లోపల సుమారు 10 కిలోమీటర్ల లోతున భూకంపం వచ్చినట్లుగా నేషనల్ ఫర్ సిస్మోలజీ అధికారులు వెల్లడించారు.
దాసరిపల్లి గ్రామ సమీపంలోని ఓ మామిడి తోట దగ్గర ఏర్పాటు చేసి రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రతను పరీక్షించారు. భూకంపం అని తెలియడంతో గ్రామస్థులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. మూడు రోజుల కిందట తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గోదావరి నది పరివాహక జిల్లాలో భూకంపం సంభవించగా, ఈ రోజు(డిసెంబర్ 07న) మహబూబ్‌నగర్‌లోనూ ప్రకంపనలు వచ్చాయి. ప్రస్తుతం మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంగా కూడా భూప్రకంపనలు రావటంతో జనం తీవ్ర భయాందోళనలకు గురయ్యారు.
ఈనెల 4న తెలంగాణలోని పలు జిల్లాల్లో భూమి కంపించింది. వనదేవతల సన్నిధి మేడారం కేంద్రంగా భూమి కంపించింది. మళ్లీ ఇవాళ మహబూబ్ నగర్ జిల్లాల్లో పలుచోట్ల కంపించడంతో జిల్లా వాసులు భయాందోళనకు గురవుతున్నారు.
ఇసుక తవ్వకాలు ప్రభావం చూపిందా? : మరోవైపు వరుస భూ కంపాలకు కారణంపై నిపుణులు విశ్లేషణ జరుపుతున్నారు. గోదావరి పరివాహక ప్రాంతంలో దాదాపుగా పదేళ్ల క్రితం నుంచి భారీగా ఇసుక తవ్వకాలు చేపడుతున్నారు. భూగర్భ, పర్యావరణ, జలవనరుల శాఖ ఆధీనంలోనే సజావుగా ఈ ప్రక్రియ జరుగుతోంది. దశాబ్ద కాలం నుంచి కొన్ని లక్షల క్యూబిక్ మీటర్ల ఇసుకను తవ్వి తరలించారు. ఇదే ఇప్పుడు ఈ ఆపదకు కారణమైందని పర్యావరణ శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు. నదిలో లోతుగా ఇసుకను తవ్వడంతో భూమి పొరల్లోకి నీరు ఇంకకపోవడం, భూగర్భజలాలు తగ్గి అది పలకల్లో ప్రభావం చూపి కంపించేందుకు అవకాశం ఉందని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అయితే దీనిపై ఇంకా అధికారిక ప్రకటన మాత్రం రాలేదు. అడ్డగోలుగా ఇసుక తవ్వకాలు, అక్రమ మైనింగ్‌తో మానవాళికి ఎప్పటికైనా ప్రమాదమేనని పర్యావరణ వేత్తలు హెచ్చరిస్తున్నారు.