Bhatti Vikramarka on Sunkishala Project : సుంకిశాల బీఆర్‌ఎస్ హయాంలోనే నిర్మించారని, వాటి డిజైన్లు సైతం లోపభూయిష్టంగా ఉన్నాయని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మండిపడ్డారు. అది తాము కట్టించింది కాదని, ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు భ్రమలు సృష్టించి బీఆర్‌ఎస్ ప్రభుత్వ తప్పిదాలు తమపై వేయాలని చూస్తున్నారని ధ్వజమెత్తారు. బీఆర్‌ఎస్ తమపై బురదజల్లే ప్రయత్నం చేస్తుందని, వాటిని ప్రజలు క్షమించరని అన్నారు. సుంకిశాలపై విచారణ చేసి వివరాలు అందజేయాలని అధికారులకు స్పష్టం చేశామన్నారు.
టీజీఎస్పీడీసీఎల్ ప్రధాన కార్యాలయంలో విద్యుత్ శాఖ ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం అనంతరం ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మీడియా సమావేశంలో మాట్లాడారు. ఇవాళ కూలినగోడ గత బీఆర్‌ఎస్ హయాంలో కట్టించినదేనని స్పష్టం చేశారు. సుంకిశాల నిర్మాణంతో ప్రజల సొమ్మును వృథా చేశారని ఆయన ఆరోపించారు. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల మాత్రమే కాదని, బీఆర్‌ఎస్ కృష్ణా నదిని కూడా వదిలిపెట్టలేదు అని ఆగ్రహం వ్యక్తంచేశారు. అంతకుముందు జీహెచ్ఎంసీ పరిధిలో ఉన్న విద్యుత్ శాఖ ఎస్పీడీసీఎల్ సీఎండీ, డైరెక్టర్స్, ఎస్సీలు, ఏడీలతో సమావేశం నిర్వహించామని చెప్పారు.
హైదారాబాద్ మహా నగరంలో అనేక సంస్థలు పెట్టుబడులు పెట్టేందుకు వస్తుంటాయని, వాటికి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని భట్టి ఆదేశించామన్నారు. నగర ప్రజలకు నిరంతర విద్యుత్ సరఫరా కొనసాగించేలా ముందుకు వెళ్లాలని అధికారులకు స్పష్టం చేశామని తెలిపారు. వర్షాకాలంలో భారీ వర్షాలు, వరదల కారణంగా స్తంభాలు పడిపోవడం, చెట్లు కూలిపోయే అవకాశం ఉన్నందున అప్రమత్తంగా ఉండాలని అధికారులకు సూచించామని తెలిపారు.
'సుంకిశాల ప్రాజెక్టు బీఆర్‌ఎస్ హయాంలోనే చేపట్టారు. సాగర్‌లో నీళ్లు వచ్చినందునే గోడ కూలిందని ఆరోపిస్తున్నారు. నీళ్ల కోసమే కదా సాగర్ కట్టింది. గత ప్రభుత్వ ప్రాజెక్టు డిజైన్లు ఎంత లోపభూయిష్టంగా ఉన్నాయో దీని ద్వారా అర్థమవుతోంది. మీ కట్టడాలు, మీ పాలన ఏ రకంగా ఉందో స్పష్టంగా అర్థమవుతోంది. సుంకిశాల ప్రాజెక్టు మేం కట్టింది కాదు, మా హయాంలో చేపట్టిన ప్రాజెక్టు కాదు. మేడిగడ్డతో పాటు సుంకిశాల పాపం మీకే చెందుతుంది' - భట్టి విక్రమార్క, ఉప ముఖ్యమంత్రి
విద్యుత్ సమస్యలపై 1912కి కాల్ చేయండి : విద్యుత్ శాఖలో పదోన్నతులపై చర్యలు చేపట్టాలని సీఎండీలను ఆదేశించామని భట్టి తెలిపారు. విద్యుత్ శాఖలో గత ఏడెనిమిది ఏళ్లుగా పదోన్నతులు లేవని, ఆ దిశగా చర్యలు తీసుకోవాలని చెప్పామని వివరించారు. అనేక అంతర్జాతీయ సంస్థలు వస్తుంటాయని, వాటికి ఇబ్బందులు తలెత్తకుండా చూసుకోవాలని ఆదేశించామని తెలిపారు. వినియోగదారుల కోసమే నిరంతరం విద్యుత్ సిబ్బంది పని చేస్తున్నారని, విద్యుత్ సమస్యలు తలెత్తితే 1912 టోల్ ఫ్రీ నంబర్‌కు ఫోన్ చేస్తే తక్షణమే విద్యుత్ శాఖ స్పందిస్తుందన్నారు.