Diwali Celebrations Across AP: రాష్ట్రవ్యాప్తంగా దీపావళి సందడి మొదలైంది. టపాసులు కొనుగోలు చేసేందుకు చిన్నారుల తల్లిదండ్రులు, యువకులు బాణసంచా దుకాణాలకు బారులు తీరారు. వినియోగదారులను ఆకట్టుకునేలా వ్యాపారుల వివిధ రకాల పటాకులను అందుబాటులోకి తీసుకొచ్చారు. ఐతే ధరలు మాత్రం సామాన్యుడికి అందుబాటులో లేవని కొనుగోలుదారులు చెబుతున్నారు. వెలుగులు పంచే పండుగకు కొందరు తమ బంధువులకు మిఠాయిలు పంచి సంతోషం వ్యక్తం చేసుకుంటారు.
Vijayawada: విజయవాడలోని వివిధ ప్రాంతాల్లో బాణాసంచా కొనుగోలుదారులతో వాతావరణం సందడిగా మారిపోయింది. పిల్లలతో కలిసి స్టాల్స్‌కు వచ్చిన వినియోగదారులు పెద్దమొత్తంలో కొనుగోలు చేస్తున్నారు. బాణాసంచా ధరలకు, అమ్మే ధరలకు పొంతనలేకుండా పోయింది. భారీగా ఎంఆర్పీ ధరలు ఉండటంతో 60 నుంచి 80 శాతం వరకు వ్యాపారులు రాయితీ ఇస్తున్నారు. పిల్లల కోరిక మేరకు కొనాల్సి వస్తుందని తల్లిదండ్రులు చెబుతున్నారు. ధరలు కాస్త ఎక్కువైనప్పటికీ పండగ రీత్యా తప్పడం లేదని వారు చెబుతున్నారు.
Kakinada District: కాకినాడ జిల్లాలోని కేంద్రపాలిత ప్రాంతం యానాం ప్రధాన రహదారుల ప్రక్కన వందలాదిగా దుకాణాలు వెలిశాయి. పట్టణంలోనూ 15 వరకు హోల్‌సేల్, రిటైల్ షాపులు ఏర్పాటుకు రెవెన్యూ అధికారులు అనుమతించారు. ఉభయగోదావరి జిల్లాలోని అనేకమంది వ్యాపారులు యానాం పరిసర ప్రాంతంలోని ప్రజలు యానాంకు అధిక సంఖ్యలో బాణసంచా కొనుగోలుకు రావడంతో రహదారులన్నీ కిక్కిరిసిపోయాయి.
ఆ గ్రామానికి దీపావళి 70ఏళ్ల దూరం - 'ఎప్పుడూ అలాగే జరుగుతోంది' అంటున్న వృద్ధులు
Visakhapatnam: విశాఖలోని సన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ సంస్థ విద్యార్థులు దీపావళి వేడుకలను సంప్రదాయబద్ధంగా జరుపుకున్నారు. రంగవల్లికలు పూలతో తీర్చిదిద్ది, చక్కగా దీపాల అలంకరణ చేసి విద్యుత్ దీపాల కాంతులతో ప్రాంగణాన్ని శోభాయమానంగా సిద్ధం చేశారు. సంప్రదాయ బద్ధంగా పూజాది కార్యక్రమాలు నిర్వహించి మిఠాయిలు పంచుకొని ఆనందాన్ని ఆస్వాదించారు.
Parvathipuram Manyam District: దీపావళి పర్వదినం పురస్కరించుకొని పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండ పట్టణంలో కోట దుర్గమ్మకు ప్రత్యేక పూజలు చేశారు. సుమారు వెయ్యి మంది మహిళలు ప్రత్యేక పూజలు చేశారు. అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి మహాలక్ష్మీ కుంకుమ పూజలు నిర్వహించారు. అనంతరం మట్టికుంపట్లలో మహిళలు దీపాలు వెలిగించి అమ్మవారికి పూజలు చేశారు.
Kadapa District: కడపలో దీపావళి సందడి మొదలైంది. స్థానిక మున్సిపల్ మైదానంలో ఏర్పాటు చేసిన దుకాణాల వద్ద ప్రజలు బారులు తీరారు. టపాసులు కొనుగోలు చేసేందుకు పెద్దఎత్తున తరలివచ్చారు. టపాసులు అధిక ధరకు విక్రయిస్తున్నారని కొనుగోలుదారులు తెలిపారు. టపాసులు దుకాణాల వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అగ్నిమాపక శాఖ సిబ్బందిని ఏర్పాటు చేశారు.
దీపావళి వేళ పేలుతున్న ధరలు - సామాన్యుల కష్టాలు
Nellore District: నెల్లూరులో దీపావళి సందడి నెలకొంది. నగరంలో టపాకాయల దుకాణాలు కొనుగోలుదారులతో రద్దీగా దర్శనమిస్తున్నాయి. నగరంలో వీఆర్సీ, వైఎంసీ గ్రౌండ్, స్టౌన్ హౌస్ పేట ప్రాంతాలతో పాటూ ముత్తుకూరు రోడ్డు, మినిబైపాస్ రోడ్డు ప్రాంతాల్లో పెద్దసంఖ్యలో బాణసంచా దుకాణాలు ఏర్పాటు చేశారు. చిన్నా, పెద్ద అన్న తేడా లేకుండా కాల్చుకునే టపాసుల ధరలు మాత్రం ఏటేటా పెరుగుతూనే ఉన్నాయి. కొందరు వ్యాపారులు డిస్కౌంట్ రేట్లు ప్రకటించి వినియోగదారులను ఆకర్షిస్తుండగా, మరికొందరు కిలోల లెక్కన అమ్మకాలు చేస్తున్నారు.
Prakash District: ప్రకాశం జిల్లా మార్కాపురంలో నరకాసురుడి సంహరణ కార్యక్రమం ఘనంగా జరిగింది. దీపావళిని పురస్కరించుకొని స్థానిక రాజాజీ వీధి, నాయుడు బజార్లో నరకాసురుడి బొమ్మలను ఏర్పాటు చేశారు. శాస్త్రం ప్రకారం శ్రీ రుక్మిణీ సత్యభామ సమేతగా శ్రీ మురళీ కృష్ణ అవతారంలో శ్రీ చెన్నకేశవ స్వామిని ఊరేగింపుగా తీసుకొచ్చి నరకాసురుడిని వధించారు. అలానే ఒంగోలులో నరకాసురిని వధ కార్యక్రమం ఘనంగా జరిగింది 36 అడుగులు నరకాసుని బొమ్మను తయారు చేసి, బాణసంచాతో దహనం చేసారు.
హరిత దీపావళిని ఇలా చేసుకుందాం - ఈ కుటుంబమే మనందరికీ స్ఫూర్తి