Deputy CM Bhatti Vikramarka On 16th Finance Commission Points : రాష్ట్రానికి భారంగా మారిన రుణాలను రీ-స్ట్రక్చరింగ్ చేయాలని 16వ ఆర్థిక సంఘాన్ని కోరినట్లు ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక సంఘానికి చేసిన విజ్ఞప్తులను ఆయన మీడియా సమావేశం ఏర్పాటు చేసి వెల్లడించారు. కేంద్ర పన్నుల నుంచి రాష్ట్రాలకు వచ్చే ఆదాయం వాటాను 41 శాతం నుంచి 50 శాతానికి పెంచాలని విన్నవించినట్లు చెప్పారు.
కేంద్ర పథకాలను వినియోగించుకోవాలంటే కఠినమైన నిబంధనలు విధిస్తున్నారని భట్టి పేర్కొన్నారు. దీనివల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని అన్నారు. రాష్ట్రాలు తమ అవసరాలకు అనుగుణంగా కేంద్ర ప్రాయోజిత పథకాలు వినియోగించుకునేలా స్వయం ప్రతిపత్తి కల్పించాలని ఆర్థిక సంఘాన్ని కోరినట్లు తెలిపారు. రాష్ట్రాల అవసరాలను కేంద్రం తప్పక పరిగణనలోకి తీసుకోవాలని, కొన్నాళ్లుగా కేంద్ర విధానాలు మూస ధోరణిలో ఉంటున్నాయని పేర్కొన్నారు.
ఆదాయమంతా అప్పులకే : దేశమంతా ఒకే విధంగా ఉండేలా విధానాలు రూపొందిస్తున్నాయన్న డిప్యూటీ సీఎం, ఒక్కో రాష్ట్రానికి ఒక్కోవిధమైన అవసరాలు ఉంటాయనేది పట్టించుకోవటం లేదని వ్యాఖ్యానించారు. అన్ని రాష్ట్రాల అవసరాలపై దిల్లీలో కూర్చుని విధానాలు రూపొందిస్తున్నారని అన్నారు. గత పాలకులు చేసిన అప్పులపై ప్రతినెలా వడ్డీలకే భారీగా చెల్లిస్తున్నామని తెలిపారు. గత ప్రభుత్వం అధిక వడ్డీలకు భారీగా అప్పులు తెచ్చిందని దుయ్యబట్టారు. ప్రస్తుతం రాష్ట్ర ఆదాయమంతా అప్పులు చెల్లించేందుకే సరిపోతోందని వెల్లడించారు.
"ధనిక రాష్ట్రంగా ఉన్న తెలంగాణ, గత పాలకులు చేసిన విపరీత అప్పులకు కుదేలైంది. అది ఏ స్థాయికి చేరుకుందంటే, ప్రతినెలా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే జీతాలు మొత్తం రూ.5 వేల కోట్లు అయితే వారు చేసిన అప్పులకు కట్టే వడ్డీలు అంతకంటే ఎక్కువగా ఉంటున్నాయి. పదేళ్ల తర్వాత కట్టాల్సిన కండిషన్స్తో తెచ్చిన అప్పులు ఇప్పుడు మేము అధికారంలోకి రాగానే కట్టాల్సిన బాధ్యత మాపై పడింది. ఆ కట్టే భారం రాష్ట్రాభివృద్ధి అవసరాలను తీర్చడానికి ఏమాత్రం వెసులుబాటు కాకుండా అప్పులు కట్టటానికే ధనమంతా అయిపోతోంది. అందుకే కేంద్రాన్ని కొంత రీస్ట్రక్చరింగ్ చేయమని అడిగాం." -భట్టి విక్రమార్క, ఉప ముఖ్యమంత్రి
తెలంగాణలో ఆదాయ అసమానతలు ఎక్కువ : ప్రస్తుత విధానం వల్ల తలసరి ఆదాయం బాగున్న రాష్ట్రాలకు తక్కువ నిధులు వస్తున్నాయని, తెలంగాణ తలసరి ఆదాయం బాగున్నందున భారీగా నిధులు కోల్పోవాల్సి వస్తుందని ఉప ముఖ్యమంత్రి వాపోయారు. అన్ని రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణలో భిన్న పరిస్థితులు ఉన్నాయని తెలిపారు. రాష్ట్రంలో ఆదాయ అసమానతలు ఎక్కువగా ఉన్నాయన్న ఆయన, చాలా తక్కువ మంది చేతిలో ఎక్కువ సంపద కేంద్రీకృతమై ఉందని వ్యాఖ్యానించారు. ఒకటి రెండు జిల్లాల్లో ప్రజల ఆదాయం, తలసరి ఆదాయం మెరుగ్గా ఉందని, కొన్ని జిల్లాల్లో ప్రజలకు ఉపాధి, ఆదాయం చాలా తక్కువగా ఉందని వివరించారు.