Dhar Gang Robbery Cases in Hyderabad : హైదరాబాద్‌పై అంతర్రాష్ట్ర దోపిడీ దొంగల ముఠా కన్నుపడింది. ఓవైపు స్థానిక దొంగలు ఎక్కడికక్కడ ఇళ్లను గుల్ల చేస్తున్నారు. మరోవైపు ఇతర రాష్ట్రాలకు చెందిన కిరాతక ముఠాల కదలికలు నగరంలో అలజడి రేపుతున్నాయి. ఒకేసారి వరుసగా ఇళ్లల్లో చోరి చేసి అవసరమైతే ప్రాణాలు తీసేందుకు వెనుకాడని దోపిడీ దొంగల సంచారం ప్రజల్లో ఆందోళనను పెంచుతోంది.
Police High Alert on Dhar Gang : తాజాగా నగర శివారు హయత్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఒక గేటెడ్ కమ్యూనిటీలోని 5 ఇళ్లల్లో మధ్యప్రదేశ్‌కు చెందిన ధార్ గ్యాంగ్ వరుస చోరీలకు తెగబడింది. దొంగలించిన సొమ్ము తక్కువ మొత్తంలోనే ఉన్నా, దోపిడిల్లో ఆరితేరారు. ప్రత్యర్థులని ఎదిరించేందుకు, తప్పించుకునేందుకు ఎంతకైనా తెగిస్తారు. అలాంటి ఈ ముఠా చాలా సంవత్సరాల తర్వాత హైదరాబాద్‌లోకి ప్రవేశించడంతో కలకలం రేపుతోంది.
రెండేళ్ల తర్వాత అలజడి: హైదరాబాద్ పోలీసుల గట్టి నిఘా, వరుస అరెస్టులతో మధ్యప్రదేశ్‌కు చెందిన ధార్ గ్యాంగ్ రెండు సంవత్సరాలుగా నగరంవైపు చూడలేదు. చివరిసారిగా 2022 ప్రథమార్థంలో రాచకొండ, సైబరాబాద్ కమిషనరేట్ల పరిధిలో ఈ ముఠా చోరీలు చేసింది. ధార్ ముఠా సభ్యుల మీద 2018- 2022 మధ్య రాచకొండలో 32, సైబరాబాద్‌లో 138 చోరీ కేసులు నమోదయ్యాయి.ప్రధానంగా శివారు ప్రాంతాలు, దూరంగా విసిరేసినట్లు ఉండే కాలనీలోని ఇళ్లల్లో వీరు దొంగతనాలు చేస్తుంటారు.
పగటిపూట కాలనీల్లో రెక్కీ చేసి అర్ధరాత్రి చోరీ చేసే ఈ ముఠాలు ఒక్కోసారి దాడులు, హత్య చేసేందుకూ వెనకాడరని పోలీసులు అంటున్నారు. ఇలాంటి ముఠా ప్రధాన నాయకుల్ని 2022లో రాచకొండ, సైబరాబాద్ పోలీసులు వరుసగా అరెస్ట్ చేశారు. మాన్‌సింగ్, ఇతరుల మీద పీడీ యాక్టులు ప్రయోగించడం, ఇతరుల్ని పట్టుకొచ్చి జైలుకు పంపడంతో రెండు సంవత్సారాలుగా ఇటువైపు రావడం మానేశారు. కానీ ఇప్పుడు తాజాగా వరుస ఘటనలతో పోలీసులు అలర్ట్ అయ్యారు. ఆ ముఠాను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలు రంగంలోకి దించారు.
కొత్త రూపాల్లో: మరోవైపు అపార్టుమెంట్లు, కాలనీల్లో భద్రతా సిబ్బంది నియామకం, సీసీ కెమెరాలు, పోలీసు పెట్రోలింగ్‌తో స్థానిక దొంగలు కొత్త పంథాలో దోపిడీలు చేస్తున్నారు. ఇంటి పని, ఇతర అవసరాల పేరుతో పట్టపగలు ఇంట్లోకి వచ్చి ఎవరూ లేకపోతే చోరీలు చేస్తున్నారు. మహిళలు, వికలాంగులుగా నటిస్తూ దొంగతనాలకు పాల్పడుతున్నారు.
దొంగలున్నారు జాగ్రత్త - భాగ్యనగర వాసులను కలవరపెడుతున్న వరుస చోరీలు - Robbery Incidents in Hyderabad