Diaphragm Rare Surgery Done in Hyderabad : పుట్టుకతోనే డయాఫ్రం నిర్మాణ లోపం ఉన్న 3 రోజుల శిశువుకు అరుదైన సర్జరీతో వైద్యులు పునర్జన్మ ప్రసాదించారు. బంజారాహిల్స్‌లోని లిటిల్ స్టార్ చిన్న పిల్లల ఆసుపత్రి వైద్య బృందం దాదాపు నాలుగు గంటల పాటు శ్రమించి ఈ చికిత్స చేసింది. ఆసుపత్రికి చెందిన వైద్యులు సీనియర్ నియోనటాలజిస్టు డాక్టర్ సతీష్ చికిత్సకు సంబంధించి వివరాలను గురువారం మీడియాకు వెల్లడించారు.
సౌదీ అరేబియాలో ఉంటున్న హైదరాబాద్‌కు చెందిన ప్రవాస భారతీయుడు సయ్యద్ హైదర్ హుస్సేన్ నాసిర్ తన భార్య ప్రసవం కోసం గత నెల ఇక్కడకు వచ్చారు. నెలవారీ పరీక్షల్లో భాగంగా శిశువుకు నాలుగో నెలలో డయాఫ్రం నిర్మాణం సక్రమంగా లేదని వైద్యులు గుర్తించారు. లిటిల్ స్టార్ ఆసుపత్రి వైద్యులను సంప్రదించగా, పరీక్షించిన వైద్యులు శిశువులో డయాఫ్రం సక్రమంగా అభివృద్ధి చెందలేదని తెలిపారు.
డయాఫ్రకూటిక్ హెర్నియాగా : డయాఫ్రం అనేది ఛాతీకి, ఉదరకోశానికి మధ్యలో అడ్డుగా ఉంటుంది. దీనివల్ల పొట్టలోని పేగులు, కిడ్నీలు, కాలేయం, ప్లీహం తదితర భాగాలన్నీ ఛాతీలోపలికి రాకుండా ఈ భాగం కాపాడుతుంది. తల్లి గర్భంలో ఉన్నప్పుడే శిశువుల్లో ఈ సమస్య ఉత్పన్నమవుతుంది. వైద్య పరిభాషలో దీన్ని డయాఫ్రకూటిక్ హెర్నియాగా పిలుస్తారు. కారణాలు తెలియనప్పటికీ ప్రతి 10 వేల మందిలో ఒక శిశువుకి ఈ సమస్య వస్తోంది. ఫలితంగా గుండె, ఊపిరితిత్తులపై తీవ్ర ఒత్తిడి పడి, ఊపిరి తీసుకోవడం కష్టమవుతుంది.
'ఇలాంటి సమస్యతో పుట్టిన పిల్లలు కొన్ని గంటల్లో మరణిస్తుంటారు. గతేడాది డిసెంబరు 20న తల్లి మగ శిశువుకు జన్మినివ్వగా, మూడు రోజుల వ్యవధిలోనే సర్జరీ చేశాం. ఓపెన్ సర్జరీ కాకుండా ఛాతీపై మూడు ప్రాంతాల్లో రంధ్రాలు పెట్టి పోర్ట్టెక్స్ మెష్‌తో రూపొందించిన కృత్రిమ డయాఫ్రంను శిశువు ఛాతి దగ్గరికి పంపించాం' అని డాక్టర్ సతీష్ తెలిపారు.
మున్ముందు ఎలాంటి సమస్య రాదు : అంతకుముందు శిశువు ఛాతీ కుహరాన్ని ఆక్రమించిన పేగులు, కాలేయం, మూత్ర పిండాలు తదితర అవయవాలను యథాతథంగా వాటి స్థానాల్లో ప్రవేశపెట్టి తర్వాత ఈ కృత్రిమ డయాఫ్రంను ఛాతీ వద్ద అడ్డుగా ఏర్పాటు చేశామని డాక్టర్ సతీష్ తెలిపారు. సర్జరీ విజయవంతమైనప్పటికీ మూడు వారాలు శిశువును పరిశీలించినట్లు చెప్పారు. శిశువు ఆరోగ్యం మెరుగుపడిందని, మున్ముందు ఎలాంటి ఇబ్బంది రాదని గుర్తించి శిశువును డిశ్ఛార్జి చేసినట్లు తెలిపారు. భవిష్యత్తులో ఈ కృత్రిమ డయాఫ్రం కండరాలతో కలిసిపోయి సాధారణంగా మారిపోతుందని, చిన్నారిలో ఎలాంటి ఇబ్బందులు ఉండవని ఆయన వివరించారు.
అమ్మ కడుపులోనే శిశువుకు శస్త్ర చికిత్స - ప్రపంచంలోనే తొలిసారిగా
బెంగళూరు డాక్టర్లు చేతులెత్తేస్తే - అనంతపురం డాక్టర్లు ప్రాణం నిలిపారు - Rare Surgery to Pancreas