Dharani Portal Latest News Telangana 2024 : ధరణిలోని అపరిష్కృత దరఖాస్తులకు మోక్షం కల్పించేందుకు రాష్ట్రప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ చేపట్టింది. జిల్లా కలెక్టర్ల అధికారాల విభజనతోపాటు మండల స్థాయిలో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసింది. ఈరోజు నుంచి ఈ నెల 9వ తేదీలోగా పెండింగ్ సమస్యలు పరిష్కరించేలా ప్రత్యేక డ్రైవ్ చేపట్టనుంది. ధరణి సమస్యల (Dharani Portal Problems) పరిష్కారంపై తెలంగాణ సర్కార్ ఏర్పాటు చేసిన ఐదుగురు సభ్యుల కమిటీ సూచనలకు అనుగుణంగా భూపరిపాలన ప్రధాన కమిషనర్ నవీన్ మిత్తల్ రెండు వేర్వేరు ఉత్తర్వులు జారీ చేశారు. అన్నిస్థాయిల్లో విచారణలు, దస్త్రాల పరిశీలన చేపట్టాలని వాటి వివరాలు కంప్యూటర్లలో నమోదు చేయాలని ఆదేశించారు. అర్జీలు తిరస్కరిస్తే అందుకు కారణాలను భూ యజమానులకు తెలియజేయాలని స్పష్టం చేశారు.
Special Drive on Dharani Pending Applications : ధరణి సమస్యల పరిష్కారానికి తహసీల్దారు కార్యాలయాల పరిధిలో తహసీల్దార్లు, డిప్యూటీ తహసీల్దార్లు, రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ల నేతృత్వంలో రెండు లేదా మూడు బృందాలను ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది. వారు క్షేత్రస్థాయికి వెళ్లి విచారణ చేసి ఆ నివేదికలను సంబంధిత ఉన్నతాధికారులకు పంపించనున్నారు. పారాలీగల్, కమ్యూనిటీ సర్వేయర్లు, డీఆర్‌డీఓ, వ్యవసాయ విస్తరణాధికారులు, పంచాయతీ కార్యదర్శులను ఆ బృందాల్లో నియమించనున్నారు.
ధరణి సమస్యలు పరిష్కరించేందుకు ప్రత్యేక డ్రైవ్ : కోదండ రెడ్డి
Dharani Portal Problems 2024 : గ్రామాలు, మాడ్యూళ్ల వారీగా అర్జీలను ఆ బృందాలకు తహసీల్దార్లు అప్పగించి విచారణ నివేదికలు రూపొందిస్తారు. వాటిని సంబంధిత ఉన్నతాధికారులకు పంపుతారు. దరఖాస్తుదారులకి గ్రామస్థాయి అధికారుల ద్వారా లేదా వాట్సప్, సంక్షిప్త సందేశాల రూపంలో సమాచారం చేరవేస్తాయి. అర్జీదారుల వద్ద ఉన్నఆధారాలు సహా రెవెన్యూ మూల దస్త్రాలు అవసరమైతే భూమిని క్షేత్రస్థాయిలో పరిశీలిస్తారు. ప్రతి అర్జీపై విచారణ చేసి పరిష్కారం లేదా తిరస్కరణల్లో ఏదో ఒకటి నమోదు చేస్తారు. ఈ నెల 9నాటికి ప్రతి దరఖాస్తును పరిష్కరించేలా కలెక్టర్లు చర్యలు చేపట్టాల్సి ఉంటుందని నవీన్ మిత్తల్ తెలిపారు. కలెక్టర్ల వద్ద ఒక్క అర్జీ మిగిలి ఉండటానికి వీల్లేదని ఉత్తర్వుల్లో ఆయన పేర్కొన్నారు.
తహసీల్దార్ల స్థాయిలో : నాలుగు రకాల మాడ్యూళ్లకు సంబంధించిన దరఖాస్తులను తహసీల్దార్లు పరిష్కరిస్తారు. సేత్వార్, ఖాస్రా పహాణీ, ఇతర మూల పత్రాలను పరిశీలించి క్షేత్రస్థాయి విచారణలు జోడించి సమస్యలు పరిష్కరిస్తారని సర్కార్ తెలిపింది. అసైన్డ్ భూములతోపాటు అన్ని రకాల వారసత్వ బదిలీ ప్రక్రియలు, జీపీఏ, ఎస్‌పీఏ, ఎగ్జిక్యూటెడ్ జీపీఏ అర్జీలు సహా భూసమస్యలకు సంబంధించిన వినతులను తహసీల్దార్ స్థాయిలో పరిష్కరిస్తారు. రెండు, మూడు ఖాతాలు నమోదై ఉంటే కలపడం వంటివి చేయాలని ప్రభుత్వం పేర్కొంది.
రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం - ధరణి సమస్యల పరిష్కారానికి అధికారాల బదలాయింపు
ఆర్డీఓ స్థాయిలో : ఆరు రకాల మాడ్యూళ్లలో వచ్చిన అర్జీలను ఆర్డీఓ స్థాయిలో పరిష్కరిస్తారని ప్రభుత్వం తెలిపింది. దరఖాస్తులను తప్పనిసరిగా తహసీల్దార్లకు పంపించి విచారణ నివేదిక తెప్పించుకోవాల్సి ఉంటుంది. పాసుపుస్తకాలు లేకుండా వ్యవసాయేతర భూములుగా నమోదైనవి, భూసేకరణకు చెందిన సమస్యలు, ప్రవాసీయులకు చెందిన భూసమస్యలు, సంస్థల పేరిట పాసుపుస్తకాలు, కోర్టు కేసులు, పాసుపుస్తకాల్లో తప్పులు నమోదై ఉంటే ఆర్డీఓ స్థాయిలో పరిష్కరించనున్నారు. మూల విలువ రూ.5 లక్షల లోపు ఉన్న భూములకు చెందిన గల్లంతైన సర్వే నంబర్లు, సబ్ డివిజన్ సర్వే నంబర్లు విస్తీర్ణాల్లో హెచ్చుతగ్గులకు సంబంధించిన దరఖాస్తులను పరిష్కరిస్తారని తెలంగాణ సర్కార్ వివరించింది.
