Stray Dog Attack on Boy in Nacharam: హైదరాబాద్ నగరంలో వీధి కుక్కలు స్వైర విహారం చేస్తున్నాయి. చిన్నాపెద్దా తేడా లేకుండా రోడ్లపై దొరికిన వారిని దొరికినట్లు కరుస్తూ బీభత్సం సృష్టిస్తున్నాయి. గుంపులు గుంపులుగా వీధుల్లో సంచరిస్తూ చిన్నారులపై దాడులకు దిగుతున్నాయి. తాజాగా ఇద్దరు చిన్నారులు ఆడుకుంటుంటే వారిపై ఒక్కసారిగా దాడికి దిగిన ఘటన నాచారంలో చోటుచేసుకుంది.
నాచారం రాఘవేంద్రనగర్‌లో బుధవారం సాయంత్రం వీధిలో ఇద్దరు చిన్నారులు ఆడుకుంటున్నారు. ఆ సమయంలో అక్కడికి వచ్చిన ఓ వీధి కుక్క చిన్నారులపై దాడి చేసి గాయపరిచింది. అందులో ఓ చిన్నారి తప్పించుకోగా, మరో బాలుడు తప్పించుకోలేకపోయాడు. బాలుడి అరుపులు విని ఇద్దరు యువకులు అక్కడికి చేరుకుని, కుక్కును తరిమే ప్రయత్నం చేయగా వారిపైనా దాడి చేయబోయింది.
యువకులు కుక్కను కొట్టి అక్కడి నుంచి తరిమేశారు. అనంతరం కుటుంబసభ్యులు చిన్నారులను స్థానికంగా ఉన్న ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లి చికిత్స అందించారు. ఈ ఘటనతో స్థానికులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. వెంటనే జీహెచ్‌ఎంసీ సిబ్పందికి సమాచారం ఇచ్చారు. అక్కడకు చేరుకున్న సిబ్బంది స్థానికంగా ఉన్న కుక్కలను పట్టుకుని అక్కడి నుంచి తరలించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా, జీహెచ్‌ఎంసీ సిబ్బంది ఎప్పటికప్పుడు కుక్కలను పట్టుకెళ్లాలని స్థానికులు కోరారు.
"నేను, నా ఫ్రెండ్ ఇంటి దగ్గర ఆడుకుంటున్నాము. ఒక్కసారిగా కుక్క మాపైకి వచ్చింది. నన్ను నా ఫ్రెండ్‌ను కరిచింది. తను తప్పించుకుని వెళ్లిపోతే, నన్ను బాగా కరిచింది. నేను అరిచేసరికి అక్కడ ఉన్న వాళ్లు వచ్చి నన్ను కాపాడారు. కుక్కను తరిమేశారు. తర్వాత నన్ను ఆసుపత్రికి తీసుకెళ్లారు." - బాధిత చిన్నారి
కుక్కలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు : ఇటీవల రాష్ట్రంలో కుక్కల దాడులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. వీటి దాడులకు కొంతమంది గాయపడుతుండగా, మరికొందరు మరణిస్తున్నారు. మనుషులపై శునకాలు చేస్తున్న దాడులు పెరిగిపోవడంతో సుప్రీంకోర్టు ఆదేశాలతో రాష్ట్ర ప్రభుత్వం కుక్కలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేసేందుకు రంగం సిద్ధం చేసింది.పెద్దపల్లి జిల్లా రామగుండం కార్పొరేషన్ పరిధి మల్కాపూర్‌లో హైదరాబాద్‌కు చెందిన యానిమల్ వెల్ఫేర్ సొసైటీ వారి ఆధ్వర్యంలో యానిమల్ బర్త్ కంట్రోల్ సెంటర్‌ను ఏర్పాటు చేశారు. ఈ కేంద్రంలో ఒక ఆపరేషన్ థియేటర్, 50 కుక్కలను ఉంచడానికి అవసరమైన బోన్లు ఏర్పాటు చేశారు.