Bank Loan Scams In AP : ఏపీలోని పశ్చిమ గోదావరి జిల్లా తణుకు ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి విజయవాడలోని ఓ రుణ సంస్థ వద్ద ఇల్లు తనఖా పెట్టి రూ.20 లక్షల లోన్ తీసుకున్నారు. కొన్నాళ్ల తర్వాత ఫైనాన్స్ సంస్థ మేనేజర్‌నంటూ ఓ వ్యక్తి అక్కడి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి వెళ్లి ఆ లోన్ తీరిపోయిందంటూ డూప్లికేట్ పత్రాలు చూపించి, మార్ట్‌గేజ్ డీడ్ రిలీజ్ (తనఖా చెల్లు రసీదు) చేయించారు. మరికొద్ది రోజులకు అదే ఇంటిపై మరో రెండు ఫైనాన్స్ సంస్థల్లో రూ.కోటి అప్పు తీసుకున్నారు. వాటినీ ఇలాగే చెల్లించేసినట్లు చూపించి, మార్ట్‌గేజ్ డీడ్ రిలీజ్ మళ్లీ చేయించుకున్నారు. తాజాగా ఆ ఇంటిని వేరే వ్యక్తికి అమ్ముకుని చేతులు దులుపేసుకున్నాడు.
లోన్ మీద లోన్ : ఏలూరుకు చెందిన ఒక వ్యక్తి ప్రైవేటు బ్యాంకులో ఇల్లు తనఖా పెట్టి రూ.21 లక్షలు, విజయవాడకు చెందిన ఓ ఫైనాన్స్ కంపెనీలో మరో ఇద్దరు ఇంటి యజమానులు రూ.17.5 లక్షల చొప్పున రుణాలు తీసుకున్నారు. ఈ మూడు రుణాల మార్ట్‌గేజ్ రిలీజ్‌కు ఒకే వ్యక్తి వేర్వేరు సమయాల్లో ఏలూరు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి మేనేజరులా వెళ్లారు. నకిలీ పత్రాలు సమర్పించి, రుణం తీర్చేసినట్లు రసీదు పొందారు. ప్రస్తుతం ఆ ఇంటినీ అమ్మేశారు.
బ్యాంకులు, ప్రైవేటు ఫైనాన్స్ కంపెనీల వద్ద తీసుకున్న రుణాల ఎగవేయడానికి కొందరు అక్రమార్కులు వేసిన కొత్త మోసాలివి. కొందరు మాయగాళ్లు బ్యాంకు మేనేజర్ల అవతారం ఎత్తి గోల్మాల్ చేస్తున్నారు. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో అధికారులకు పెద్ద మొత్తంలో ముడుపులిచ్చి అప్పులు చెల్లించకుండానే మార్ట్‌గేజ్ డీడ్ రిలీజ్ చేయిస్తున్నారు. తర్వాత ఇతర బ్యాంకుల్లో రుణాలు తీసుకుని, చివరకు తనఖా పెట్టిన ఆస్తులను అమ్మేసి భారీ మోసాలకు పాల్పడుతున్నారు. ఈ తరహా వ్యవహారాలు ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా వ్యాప్తంగా జరగడం కలకలం సృష్టిస్తోంది.
ఏదైనా ఆస్తి తనఖా పెట్టుకున్నట్లు స్థానిక సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో రిజిస్టర్ చేస్తేనే మార్ట్‌గేజ్ లోన్ ఇస్తారు. ఆస్తిపత్రాలను మాత్రం బ్యాంకులోనే భద్రపరుస్తారు. రుణం చెల్లించగానే దానికి సంబంధించిన బ్యాంకు మేనేజర్ రిజిస్ట్రార్ కార్యాలయానికి వెళ్లి, అప్పు తీరినట్లు బ్యాంకుకు ఇచ్చిన పత్రాలు, ప్రాపర్టి పత్రాలు సమర్పించి మార్ట్‌గేజ్ డీడ్ రిలీజ్ చేయాలి. అప్పుడు ఈసీలో కూడా రుణం తీరినట్లు చూపిస్తుంది.
నకిలీ పత్రాలతో : రుణాలు చెల్లించకున్న పర్వాలేదు. ఇతర బ్యాంకుల్లో మీకు కావాల్సిన మొత్తం అప్పు ఇప్పిస్తాం. మీ ఆస్తులు అమ్ముకునే వెసులుబాటు కూడా కల్పిస్తాం అంటూ ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో ఓ ముఠా భారీ తరహా మోసాలకు తెరలేపింది. బ్యాంకుల్లో అప్పులు తీసుకుని, తీర్చలేక ఇబ్బంది పడుతున్న వారిని కొందరు మధ్యవర్తుల ద్వారా గుర్తిస్తున్నారు. బ్యాంకు మేనేజర్లుగా అవతారమెత్తి సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాలకు వెళ్లి రుణం తీరిపోయినట్లు ఆ పత్రాలిచ్చి మార్ట్‌గేజ్ డీడ్ తీస్తున్నారు. దీంతో ఈసీలో సైతం ఎలాంటి అప్పు లేనట్లు కనిపిస్తోంది. ఒక్కో రుణానికి దాని విలువను బట్టి రూ.లక్ష నుంచి మొదలుకొని రూ.3 లక్షల వరకు వీరు వసూలు చేస్తున్నారు.
ముడుపుల మత్తులో: ఇలాంటి వ్యవహారాల్లో సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయ సిబ్బంది, అధికారుల పాత్ర లేకుండా ఇలాంటి పనులు జరగదనేది కూడా వాస్తవమే. వచ్చింది బ్యాంకు మేనేజర్లా? డాక్యుమెంట్స్ నిజమైనవా కాదా? స్టాంపుల్లో ఏమైనా తేడాలున్నాయా అని కనీస చెకింగ్ కూడా చేయడం లేదు. కమీషన్లు తీసుకుని కళ్లు మూసుకుని పనులు చేసేస్తున్నారు. ఇలాంటి వ్యవహారాలు ఇప్పటివరకు దాదాపు 10 జరిగినట్లు సమాచారం. .
‘కొన్ని ప్రాంతాల్లో నకిలీ పత్రాలతో తాకట్టు పెట్టి ఉపసంహరణ చేస్తున్న విషయం వాస్తవమే. దీనిపై అన్ని కార్యాలయాల్లోని స్టాఫ్‌ని అప్రమత్తం చేశాం’
-పశ్చిమగోదావరి జిల్లాల రిజిస్ట్రార్లు కె.శ్రీనివాసరావు, ఎల్.వెంకటేశ్వర్లు