Devaragattu Banni Utsavam: కర్నూలు జిల్లా దేవరగట్టులో కర్రల సమరానికి సర్వం సిద్ధమైంది. హింసకు తావులేకుండా బన్ని ఉత్సవాన్ని నిర్వహించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. కర్నూలు జిల్లా హోళగుంద మండలంలో కర్రల సమరాన్ని స్థానిక ప్రజలు తరతరాలుగా జరుపుకుంటున్నారు. ఆలూరు సమీపంలోని దేవరగట్టు గ్రామం వద్ద కొండపై మాళమల్లేశ్వరస్వామి ఆలయం వెలిసింది. గుడిలోని దేవతామూర్తులైన మాళమ్మ, మల్లేశ్వరస్వామికి దసరా పర్వదినాన అర్ధరాత్రి 12 గంటలకు కల్యాణం జరిపిస్తారు.
అనంతరం కొండ పరిసర ప్రాంతాల్లో ఉన్న పాదాలగట్టు, రక్షపడ, శమీవృక్షం, ఎదురు బసవన్నగుడి ప్రాంతాల్లో దివిటీల వెలుతురులో విగ్రహాలను ఊరేగిస్తారు. ఆ ఉత్సవ విగ్రహాలను దక్కించుకోవడం కోసం 3 గ్రామాల ప్రజలు ఓ వర్గంగా, 5 గ్రామాల ప్రజలు మరో వర్గంగా ఏర్పడి కర్రలతో తలపడతారు. నెరణికి, నెరణికి తండా, కొత్తపేట గ్రామాల ప్రజలు ఓ జట్టుగా, ఆలూరు, సుళువాయి, ఎల్లార్తి, అరికెర, నిడ్రవట్టి, బిలేహాల్ గ్రామస్థులు మరో జట్టుగా ఏర్పడి కర్రలతో తలపడతారు. దీన్నే బన్ని ఉత్సవం అని కూడా పిలుస్తారు. ఇందులో ఇరు వర్గాలవారికీ తీవ్ర గాయాలవుతాయి.
ఈ సమరాన్ని చూసేందుకు రాష్ట్రం నుంచే కాకుండా, కర్ణాటక నుంచీ భారీ సంఖ్యలో భక్తులు వస్తారు. దేవరగట్టు పరిసరాల్లో విద్యుత్ దీపాలు, సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేశారు. డ్రోన్ల ద్వారా ఉత్సవం దృశ్యాలను రికార్డు చేస్తామని కలెక్టర్, ఎస్పీ తెలిపారు. అధికారులు, పోలీసులు గ్రామాల్లో అవగాహన కార్యక్రమాలు చేపట్టారు. రింగులు తొడిగిన కర్రలను స్వాధీనం చేసుకుంటున్నారు. మద్యాన్ని నియంత్రించేందుకు తనిఖీలు చేస్తున్నారు.
తాత్కాలిక వైద్యశాల ఏర్పాటు: ఉత్సవంలో భాగంగా జరిగే కర్రల సమరంలో పాల్గొనేందుకు భక్తులు పోటీపడుతుంటారు. ఈ సమయంలో గాయపడే వారికి చికిత్స అందించేందుకు ప్రత్యేకంగా సుమారు 30 - 50 మంచాలతో తాత్కాలిక వైద్యశాలను సైతం ఏర్పాటు చేశారు. చికిత్స సామగ్రి, మందులు, 108 వాహనాలు రెండు నుంచి నాలుగు వాహనాలు ఉండేందుకు ప్రత్యేకంగా స్థలాన్ని కేటాయించారు. ఈ మేరకు ఆలూరు నియోజకవర్గ వ్యాప్తంగా వైద్య సిబ్బందితో పాటు జిల్లా కేంద్రం నుంచి ప్రత్యేక సిబ్బంది సేవలు అందించనున్నారు.
దేవరగట్టు సంబరం - కర్రల సమరానికి సిద్ధమైన గ్రామస్థులు
దేవరగట్టులో కర్రల సమరం - సీసీ కెమెరాలు, డ్రోన్ కెమెరాలతో పటిష్ఠ నిఘా : ఎస్పీ బిందు మాధవ్