Uravakonda Water Problem : అనంతపురం జిల్లా ఉరవకొండలోని పలు కాలనీల్లో ప్రజలు తాగునీటి కోసం ఉద్యమం చేస్తున్నారు. ప్రజలు దాహంతో తల్లడిల్లిపోతున్నారు. అయినా అధికారుల్లో మాత్రం చలనం రావడంలేదు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ఉరవకొండలోని చాలా కాలనీల్లో నీటి సమస్య ఉండేది. అప్పటి పాలకులు నిమ్మకు నీరెత్తినట్టు ఉండటంతో, ప్రజలు దాహార్తితో అలమటించారు. ఈ విషయంపై అధికారులకు స్థానికులు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా పట్టించుకోలేదు. పలుమార్లు రాస్తారోకోలు నిర్వహించారు. ఆర్డబ్ల్యూఎస్ కార్యాలయాన్ని ముట్టడించారు.
పట్టించుకోని అధికారులు : అయినా అప్పటి సర్కార్లో వారికి నిరాశే ఎదురైంది. కూటమి ప్రభుత్వం వచ్చాక కొంత మేర సమస్య పరిష్కారమైంది. అయినా ఇంకా పలు కాలనీల్లో కుళాయిలకు నీరు రావడంలేదని ఎస్ఎల్ఎన్ కాలనీ ప్రజలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దశాబ్దం క్రితం ఏర్పాటు చేసిన పైపులైన్ ద్వారా తాగునీటి విడుదల చేస్తున్నారని అవి శివారు కాలనీలకు చేరడం లేదని వాపోతున్నారు. దీంతో నీటిని కొనుగోలు చేసి తాగుతామని వారు చెబుతున్నారు.
"ఏడు నెలల నుంచి తాగునీరు సరిగ్గా రావడం లేదు. నీళ్లు కొనుక్కొని తాగుతున్నాం. అధికారులు చెప్పినా పట్టించుకోవడం లేదు. పైప్లైన్ ద్వారా నీటిని విడుదల చేస్తున్నా అవి అందడం లేదు. ఫోన్ చేస్తే అధికారులు నీటిని విడదల చేశాం పట్టుకోండని అంటారు. మేము పనులకు వెళ్లకుండా నీటి కోసం వేచి చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. గత ప్రభుత్వం మమల్ని పట్టించుకోలేదు. కూటమి ప్రభుత్వమైనా స్పందించి మా సమస్యను పరిష్కరించాలని కోరుతున్నాం." - హసీనా, ఉరవకొండ
ఎస్ఎల్ఎన్ కాలనీతో పాటు సీవీవీనగర్ హస్టల్ ప్రాంతం, లాల్స్వామి ఆలయ చుట్టపక్కల వీధులు, గ్యాస్ గోదాం చుట్టుపక్కల కాలనీల ప్రజలు తాగునీటి కోసం అల్లాడుతున్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో అధికారుల చుట్టూ తిరిగినా ఫలితం దక్కని శివారు కాలనీ వాసులు ఇప్పుడు కూటమి ప్రభుత్వం పైనే ఆశలు పెట్టుకున్నారు. తాగునీటి సమస్య త్వరగా పరిష్కరించాలని వేడుకుంటున్నారు. జనాభా పెరుగుదలకు అనుగుణంగా నీటి పథకాలను పెంచి సక్రమంగా నీటి సరఫరా అయ్యే చర్యలు చేపట్టాలని వారు కోరుతున్నారు.
గొంతెండుతున్నా పట్టించుకోరా - అధికారులను నిలదీసిన గ్రామస్థులు - DRINKING WATER PROBLEM
తాగునీటి కోసం చందాలు వేసుకున్న ప్రజలు - గ్రామంవైపు కన్నెత్తి చూడని అధికారులు