Deputy CM Bhatti Vikramarka Review Meeting With Officials : ధరలు పెంచకుండా, రాష్ట్ర ఖజానాకు ఆదాయం పెరిగే మార్గాలను అన్వేషించాలని ఉపముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క అధికారులను ఆదేశించారు. ఆర్థికశాఖతో పాటు ఖజానాకు ఆదాయాన్ని అందించే వాణిజ్యపన్నులు, ఎక్సైజ్, ఆర్అండ్బీ, గనులు, పురపాలక, గృహనిర్మాణ శాఖల అధికారులతో డిప్యూటీ సీఎం సచివాలయంలో సమావేశమయ్యారు.
ఆదాయం పెంచే విషయమై ఆయా శాఖల ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఖజానాకు ఆదాయం పెంచేందుకు నిర్దిష్ట ప్రణాళికతో అధికారులు రావాలని భట్టి సూచించారు. గతంలో నిర్ధేశించుకున్న ప్రణాళికలు, వాటి ప్రగతిని నివేదించాలని చెప్పారు. లీకేజీలను అరికడుతూ ఆదాయం పెంచేందుకు వాణిజ్యపన్నుల శాఖ ప్రత్యేకంగా సమావేశం నిర్వహించాలని ఆదేశించారు.
మద్యం దుకాణాల్లో అధిక ధరలు : మద్యం దుకాణాల్లో కనీస ధర కన్నా అధిక రేట్లతో విక్రయాలు జరుగుతున్నాయని వాటిని అరికట్టేందుకు ఎన్ఫోర్స్మెంట్ విభాగాన్ని బలోపేతం చేయాలని స్పష్టం చేశారు. ఖజానాకు ఆదాయం పెంచేందుకు వివిధ శాఖలు సమన్వయంతో పనిచేయాలని, అందుకోసం ప్రత్యేకంగా ఉమ్మడి సమావేశాలు నిర్వహించాలని ఉప ముఖ్యమంత్రి తెలిపారు. అక్రమంగా తరలిస్తున్న ఇసుక రవాణా, పనుల ఎగవేతను కట్టడి చేయడానికి వాణిజ్య పన్నులు, ఆర్అండ్బీ, ఇతర శాఖల అధికారులు సమావేశమై నివేదిక రూపొందించాలని అన్నారు.
నిర్మాణాలు పూర్తిచేసి పెండింగ్లో ఉన్నరాజీవ్ స్వగృహ, గృహనిర్మాణ శాఖ పరిధిలోని ఇండ్లను విక్రయించే అంశంపై త్వరగా నిర్ణయం తీసుకోవాలని సంబంధిత అధికారులకు సూచించారు. ఇసుక రీచ్ల ద్వారా ఖజానాకు గరిష్ట ఆదాయం సమకూరేందుకు తీసుకోవాల్సిన చర్యలపై సీనియర్ అధికారులు సమావేశమై నివేదిక ఇవ్వాలని భట్టివిక్రమార్క ఆదేశించారు.
"హైదరాబాద్ అంటేనే రాక్స్, లేక్స్, పార్క్స్ - వాటిని మాయం చేస్తే ఎలా?"