కలెక్టర్ల పరిధిలో : ఆర్డీఓల విచారణ తర్వాత ఏజెన్సీ ప్రాంతాల్లో భూముల సమస్యలను కలెక్టర్లు పరిష్కరిస్తారని రాష్ట్రప్రభుత్వం పేర్కొంది. క్షేత్రస్థాయి సిబ్బంది విచారణ నిర్వహించి ఆర్డీఓలకు నివేదిక ఇవ్వాలి. వారు తప్పనిసరిగా రెవెన్యూ మూల దస్త్రాల పరిశీలన చేపట్టాలన్న సర్కార్ ఒకవేళ తిరస్కరిస్తే దరఖాస్తులకు సరైన కారణాన్ని కలెక్టర్లు తెలియజేయాలని వివరించింది. 7 రకాల మాడ్యూళ్లకు కలెక్టర్లే తుది ఆమోదం తెలపాల్సి ఉంటుంది. తహసీల్దార్లు, ఆర్డీఓ స్థాయిలో విచారణ చేసిన తర్వాతే వారు చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది.
యాజమాన్య హక్కుల బదిలీ- మ్యుటేషన్, అసైన్డ్ భూములతోపాటు వారసత్వ బదిలీకి సంబంధించి పాసుపుస్తకాలు లేనివి, నిషేధిత జాబితాలోని భూముల దరఖాస్తులను కలెక్టర్ స్థాయిలో పరిష్కరిస్తారు. సెమీ అర్బన్ భూములు, కోర్టు కేసులు-పాసుపుస్తకాలు, ఇళ్లు లేదా ఇంటి స్థలాలను వ్యవసాయేతర భూములుగా మార్పిడి, పాసుపుస్తకాల్లో సవరణలు, పేరు, ధరణికి ముందు కొంత భూమిని చదరపు గజాల లెక్కన విక్రయించినవి వ్యవసాయ భూమిగా వ్యవసాయేతర భూమి మార్పు, మిస్సింగ్ సర్వే నంబర్లు, సబ్ డివిజన్ నంబర్ల దస్త్రాలను కలెక్టర్ల స్థాయిలో పరిష్కరించాల్సి ఉంటుందని పేర్కొంది. మూల విలువ రూ.5 లక్షల నుంచి రూ.50 లక్షల వరకు ఉన్న భూమికి సంబంధించి విస్తీర్ణంలో సవరణలు చేస్తారని వివరించింది.
సీసీఎల్ఏ స్థాయిలో : 33వ మాడ్యూల్‌కు చెందిన అన్ని రకాల పాసుపుస్తకాల సవరణలను సీసీఎల్‌ఏ చేపడతారు. ప్రభుత్వ భూములకు సంబంధించిన ఖాతాల నుంచి పట్టా భూముల బదిలీ, భూస్వభావం మార్పు, మూల విలువ రూ.50 లక్షల కన్నా అధికంగా ఉండే భూముల విస్తీర్ణాలకు సంబంధించి సవరణలు మిస్సింగ్ సర్వే, సబ్‌డివిజన్ తదితర సవరణలు చేపడతారు. అన్నిరకాల దరఖాస్తులను తహసీల్దార్లకు పంపించి విచారణ చేయిస్తారు. తహసీల్దారు, ఆర్డీఓకి అక్కడి నుంచి అదనపు కలెక్టర్‌కు పంపిస్తారు. అక్కడ పరిశీలన పూర్తయ్యాక కలెక్టర్‌కు పంపుతారు. అక్కడి నుంచి సీసీఎల్‌ఏకు నివేదిక చేరుతుందని ప్రభుత్వం వెల్లడించింది.
'కొంతమందికి భరణంగా, చాలా మందికి ఆభరణంగా భారంగా మారిన ధరణి'
2020 అక్టోబర్ నుంచి అమల్లోకి వచ్చిన కలెక్టర్ల అధికారాలు విభజించి వాటిలో కొన్నింటిని తహసీల్దార్లు, ఆర్డీఓలు, అదనపు కలెక్టర్లకు ప్రభుత్వం కట్టబెట్టింది. సమస్యలకు పరిష్కారం చూపేందుకు నిర్దిష్ట సమయాన్ని నిర్దేశించింది. ప్రభుత్వ భూములను సంరక్షిస్తూనే భూ సమస్యలను పరిష్కరించాలని తెలంగాణ సర్కార్ ఆదేశించింది. పేదలకు ఇబ్బంది లేకుండా పరిష్కార ప్రక్రియను పూర్తిచేయాలని సూచించింది.
గత ప్రభుత్వం చేసిన తప్పులు సరిదిద్దుతున్నందున ధరణి దరఖాస్తుల (Dharani Applications)పరిశీలన సదస్సులను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి సూచించారు. భూరికార్డులకు శరాఘాతంగా పరిణమించిన ధరణి పోర్టల్‌ను పూర్తిగా ప్రక్షాళన చేయబోతున్నామని తెలిపారు. ధరణిపై శ్వేతపత్రం విడుదల చేయబోతున్నామని పొంగులేటి ప్రకటించారు.