Earth Hour 2024 In Hyderabad : రాత్రిపూట విద్యుత్ వెలుగులతో జిగేల్‌మనే హైదరాబాద్ ఈరోజు రాత్రి గంటపాటు చీకటిగా మారింది. సచివాలయం, అంబేడ్కర్ విగ్రహం పరిసరాలు, బుద్ధ విగ్రహం, దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి, చార్మినార్, ప్రభుత్వ కార్యాలయంల్లోనూ రాత్రి 8.30 నుంచి 9.30 నిమిషాల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేశారు. పర్యావరణ హితం కోసం సచివాలయం, రాజ్యాంగ నిర్మాత భారీ విగ్రహం వద్ద ఎర్త్‌అవర్, విద్యుత్ పొదుపుపై అవగాహనే లక్ష్యంగా దేశంలోని పలు నగరాల్లో శనివారం ‘ఎర్త్ అవర్’ నిర్వహించారు.
ప్రముఖ కట్టడాలతో పాటు ప్రభుత్వ భవనాలు, కార్యాలయాల్లోనూ రాత్రి గంటపాటు విద్యుత్ దీపాలన్నీ ఆర్పివేశారు. వరల్డ్ వైడ్ ఫండ్ ఫర్ నేచర్ (డబ్ల్యూడబ్ల్యూఎఫ్) సంస్థ ఇవాళ రాత్రి 8:30 గంటల నుంచి 9:30 గంటల వరకు ఎర్త్‌అవర్‌కు పిలుపునిచ్చింది. ఈ సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా అత్యవసరం కాని విద్యుత్ వాడకాన్ని నిలిపేశారు. ఇందులో భాగంగా నగరంలోనూ పాటించారు.
Awareness on Pollution Emissions : థర్మల్ ప్లాంట్ల విద్యుదుత్ ఉత్పత్తి కారణంగా కాలుష్య ఉద్గారాలు పెద్దఎత్తున వాతావరణంలో కలుస్తున్నాయి. సౌర, పవన విద్యుత్ ఉన్నా వాటి వాడకం పరిమితమే. దీనిపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు వరల్డ్ వైడ్ ఫండ్ ఫర్ నేచర్ (డబ్ల్యూడబ్ల్యూఎఫ్) ఏటా మార్చిలో ఎర్త్‌అవర్ (EARTH HOUR in Worldwide)నిర్వహించింది.
ప్రకృతికి ఎంత మేలంటే? : గ్రేటర్ హైదరాబాద్‌లో మార్చిలో శనివారం విద్యుత్ డిమాండ్ తీరుతెన్నులను గమనిస్తే ఈ నెల 2న 3137 మెగావాట్లుగా, 9న 3144 మెగావాట్లు, 16న 3477 మెగావాట్లు నమోదైంది. ఇవన్నీ కూడా రాత్రి 8 గంటల సమయంలో రికార్డైన గరిష్ఠ డిమాండ్. ఈనెల 23న కూడా ఇంచుమించు 3500 మెగావాట్లుగా ఉండే అవకాశం ఉంది. ఇందులో లైటింగ్ కోసం కరెంట్ వాడకం 10 శాతం దాకా ఉంటుంది. అంటే 350 మెగావాట్ల వరకు ఉండే అవకాశం ఉంది. ఈ మేరకు విద్యుత్ ఆదా అవుతుంది.
బొగ్గు ఆధారిత ప్లాంట్లలో ఒక మెగావాట్ విద్యుత్ ఉత్పత్తి చేసేందుకు 900 నుంచి 1000 కిలో గ్రాముల కార్బన్‌డయాక్సైడ్ విడుదలవుతుంది. ఈ ప్రకారం హైదరాబాద్‌లో 350 మెగావాట్ల కరెంట్ ఆపడం ద్వారా దాదాపు 3.15 నుంచి 3.5 లక్షల కిలోల సీవో2 ఉద్గారాలు వాతావరణంలో కలవకుండా అడ్డుకోవచ్చు.
డిస్కం అప్రమత్తం : డబ్ల్యూడబ్ల్యూఎఫ్ ప్రతినిధులు తెలంగాణ ప్రభుత్వ సీనియర్ అధికారులతో ఇటీవల భేటీ అయ్యారు. ప్రభుత్వ కార్యాలయాలు, కట్టడాల చెంత కరెంట్ నిలిపివేయనున్నట్లు అధికారులు పేర్కొన్నారు. దీంతో విద్యుత్ పంపిణీ సంస్థ, పోలీసు శాఖ అప్రమత్తమైంది. గ్రిడ్‌కు ఇబ్బంది కలగకుండా విద్యుత్ అధికారులు పర్యవేక్షించారు.