Drunken RTC Bus put 58 Passengers at Risk : మద్యం మత్తులో ఉన్న ఆర్టీసీ బస్సు డ్రైవర్ తీరుతో 58 మంది మేడారం భక్తులు అటవీ ప్రాంతంలో తీవ్ర ఇబ్బందులు పడ్డారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ - కాళేశ్వరం జాతీయ రహదారి మార్గంలో మేడారం వెళ్లే మహారాష్ట్రకు చెందిన 58 మంది భక్తులు ఇక్కట్లు పడ్డారు. వివరాల్లోకెళ్తే మహారాష్ట్ర సిరోంచ నుంచి మేడారం వెళ్లే భక్తులు భూపాలపల్లి డిపోకు చెందిన ఆర్టీసీ బస్సులో టికెట్ తీసుకొని బయల్దేరారు. ఆర్టీసీ డ్రైవర్ మద్యం మత్తులో ఉండటం గమనించిన ప్రయాణికులు బస్సు ఆపమని కోరినప్పటికీ ఆపకుండా వచ్చాడు.
మహాదేవపూర్ కాళేశ్వరం జాతీయ రహదారి మార్గంలో మూడు ప్రాంతాలలో ప్రమాదం తృటిలో తప్పడంతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. దీంతో వారంతా డ్రైవర్‌ను గట్టిగా నిలదీయడంతో, బస్సును నిలిపి వేశాడు. అటవీ ప్రాంతం కావడంతో మూడు గంటలకు పైగా వేచి చూస్తూ ఇబ్బందులు పడ్డారు. ఈ క్రమంలో మేడారం వెళ్లే భక్తులు అగ్రహం వ్యక్తం చేశారు. డ్రైవర్ మద్యం మత్తులో ఉన్నారని సీరోంచ వద్ద ఉన్న కంట్రోలర్‌కు చెప్పినప్పటికీ పట్టించుకోలేదని తెలిపారు. తాము ప్రాణాలతో బయటపడినప్పటికీ రోడ్డుపైన వేచి చూడాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు.
Tractor accident at Medaram : మరోవైపు మేడారం వెళ్లే భక్తుల ట్రాక్టర్ బోల్తా పడి పలువురికి స్వల్ప గాయాలు అయ్యాయి. ములుగు జిల్లా మమ్మద్ గౌస్‌పల్లి గ్రామ సమీపంలో హనుమాన్ విగ్రహం వద్ద 163 జాతీయ రహదారిపై మేడారం వెళ్లే భక్తుల ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణాలు నష్టం జరగకుండా స్వల్ప గాయాలతో బయటపడ్డారు.
విషయం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకొని స్వల్పంగా గాయపడిన వ్యక్తులను వరంగల్ ఎంజీఎంకు తరలించారు. ట్రాక్టర్ బోల్తా పడడంతో మేడారం వెళ్లే వాహనాలు నాలుగు కిలోమీటర్ల వరకు నిలిచిపోయాయి. దీంతో పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని ట్రాఫిక్ జామ్ కాకుండా వాహనాలను పంపించారు.
Devotees Going Medaram on Bull Cart : మరోవైపు సమ్మక్క - సారలమ్మలను దర్శించుకునేందుకు ములుగు జిల్లా వెంకటాపూర్ మండల కేంద్రం నుంచి ఎడ్ల బండి కట్టుకొని మేడారం జాతరకు బయలుదేరామని భక్తులు అంటున్నారు. పూర్వంలో తాత ముత్తాతలు ఎడ్ల బండి కట్టుకొని ఆచారంగా ప్రతి జాతరకు పిల్లాపాపలతో కుటుంబ సమేతంగా కలిసి వచ్చేవారని గుర్తు చేసుకున్నారు. మేడారం జాతర అంటేనే ఎడ్లబండ్ల జాతరగా ఒకప్పుడు ఉండేదని అన్నారు. ములుగు, వరంగల్, భూపాలపల్లి, మహబూబాబాద్ జిల్లా నుంచే కాకుండా పక్క రాష్ట్రాల నుంచి కూడా వేలాది మంది భక్తులు ఎడ్ల బండి కట్టుకొని గోదావరి దాటి వచ్చేవారని పేర్కొన్నారు. ఆ ఆచారమే ఇప్పుడు కొనసాగిస్తున్నామని వివరించారు.
గొర్రెలు, మేకలతో ఆర్టీసీ బస్సులో పోనీయరా?, భూపాలపల్లి బస్టాండులో ప్రయాణికుల ఆందోళన