Deputy CM Bhatti Vikramarka about Inspection in Hostels : నెలలో ఒకరోజు వసతిగృహాలకు వెళ్తామని ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. సీఎం రేవంత్రెడ్డి పాటు అందరం వెళ్తామని స్పష్టం చేశారు. ఈ నెల 15, 16వ తేదీల్లో అన్ని హాస్టల్స్ సందర్శిస్తామని అక్కడే భోజనం చేస్తామని వివరించారు. మొదటి రోజున సీఎం రేవంత్ రెడ్డి, తనతోపాటు ఉప ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, సీనియర్ నాయకులు, అధికారులు అంతా ఉంటారని వివరించారు. ఇవాళ అసెంబ్లీ ప్రాంగణంలో మీడియాతో ఆయన ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు.
ఈ సమయంలోనే గురుకుల హాస్టళ్లు, పాఠశాలల్లో మధ్యాహ్నం భోజనం సరిగా ఉండటం లేదన్న వార్తలపై ఆయన స్పందించారు. ఇక నుంచి తాము నెలలో ఒకరోజు హాస్టళ్లకు వెళ్లి పరిశీలిస్తామన్నారు. విద్యార్థులతో కలిసి భోజన చేస్తామని భట్టి విక్రమార్క తెలిపారు. హాస్టళ్లల్లో వసతులు మెరుగుపరుస్తామని, వసతులు మెరుగుకు రూ. 5 వేల కోట్లు ఖర్చుపెడతామని చెప్పారు. గత పదేళ్లలో డైట్ ఛార్జీలు పెంచలేదని పేర్కొన్నారు. తమ ప్రభుత్వం రాగానే ఛార్జీలు పెంచిందని గుర్తు చేశారు.
బ్రాహ్మణ వెల్లమ్ ప్రాజెక్టు కోసం కోమటిరెడ్డి 2004 నుంచి పొరాడుతున్నారని, ఇప్పుడు నిధులు ఇచ్చి పూర్తి చేసినట్లు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. వైఎస్ఆర్తో కొట్లాడి కోమటిరెడ్డి ప్రాజెక్టు మంజూరు చేపించుకున్నారని నల్గొండ జిల్లాలో కూడా గోదావరి తరహాలో నీళ్లు పారబోతున్నాయని పేర్కొన్నారు. ఫలితంగా నల్గొండ జిల్లా భూమి ధరలు భారీగా పెరగబోతున్నాయన్నారు.
మరోవైపు తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన కాంగ్రెస్ అగ్రనేత సోనియాగాంధీ పుట్టినరోజున అసెంబ్లీకి వచ్చి ఆమెకు కృతజ్ఞతలు కూడా తెలపలేరా అని బీఆర్‌ఎస్ నాయకులను రహదారులు, భవనాలు శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రశ్నించారు. తెలంగాణ ఇచ్చాక 14 మంది కేసీఆర్ కుటుంబంతోసహా వెళ్లి సోనియా కాళ్లు మొక్కి గ్రూప్ ఫోటో దిగిన మాట వాస్తవం కాదా అని నిలదీశారు. అసెంబ్లీలో తెలంగాణ ఇచ్చిన దేవత అని, సోనియాగాంధీ లేకపోతే తెలంగాణ రాదు అని అన్న కేసీఆర్ ఈరోజు అసెంబ్లీకి ఎందుకు రాలేదని నిలదీశారు. తెలంగాణ రాష్ట్రంపై బీఆర్ఎస్ పార్టీకి మాట్లాడే నైతికత లేదని ఎద్దేవా చేశారు.