Cyber Crime Awareness Themed Ganesh Pandal : తళతళ మెరిసే దీపాలు రంగురంగుల పూలతో వినాయక మండపం అలంకరించటం చూసే ఉంటారు. కానీ ఈ యువత అందుకు భిన్నం. భక్తి భావంతో పాటు సమాజ హితమూ ముఖ్యమే అంటారు. అందుకే ఏటా ఒక్కో సామాజిక అంశం ఎంచుకుని ప్రజల్లో చైతన్యం నింపేందుకు ప్రయత్నిస్తుంటారు. ఈసారి వినూత్నంగా సైబర్ మోసాల పట్ల అవగాహన కల్పిస్తూ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నారు.
Variety Ganesh Pandal in Dubbaka : చూస్తున్నారుగా సైబర్‌నేరాలు జరిగే తీరు, వాటి కట్టడికి తీసుకోవాలసిన జాగ్రత్తలు తెలిసేలా ఫ్లెక్సీలతో మండపం ఎలా అలంకరించారో! ఇలా వైవిధ్యంగా ఆలోచించి అందరి మన్ననలు పొందుతున్నారు సిద్దిపేట జిల్లా దుబ్బాకలోని యువ కిరణం స్పోర్ట్స్ అసోసియేషన్ సభ్యులు. సమాజంలో సైబర్ నేరాల సంఖ్య పెరుగుతుండటం నిరక్షరాస్యులు, విద్యావంతులు అనే తేడా లేకుండా ఆన్‌లైన్ మోసాలకు బలవ్వటం చూసి ఈ అంశం ఎంచుకున్నామని చెబుతున్నారు ఈ యువత.
"వినాయక మండపానికి దైవ దర్శనానికి వచ్చిన భక్తులు సైబర్ మోసాల పట్ల అప్రమత్తంగా ఎలా ఉండాలి, సైబర్ నేరగాళ్లు ఎలా మోసం చేస్తున్నారనే విషయాలను తెలుసుకొని తిరిగి వెళ్లడం సంతోషంగా ఉంది. ప్రస్తుతం చాలా మంది సైబర్ కేటుగాళ్ల చేతిలో మోసపోయి కష్టపడి సంపాదించిన సొమ్మంతా పోగొట్టుకుంటున్నారు. కొంతమంది మోసానికి గురై ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. అలాంటి వారికి అవగాహన కల్పించేందుకు ఇది మా వంతు ప్రయత్నం." - దుబ్బాకలోని యువ కిరణం స్పోర్ట్స్ అసోసియేషన్ సభ్యులు
అమాయకంగా సైబర్ వలలో చిక్కుకోకుండా చేతనైనంత మందిని అప్రమత్తం చేయాలనేదే తమ ప్రయత్నం అంటున్నారు. ఈ విషయం తెలిసి..వీరిని 'ఎక్స్' ద్వారా ప్రత్యేకంగా అభినందించారు తెలంగాణ ఆర్టీసీ ఎండీ వీసీ.సజ్జనార్. సమాజం పట్ల బాధ్యతతో సైబర్ నేరాల నియంత్రణపై కృషి చేస్తున్నారంటూ కొనియాడారు. దీంతో ఒక్కసారిగా దుబ్బాక యూత్ గురించి అందరికీ తెలియడంతో నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.
గతేడాది ఇలాగే ఓటు విలువ, అవసరం తెలియజేస్తూ మండపం ఏర్పాటు చేశారు దుబ్బాక యూత్. అప్పుడు భక్తుల నుంచి మంచి స్పందన రావడంతో ఈ సారి సైబర్ నేరాల గురించి చెప్పాలనుకున్నామని అంటున్నారు. బెట్టింగ్, లోన్ యాప్‌లు, అంటూ ప్రాణాలు తీసుకునే వారిని చూసే...తమ వంతుగా ఈ చిన్న ప్రయత్నం చేశామని చెబుతున్నారు. ప్రముఖులు, నెటిజన్లు ప్రశంసలతో మరింత ఉత్సాహం ఉందంటున్నారు దుబ్బాక యూత్. ప్రతి వినాయక చవితి నాడు ఇలాగే ఏదోక విషయంపై ప్రజలకు అవగాహన కల్పిస్తామని అంటున్నారు.