Collections in Driving Schools in Telangana : కారు అంటే ప్రతి ఒక్కరికి నడపాలని ఉంటుంది. అందుకే ఉద్యోగులు, యువత, గృహిణులు డ్రైవింగ్ నేర్చుకునేందుకు ఆసక్తి కనబరుస్తుంటారు. దీన్ని అదునుగా చూసుకొని డ్రైవింగ్ శిక్షణా కేంద్రాలు రెచ్చిపోతున్నాయి. ఇష్టానుసారం ఫీజులు వసూలు చేస్తున్నారు. డ్రైవింగ్ నేర్పిస్తే రూ.3 వేలు నుంచి రూ.4 వేలు వసూలు చేస్తున్నారు. అలాగే లైసెన్స్ ఇప్పిస్తామని చెప్పి అదనంగా మరో రూ.2 వేలు నుంచి రూ.3 వేలు వరకు వసూలు చేస్తున్నారు. వాస్తవంగా చెప్పాలంటే లైసెన్స్ ఇచ్చే అధికారం శిక్షణ కేంద్రాలకు లేదు. ఆర్డీఏ కార్యాలయంలో పెట్టే పరీక్షలో ఇబ్బంది లేకుండా ఉండేందుకు తామే ఇప్పిస్తామంటూ నిబంధనలకు విరుద్ధంగా డబ్బులు వసూలు చేస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలోని ఉన్న అన్ని డ్రైవింగ్ స్కూళ్లలో ఇదే తంతు జరుగుతుంది.
డ్రైవింగ్ స్కూల్స్ విధి : డ్రైవింగ్ స్కూళ్లలో చేరేవారికి 20 రోజులు వివిధ రకాల అంశాల్లో శిక్షణ ఇవ్వాలి. మొదట సిమ్యులేటర్‌పై నేర్పించడంతో పాటు తరగతిలో పాఠాలు బోధించాలి. చివరి దశలో మాత్రమే వాహనంలో కూర్చోబెట్టి ప్రాక్టికల్ శిక్షణ ఇస్తారు. కానీ రాష్ట్రంలోని చాలా జిల్లాల్లోని శిక్షణ కేంద్రాల్లో ఇవేమీ పాటించట్లేదు. వారం నుంచి 10 రోజుల పాటు రహదారులపై స్టీరింగ్ అప్పగించి తిప్పుతున్నారు. చాలా తక్కువ సమయంలో ఎక్కువ మందికి నేర్పిస్తున్నారు.
డబ్బులకు ఆశపడి లైసెన్సులు : ఆర్టీఏ కార్యాలయంలో ఎలాంటి పరీక్ష పెట్టకుండా డబ్బులకు ఆశపడి లైసెన్స్‌లు ఇప్పిస్తున్నారు. శిక్షణ ఇచ్చే ముందు రవాణా శాఖ అనుమతి కలిగిన రిజిస్టర్డు నంబరు వాహనాన్ని వినియోగించాలి. కానీ చాలా చోట్ల ఫిట్నెస్ లేని వాటిని రోడ్డెక్కిస్తున్నారు. నంబరు ప్లేట్ లేనివి, కాలపరిమితి తీరిన వాటిపై శిక్షణ ఇస్తున్నారు. ఒకే వాహనానికి అనుమతి ఉంటే రెండు, మూడు కార్లకు బోర్డులు పెట్టి శిక్షణ ఇస్తున్నారు.
కరోనా తర్వాత వాహనాల వినియోగం : కరోనా తర్వాత ప్రైవేట్ వాహనాల వినియోగం అధికమైంది. కార్ల అమ్మకాలు భారీగా పెరిగాయి. ఇటీవలె కాలంలో ఆడా, మగ తేడా లేకుండా డ్రైవింగ్ నేర్చుకుంటున్నారు. దీన్ని ఆసరాగా చేసుకొని శిక్షణ కేంద్రాల నిర్వాహకులు వ్యవహరిస్తున్నారు. పూర్తి స్థాయిలో నడవడం నేర్పకుండానే, భద్రతా సూచికలపై అవగాహన కల్పించకుండానే లైసెన్స్‌లు ఇప్పిస్తున్నారు. వాహనాన్ని ఎలా నడపాలని మాత్రమే చెబుతూ రహదారి నిబంధనలపై పూర్తి స్థాయిలో చెప్పట్లేదు. ఈ కారణంగా ఇటీవల కాలంలో రహదారి ప్రమాదాలు పెరుగుతున్నాయి.
తనిఖీల జాడేదీ : అనుమతి పొందిన డ్రైవింగ్ స్కూళ్లలో శిక్షణ ఎలా ఇస్తున్నారు. డ్రైవింగ్‌కు వినియోగిస్తున్న వాహనాల స్థితి, ఫీజుల తీరుపై రవాణా శాఖ అధికారులు నిఘా పెట్టాలి. రాష్ట్రంలో ఎక్కడా ఇలాంటి తనిఖీలు జరగడం లేదు. దీంతో శిక్షణ ఇస్తున్నవారు విచ్చలవిడిగా వ్యవహరిస్తున్నారు. రికార్డుల్లో పేర్కొన్న నంబరు కలిగిన వాహనం రోడ్లపై కనిపించదు. శిక్షణ కేంద్రాలను ఆన్లైన్ చేయకపోవడం నియంత్రనణ చేయడం లేదు. కొన్ని డ్రైవింగ్ స్కూళ్లలో అనుమతి గడువు దాటినా శిక్షణలు ఇస్తున్నారు. రోడ్డు ప్రమాదాలు పెరుగుతున్న నేపథ్యంలో కీలకమైన డ్రైవింగ్ శిక్షణపై పర్యవేక్షణ పెంచాల్సిన అవసరం ఉందని నిపుణులు తెలుపుతున్నారు.
డ్రైవింగ్ స్కూళ్లలో శిక్షణ, వినియోగిస్తున్న వాహనాల స్థితి, ఫీజుల తీరుపై రవాణా శాఖ అధికారులు తనిఖీలు చేపట్టాలి. డ్రైవింగ్ నేర్పిస్తున్న వాహనం ఎన్ని కిలోమీటర్లు తిరిగిందో పరిశీలించడం లేదు. రికార్డుల్లో పేర్కొన్న నంబరు కలిగిన వాహనం రోడ్లపై కనిపించదు. కొన్ని స్కూళ్లకు అనుమతి గడువు దాటినా శిక్షణలు ఇస్తున్నారు. ప్రమాదాలు పెరుగుతున్న నేపథ్యంలో కీలకమైన డ్రైవింగ్ శిక్షణపై పర్యవేక్షణ పెంచాల్సిన అవసరముంది.