Diwali Celebration begins in Telangana : రాష్ట్రవ్యాప్తంగా ప్రమిదల పండగ కోలాహలం నెలకొంది. చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా ప్రజలంతా సంతోషంతో దీపావళిని జరుపుకుంటారు. చిన్నా, పెద్దా అని తేడా లేకుండా వెలుగుల వేడుకలను ఆస్వాదిస్తారు. అందరి ఇళ్లల్లో కొత్త కాంతులు విరజిమ్మాలని నూతన ఉత్సాహంతో పండగను జరుపుకుంటారు. దీపావళి రోజు టపాసులు కాల్చడం, బొమ్మల కొలువులు, ప్రమిదుల్లో నూనె పోసి దీపాలు వెలిగించడం, విద్యుత్ అలకరణ వస్తువులకు ఎంతో ప్రాముఖ్యత ఇస్తారు. దీపావళికి ముందు వాటి కొనుగోళ్లతో మార్కెట్లన్నీ రద్దీగా మారాయి.
దీపావళి అంటే పటాకుల మోత మోగించాల్సిందే. కాకరపూల వెలుగులు, టపాసుల ఢాం ఢాం శబ్దాలతో హైదరాబాద్‌లో పండగశోభ సంతరించుకుంది. వివిధ రకాలైన పటాకులు, క్రాకర్స్ మార్కెట్లలో అందుబాటులో ఉన్నాయి. పండగ సందర్భంగా ప్రజల తాకిడితో స్వీట్ షాపులన్నీ కళకళలాడుతున్నాయి. గతేడాది కంటే ఈసారి ధరలు తక్కువగానే ఉన్నాయని వ్యాపారులు చెబుతున్నారు. మునుపెన్నడూ లేని విధంగా అన్ని వస్తువుల ధరలు వినియోగదారులకు అందుబాటులోనే ఉన్నట్లు చెబుతున్నారు. జిల్లాల్లో దీపావళి సందడి సంతరించుకుంది. ప్రమిదులు, బాణాసంచా సామగ్రి కొనుగోళ్లతో మార్కెట్లు రద్దీగామారాయి.
రద్దీగా మారిన బాణాసంచా మార్కెట్లు : విభిన్న ఆకృతులతో తయారుచేసిన విద్యుత్ దీపాలు కొనుగోలుదార్లని కట్టిపడేస్తున్నాయి. వరంగల్ జిల్లా రంగలీల మైదానంలో ఏర్పాటుచేసిన 53 అడుగుల భారీ నరకాసురుని వధ ఆకట్టుకుంది. కరీంనగర్ మార్కెట్లనీ బాణాసంచా కొనుగోలు దారులతో రద్దీగా మారాయి. బాణాసంచా దుకాణాల వద్ద ఎలాంటి ప్రమాదాలు జరగకుండా అధికారులు చర్యలు చేపట్టారు. నిజామాబాద్‌లోని బాణాసంచా దుకాణాలు కొనుగోలుదారులతో కిక్కిరిసిపోయాయి. ఇళ్లను దీపకాంతులతో నింపేలా ప్రజలు సామాగ్రిని కొనుగోలు చేశారు. అభిరుచికి తగ్గట్లుగా వ్యాపారులు విభిన్న ఆకృతులలో ప్రమిదలు, కొవ్వొత్తులు అందుబాటులో ఉంచారు.
దీపావళిని మన దేశంలోనే కాకుండా విదేశాల్లో ఘనంగా జరుపుకుంటారు. నేపాల్, బాలి, సింగపూర్, శ్రీలంక సహా పలుదేశాల్లో దీపావళి సందడి కనిపిస్తుంది. అమెరికా వైట్‌హౌస్‌లో ప్రత్యేక వేడుక జరిపారు. దక్షిణ భారతదేశంలో దీపావళిని 3 నుంచి 7 రోజుల పాటు వివిధ రకాలుగా జరుపుకుంటారు. పలుప్రాంతాల్లో నరకాసుర వద నిర్వహించడం ఆనవాయితీ. పండగ రోజుల్లో ప్రతి ఊరిలో సాంస్కృతిక కార్యక్రమాలకు అధిక ప్రాధాన్యతనిస్తారు. దీపావళి పండుక్కి ఏదైనా అనుకోని ఘటన జరిగితే 10 నిమిషాల్లో చేరుకునేలా కార్యాచరణ ప్రణాళిక రూపొందించి అన్ని అగ్నిమాపక కేంద్రాలకు అప్రమత్తం చేశారు.
ఎప్పుడూ రొటీన్‌గా అవే ఎందుకు? - ఈ దీపావళికి ఈ గ్రీన్ క్రాకర్స్ ట్రై చేయండి
టపాసులు కాల్చేటప్పుడు కచ్చితంగా ఇవి పాటించండి - అప్పుడే 'హ్యాపీ దీపావళి'