Ramappa Temple in Mulugu District : తెలంగాణలోని ములుగు జిల్లా వెంకటాపూర్ మండలంలో ప్రపంచ ప్రఖ్యాతి గాంచి, యునెస్కో గుర్తుంపు పొందిన రామప్ప దేవాలయ అభివృద్ధి కోసం రూ.73 కోట్ల 74 లక్షల నిధులను కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసింది. తెలంగాణ పర్యాటక రంగానికి ఊతమిచ్చేలా కేంద్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తున్నట్లు కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ పేర్కొన్నారు. కేంద్ర పర్యాటక శాఖ తాజాగా సుస్థిర టూరిజం సర్క్యూట్ కింద రామప్ప ప్రాంతానికి రూ.74 కోట్లు, వెల్‌నెస్, స్పిరిచ్యువల్ రిట్రీట్ కింద నల్లమలకు రూ.68 కోట్లు విడుదల చేసిన నేపథ్యంలో ప్రధానమంత్రి మోదీ, కేంద్ర పర్యాటక శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్‌లకు కృతజ్ఞతలు తెలిపారు.
తెలంగాణలో పర్యాటకానికి ఊతం : యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప ఆలయానికి పక్కనే రామప్ప చెరువు, దానికి సమీపంలో కోటగుళ్లు ఆలయం, ఘన్‌పుర్ చెరువు వంటి ప్రత్యేక అందమైన ప్రదేశాలు ఉన్నాయి. రామప్ప గుడికి వెళ్లిన పర్యాటకులు చుట్టుపక్కల వీటన్నింటినీ చుట్టి వచ్చేలా ఓ టూరిజం సర్క్యూట్‌గా అభివృద్ధి చేసి అక్కడ పర్యాటకులకు పలు సౌకర్యాలు కల్పించబోతున్నారు. మరోవైపు అందాల నల్లమల అడవుల్లోని సోమశిల గ్రామానికి ఆనుకుని ఉండే కృష్ణా నది, అందులో పడవ ప్రయాణం చేసుకుంటూ వెళ్తే మరో గట్టున ఎత్తైన కొండలపై ఈగలపెంట, సోమశిలకు దగ్గరలోనే మహేశ్వరం గ్రామానికి వీటిని కలుపుతూ మరో మరో సర్క్యూట్‌గా అభివృద్ధి చేయనున్నారు.
బస చేయడానికి కాటేజీలు : ఆయా ప్రాంతాల్లో ఎలాంటి సౌకర్యాలు కల్పించాలనే వివిధ అంశాలపై ఇప్పటికే ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. రామప్ప సర్క్యూట్‌లో టూరిస్టులు సౌకర్యంగా బస చేయడానికి కాటేజీలతో పాటు హస్తకళల బజార్, శిల్పాల గార్డెన్, యాంఫీ థియేటర్, లేక్ వ్యూ కాటేజీలు, బొటానికల్ గార్డెన్, పిల్లల ఆట స్థలాలు, బోటింగ్ పాయింట్ నిర్మించనున్నారు. మరోవైపు నల్లమల అభయారణ్యంలోని సోమశిల, ఈగలపెంటతో పాటు మల్లేశ్వరం ఐలాండ్‌ను అభివృద్ధి చేసి దీంతో పాటు వివిధ సౌకర్యాలు కల్పించనున్నారు.
మంచువేళల్లో అరకు అందాలు - తెలంగాణ టూరిజం అద్దిరిపోయే ప్యాకేజీ!