Yadadri Hundi income at Record Level : యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి క్షేత్రం గత మూడు రోజులుగా భక్తులతో కిటకిటలాడుతోంది. వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో యాదాద్రి క్షేత్రానికి తరలివస్తున్నారు. ఆదివారం రోజున సుమారు 81 వేల మంది దర్శించుకున్నారని ఆలయ అధికారులు తెలిపారు. అదేవిధంగా శుక్రవారం రోజున 60 వేల మంది, శనివారం రోజున 75 వేల మంది స్వామివారిని దర్శించుకున్నారని తెలిపారు.
ఆదివారం ఒక్కరోజున భారీ స్థాయిలో రూ.1.02 కోట్లు వివిధ విభాగాల ద్వారా ఆదాయం సమకూరిందని ఆలయ అధికారులు వెల్లడించారు. శుక్రవారం నాడు రూ.48.44 లక్షలు, శనివారం రోజున రూ.62.55లక్షలు కాగా ఇవాళ ఒక్కరోజులోనే రికార్డు స్థాయిలో రూ.1.02 కోట్లు హుండీ ఆదాయం వివిధ కౌంటర్ల ద్వారా సమకూరింది. రాబోయే రోజులలో కూడా భక్తుల రద్దీకి అనుగుణంగా, ఎలాంటి ఇబ్బందులు లేకుండా అత్యవసర చర్యలు తీసుకొంటున్నట్లు ఆలయ ఈవో భాస్కర్ రావు తెలిపారు.
Huge Devotees in Yadadri Temple : యాదాద్రి శ్రీలక్ష్మీ నరసింహా ఆలయానికి భక్తులు భారీగా తరలివస్తున్నారు. శ్రీసుదర్శన నారసింహ హోమం, శ్రీలక్ష్మీనరసింహస్వామి నిత్య కల్యాణం క్రతువులో భక్తులు పాల్గొని మొక్కులు తీర్చుకుంటున్నారు. వేసవి సెలవులు పూర్తి కావొస్తుండటంతో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో పరిసరాలు కిటకిటలాడుతున్నాయి. తెల్లవారుజాము నుంచే భక్తులు క్యూ లైన్లలో వేచి ఉండగా, దర్శనానికి సుమారు 2నుంచి 3గంటల పాటు భక్తులు నిరీక్షించారు.
ప్రసాదం కొనుగోలు కేంద్రాలు వద్ద భక్తులు తీవ్ర అసహనం : మరోవైపు ఆలయంలో భక్తులు స్వామి వారి ప్రసాదం కోసం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. భక్తుల తాకిడికి జనసంద్రంలో ఉక్కిరి బిక్కిరయ్యారు. కుటుంబసమేతంగా వచ్చిన వారు ప్రసాదం క్యూ లైన్లో గంటల తరబడి నిరీక్షించారు. గతంలో ఉన్నట్లుగానే ప్రసాదం, టికెట్లు ఒకే చోట ఉండే విధంగా చర్యలు చేపట్టాలని భక్తులు కోరారు. టికెట్ కౌంటర్, ప్రసాద విక్రయం వేర్వేరు చోట్ల ఏర్పాటు చేయడంతో అయోమయానికి గురయ్యారు. దీంతో భక్తులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు.
Heavy Traffic Problem in Toll Plaza : యాదాద్రి భువనగిరి జిల్లా గూడూరు టోల్ ప్లాజా వద్ద వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. సుమారు అర కిలోమీటర్ మేర వాహనాలు నిలిచిపోయాయి. హైదరాబాద్ - వరంగల్ జాతీయ రహదారిపై టోల్ ప్లాజా వద్ద హైదరాబాద్ వెళ్లే వాహనాలు నెమ్మదిగా కదిలాయి. వాహనదారులు ఇబ్బంది ఎదుర్కొన్నారు.
సెలవు దినం కావడంతో యాదాద్రి ఆలయం, సమీపంలోని స్వర్ణగిరి వేంకటేశ్వర స్వామి దర్శనార్థం వాహనాల రద్దీ నెలకొంది. దానికి తోడు పలు గ్రామాల్లో బొడ్రాయి, బోనాల పండగ ఉండటంతో రద్దీ పెరిగిందని టోల్ ప్లాజా నిర్వాహకులు తెలిపారు. నిర్వాహకులు వాహనాలను టోల్ గేట్ గుండా త్వరగా వెళ్లేలా తగుచర్యలు చేపట్టారు.
యాదాద్రిలో వైభవంగా జయంతి ఉత్సవాలు - కాళీయమర్దన అవతారంలో స్వామివారి దర్శనం - Yadadri Jayanti Utsavalu