DGP Participated Anti Drug Day in Vijayawada : రాష్ట్రంలో జరుగుతున్న వ్యవస్థీకృత నేరాలను కట్టడి చేసేందుకు చర్యలు తీసుకుంటామని డీజీపీ ద్వారకా తిరుమలరావు స్పష్టం చేశారు. డ్రగ్స్ వినియోగం, సరఫరాను కట్టడి చేసేందుకు యాక్షన్ ప్లాన్ సిద్ధం చేస్తున్నట్లు వెల్లడించారు. విశాఖ సరిహద్దుల్లో జరుగుతున్న గంజాయి సాగును అరికట్టేందుకు చర్యలు తీసుకుంటామని, దీని రవాణాపై నిఘా పెడతామని చెప్పారు. అంతర్జాతీయ మాదకద్రవ్యాల వ్యతిరేక దినం సందర్భంగా విజయవాడలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్ని మాట్లాడారు.
Awareness program on International Anti Drug Day in AP : డ్రగ్స్‌ను వినియోగించి క్రీడాకారులు, సెలబ్రిటీస్ జీవితాలు కోల్పోయారని డీజీపీ ద్వారకా తిరుమలరావు గుర్తుచేశారు. చిన్నారులు కూడా మత్తుపదార్థాలకు బానిస కావడం విచారకరమని చెప్పారు. మాదక ద్రవ్యాల వినియోగం పెరిగితే నేరాలు పెరుగుతాయని అన్నారు. సమాజానికి ఇది పెను సవాల్‌గా మారుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో తీవ్రవాదం, ఎర్రచందనం మాఫియాను అదుపుచేశామని, అదే విధంగా డ్రగ్స్‌ను కట్టడి చేయనున్నట్లు ద్వారకా తిరుమలరావు వెల్లడించారు.
అవసరమైతే కేంద్ర సంస్థల సహకారం : కొన్ని దేశాల్లో డ్రగ్ మాఫియా ప్రభుత్వాలను శాసించే స్థాయికి ఎదిగిందని ద్వారకా తిరుమలరావు చెప్పారు. మాదక ద్రవ్యాలను కట్టడి చేసేందుకు అవసరమైతే కేంద్ర సంస్థల సహకారం తీసుకుంటామని వెల్లడించారు. కన్విక్షన్ రేట్‌ను పెంచేందుకు సిబ్బందికి శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. అదేవిధంగా ఎఫ్‌ఎస్‌ఎల్‌ను బలోపేతం చేస్తామని ద్వారకా తిరుమలరావు వివరించారు.
"డ్రగ్స్ వినియోగించి క్రీడాకారులు, సెలబ్రిటీస్ జీవితాలు కోల్పోయారు. చిన్నారులు కూడా డ్రగ్స్‌కు బానిస కావడం విచారకరం. డ్రగ్స్ వినియోగం పెరిగితే నేరాలు పెరుగుతాయి. గంజాయి రవాణాపై నిఘా పెడతాం. గంజాయి సాగును అరికట్టేందుకు చర్యలు తీసుకుంటాం. వ్యవస్థీకృత నేరాల కట్టడికి చర్యలు తీసుకుంటాం." - ద్వారకా తిరుమలరావు, డీజీపీ
విజయవాడలో మత్తుపదార్థాలు వాడే వారి సంఖ్య పెరగడం ఆందోళన కలిగిస్తుందని విజయవాడ పోలీస్ కమిషనర్ రామకృష్ణ అన్నారు. గత ఏడాది 220 కేసులు నమోదు చేశామని తెలిపారు. వీటిని నివారించేందుకు యాక్షన్ ప్లాన్ సిద్ధం చేస్తున్నామని చెప్పారు. త్వరలోనే డ్రగ్స్ టాస్క్‌ఫోర్స్‌ని ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు. మాదక ద్రవ్యాలు సరఫరా చేస్తున్న వారిపై దృష్టి పెట్టామని చెప్పారు. ఇందులో భాగంగా ముగ్గురు నిందితులపై పీడీ యాక్ట్, మరో 8మందిని నగర బహిష్కరణ చేశామని వివరించారు. విద్యార్థులు, యువత మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని సీపీ రామకృష్ణ సూచించారు.
మాదకద్రవ్యాల రహితంగా రాష్ట్రాన్ని మారుస్తాం : హోం మంత్రి అనిత - Home Minister In Anti Drug Day