Deputy CM Pawan Kalyan Attend Mega Parent Teacher Meeting in Kadapa : రాష్ట్ర వ్యాప్తంగా ఒకే రోజున నేడు తల్లిదండ్రులు - ఉపాధ్యాయుల మెగా సమావేశాన్ని ప్రభుత్వం నిర్వహించింది. శనివారం మెగా పేరెంట్స్-టీచర్స్ మీటింగ్ ఉదయం ప్రారంభం అయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా 45,094 ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలల్లో ఈ కార్యక్రమం కొనసాగుతోంది. ఈ కార్యక్రమాన్ని ఎలాంటి రాజకీయ ప్రమేయం లేకుండా విద్యాశాఖ నిర్వహిస్తోంది.
Deputy CM Pawan Kalyan with Students : కడప మున్సిపల్ హైస్కూల్‌లో నిర్వహించిన మెగా పేరెంట్స్, టీచర్స్ సమావేశానికి ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ హాజరయ్యారు. ఆయనకు అధికారులు ఘనస్వాగతం పలికారు. విద్యార్థులతో పవన్ ముఖాముఖి నిర్వహించారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
చదువుల నేల రాయలసీమకు వచ్చా: అత్యధికంగా లైబ్రరీలు ఉన్న ప్రాంతం రాయలసీమ అని పవన్ కల్యాణ్ అన్నారు. చదువుల నేల రాయలసీమకు తానొచ్చానని, అన్నమయ్య, వేమన, పుట్టపర్తి నారాయణచార్యులు, కేవీ రెడ్డి, ఉయ్యాలవాడ నరసింహారెడ్డి వంటి మహనీయుల నేల ఇది అని కొనియాడారు. రాయలసీమ అంటే అభివృద్ధికి వెనకబాటు కాదని, అవకాశాలకు ముందుండి నడిచే ప్రాంతం కావాలని స్పష్టం చేశారు. 2014-19 సంవత్సరంలో ఉద్దానం సమస్యను బయటకు తీసుకొచ్చానన్న పవన్, ఆనాటి సీఎం చంద్రబాబు 61 కోట్లతో ఉద్దానం ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లారని గుర్తు చేశారు.
డ్రగ్స్ వ్యతిరేక పోరాటం పాఠశాలల నుంచే ప్రారంభం కావాలి : సీఎం చంద్రబాబు
నీటి సమస్యను తీర్చి ఇక్కడి ప్రజలను ఆదుకుంటా: కడపలో ఇంత నీటి సమస్య ఉందని తాను అనుకోలేదని, ఈ ప్రాంతం నుంచి ఇద్దరు సీఎంలు అయినందున సమస్యలు తీరిపోయి ఉంటాయనుకున్నానన్నారు. రూ.45 కోట్లు పులివెందుల తాగునీటి ప్రాజెక్టుకు నిధులు ఇచ్చామని, తాగునీటి కోసం ఎక్కడా ఇబ్బంది రాకూడదనేదే కూటమి ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. నీటి సమస్యను తీర్చి ఇక్కడి ప్రజలను ఆదుకుంటానని మాట ఇస్తున్నానన్నారు. సమాజానికి సరైన చదువు ఇవ్వకపోతే అభివృద్ధి దిశగా వెళ్లదని, విద్యార్థుల భవిష్యత్తు కోసమే కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని పేర్కొన్నారు.
విద్యార్థుల భద్రతకు తల్లిదండ్రుల బాధ్యత చాలా ఉందని, పిల్లలతో చర్చిస్తేనే అన్ని విషయాలు మనకు తెలుస్తాయని తెలిపారు. ఇటీవల విద్యార్థులు తిరగబడి టీచర్‌పై దాడి చేసిన ఘటన చూశామన్న పవన్, ఉపాధ్యాయులతో పాటు విద్యార్థులు కూడా బాధ్యతగా ఉండాలని సూచించారు. ఎక్కడ తప్పు జరిగినా ముందుగానే చర్చించుకోవాలని, సమస్య పరిష్కారం దిశగా ఆలోచించడం చాలా ముఖ్యమని అభిప్రాయపడ్డారు.
మహనీయులు నడియాడిన నేల కడప: గొప్ప మహనీయులు నడియాడిన నేల కడప అని, గొప్ప ప్రాంతం కాబట్టే ఇక్కడి సమావేశానికి వచ్చానని పవన్ తెలిపారు. అవకాశాలను అందిపుచ్చుకునేలా రాయలసీమ మారబోతోందని, పార్టీలు మారినా పథకాలు మారకుండా ఉండేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని అన్నారు. సరైన చదువు లేకపోతే సమాజం ముందుకు నడవడం కష్టమని, ఏ ప్రభుత్వమైనా టెక్నాలజీ అందుకోవాలని పరికరాలు పంపిణీ చేస్తారని వెల్లడించారు.
అందరికంటే టీచర్లకు ఎక్కువ జీతం ఉండాలి: పిల్లల విషయంలో తల్లిదండ్రులు బాధ్యతగా మెలగాలని, తల్లిదండ్రులు, టీచర్ల మధ్య సమన్వయం పెరగాలన్నారు. దేశం బాగుండాలంటే అధ్యాపకులపై పెట్టుబడులు పెట్టాలని, అందరికంటే టీచర్లకు ఎక్కువ జీతం ఉండాలనేదే తన కోరిక అని పేర్కొన్నారు. విద్యార్థులకు దేహధారుడ్యం పెరిగేలా ప్రభుత్వం కృషి చేస్తోందని, విద్యార్థుల పోషకాహారంపై కేబినెట్‌లో చర్చిస్తానన్నారు. సమాజంలో సైబర్ క్రైమ్ రోజురోజుకూ పెరుగుతోందని, సోషల్ మీడియాపై అదనపు ఆంక్షలు ఉండేలా కేంద్రాన్ని కోరతామని తెలిపారు.
ఉపాధ్యాయుల్లోనూ హీరోలు ఉన్నారు: హీరోలు సినిమాల్లో కాదని, ఉపాధ్యాయుల్లోనూ ఉన్నారని కొనియాడారు. నేటి సమాజానికి విలువతో కూడిన విద్య అవసరని, సోషల్ మీడియాలో ఏంచూస్తే భవిష్యత్తులో అలాగే తయారవుతారని అభిప్రాయపడ్డారు. విలువలు పాటించే వ్యక్తులను విద్యార్థులు ఆదర్శంగా తీసుకోవాలని, విద్యార్థులు చిన్నప్పటి నుంచి సహాయ గుణం అలవాటు చేసుకోవాలని సూచించారు. ప్రభుత్వ పాఠశాల భవనాల్లో ప్రైవేటు వ్యక్తుల ప్రమేయం లేకుండా చూడాలని, ప్రభుత్వ ఆస్తులను కబ్జా చేస్తే గూండా యాక్టు పెట్టడం తథ్యమని హెచ్చరించారు.
బాపట్లలో పేరెంట్స్, టీచర్స్ సమావేశం - విద్యార్థులతో ముచ్చటించిన సీఎం చంద్రబాబు