Dispute between Cotton Seed Companies and Organizers : నేరుగా రైతులతో ఒప్పందాలు చేసుకోకుండా దశాబ్దాలుగా మధ్యవర్తులను నమ్మి విత్తనపత్తి సాగు చేయించిన కంపెనీలను, అదే మధ్యవర్తులు నిండా ముంచడంతో ఆయా విత్తన కంపెనీలు పోలీసులను ఆశ్రయించడం జోగులాంబ గద్వాల జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. జిల్లాలో సుమారు 30వేల ఎకరాల్లో విత్తనపత్తి సాగవుతోంది. పత్తివిత్తనాలు ఉత్పత్తి చేసే కంపెనీలు రైతులతో ఒప్పందాలు చేసుకుని విత్తనోత్పత్తి చేపట్టవచ్చు. కానీ ఇక్కడ మాత్రం కంపెనీలు దశాబ్దాలుగా మధ్యవర్తుల ద్వారా రైతులతో విత్తనపత్తిని సాగు చేయిస్తున్నాయి. కంపెనీలు ఫౌండేషన్ సీడ్‌ను మధ్యవర్తులకిస్తే వాళ్లు రైతులకిచ్చి సాగు చేయిస్తారు. దాంతో ఉత్పత్తి అయిన సర్టిఫైడ్ విత్తనాలను తిరిగి కంపెనీలకు అప్పగిస్తారు. ఏళ్లుగా నడిగడ్డలో జరుగుతున్న తంతు ఇదే.
ఇటీవల కొంతమంది మధ్యవర్తులు కంపెనీలిచ్చిన ఫౌండేషన్ సీడ్‌ను రైతులకిచ్చి సాగు చేయించారు. కానీ రైతులు ఉత్పత్తి చేసిన సర్టిఫైడ్ విత్తనాలను మాత్రం తిరిగి కంపెనీలకు మధ్యవర్తులు అప్పగించలేదు. అలా 3-4 కంపెనీలకు అందాల్సిన సుమారు 25 కోట్లు విలువ చేసే 10 లక్షల కిలోల సర్టిఫైడ్ విత్తనాలు(Certified seeds) ఆయా సంస్థలకు చేరలేదని సమాచారం. ఉత్పత్తైన విత్తనాలు ఎందుకివ్వలేదని కంపెనీలు ప్రశ్నించగా అసలు పంటే పండలేదని మధ్యవర్తులు సమాధానం దాటవేసినట్లు తెలుస్తోంది. క్షేత్రస్థాయిలో రైతులను విచారించిన కంపెనీలు మధ్యవర్తులకు విత్తనాలు అందినా, కంపెనీలకు ఇవ్వకుండా వాటిని పక్కదారి పట్టించారని గుర్తించాయి.
పత్తి విత్తనాలను ఉత్పత్తి చేసేందుకు కంపెనీలు ఫౌండేషన్ సీడ్ ఇచ్చి రైతులు ఉత్పత్తి చేసిన సర్టిఫైడ్ విత్తనాలను మధ్యవర్తుల ద్వారా కిలోకు 450 రూపాయలు చెల్లించి తీసుకుంటాయి. ఈసారి పత్తి విత్తనాలకు బహిరంగ మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. దీన్ని సొమ్ము చేసుకోవాలని భావించిన చిన్నాచితకా కంపెనీలు కిలోకు 650 రూపాయల వరకూ చెల్లిస్తామని, విత్తనాలు తమకు అమ్మాలని మధ్యవర్తులతో ఒప్పందం చేసుకున్నట్లు తెలుస్తోంది. అందుకు అంగీకరించిన కొంతమంది ఆర్గనైజర్లు ఫౌండేషన్ సీడ్ ఇచ్చిన ప్రధాన కంపెనీలకు కాకుండా ఉత్పత్తి అయిన విత్తనాలను ఇతర చిన్నాచితకా కంపెనీలకు మళ్లించినట్లు సమాచారం.
Organizers Fraud to Seed Companies : భూత్పూర్ కేంద్రంగా పనిచేసే రెండు కంపెనీలకు 70శాతం నుంచి 80శాతం విత్తనాలు అమ్మినట్లుగా విశ్వసనీయం సమాచారం. సర్టిఫైడ్ విత్తనాలు రాకపోవడంతో ప్రధాన కంపెనీలకు సుమారు 25కోట్ల వరకూ నష్టం వాటిల్లినట్లు తెలుస్తోంది. దీనిపై ప్రధాన కంపెనీలు కొన్ని పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశాయి. కేసు నమోదైన మాట వాస్తవమే అయినా వివరాలు వెల్లడించేందుకు మాత్రం పోలీసులు నిరాకరిస్తున్నారు. పేరుకిది ప్రైవేటు వ్యవహరమే అయినా నడిగడ్డలో విత్తనపత్తి పేరిట సాగుతున్న ఆర్గనైజర్ల దోపిడికి ఉదాహరహణగా నిలుస్తోంది. దీనితో పాటు పక్కదారి పట్టిన విత్తనాలకు ఎలాంటి జీఓటీ (GOT) పరీక్షలు జరగకుండా నేరుగా బ్లాక్ మార్కెట్ ద్వారా రైతులకే చేరితే, వారు నష్టపోయే ప్రమాదం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఆర్గనైజర్లు మాత్రం ఈ ఆరోపణల్ని కొట్టి పారేస్తున్నారు. పంట పండకుండా విత్తనాలు ఎలా ఇస్తామని ప్రశ్నిస్తున్నారు. మరోవైపు జిల్లాలో పత్తివిత్తన కంపెనీలు రైతులతో ద్వైపాక్షిక ఒప్పందాలు చేసుకోవాలని ఏళ్లుగా ఉద్యమాలు సాగుతున్నాయి. లేదా మధ్యవర్తులతో కలిపి త్రైపాక్షిక ఒప్పందాలు చేసుకోవాలన్న డిమాండ్లు ఉన్నాయి. కానీ మధ్యవర్తులు, కంపెనీలు అందుకు ముందుకు రాలేదు. అప్పులు, వడ్డీలు, విఫల విత్తనాలు, తూకం, చెల్లింపుల్లో జాప్యం ఇలా చాలా రకాలుగా ఆర్గనైజర్లు రైతుల్ని దోపిడీ చేస్తూనే ఉన్నారు.
తాజాగా విత్తనాలు పక్కదారి పట్టించి కంపెనీలను సైతం మధ్యవర్తులు మోసం చేయడం చర్చనీయాంశంగా మారింది. ఇన్నేళ్లూ రైతులను కాకుండా ఏ మధ్యవర్తులనైతే కంపెనీలు ప్రోత్సహించాయో అదే మధ్యవర్తులు కంపెనీలను మోసం చేయడం చర్చకు తావిస్తోంది. ఇప్పటికైనా కంపెనీలు రైతులతో నేరుగా ఒప్పందాలు చేసుకునే అంశంపై పునరాలోచించాలన్న డిమాండ్లు బలంగా వినిపిస్తున్నాయి.
వసతులున్నా, వైద్యులేరీ? - అచ్చంపేట ఏరియా ఆసుపత్రి దుస్థితిపై ప్రత్యేక కథనం
పసుపు పంటకు పూర్వ వైభవం వచ్చేనా? - గిట్టుబాటు ధర లేక సాగు తగ్గిస్తున్న రైతులు