Dengue and Viral Fever Cases in Telangana : రాష్ట్రవ్యాప్తంగా వైరల్ జ్వరాలు కలకలం సృష్టిస్తున్నాయి. ఒకవైపు డెంగీ విజృంభిస్తోండగా మరోవైపు గన్యా, మలేరియా కేసులూ రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. పల్లె, పట్టణం అన్న తేడాలేకుండా అన్ని ప్రాంతాల్లో విస్తరిస్తున్నాయి. దీంతో ప్రభుత్వ ఆసుపత్రులు పేషంట్లతో కిటకిటలాడుతున్నాయి. అన్ని దవాఖానాల్లో ఓపీ సగటున 10-30 శాతం వరకు పెరగగా కొన్ని మాత్రం అంతకన్నా ఎక్కువే ఉంది. ప్రైవేటు ఆసుపత్రుల్లోనూ ఇదే పరిస్థితి ఉంది. గత 20 రోజులు నుంచి బాధితుల సంఖ్య క్రమక్రమంగా పెరుగుతుండటంతో ఆందోళన కలిగిస్తోంది.
ప్రస్తుతం రాష్ట్రంలో భిన్న వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. ఒకవైపు అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతుండగా మరోవైపు వానలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో గత రెండు నెలలుగా జలుబు, దగ్గు, శ్వాస సంబంధిత వ్యాధులు విస్తరిస్తున్నాయి. అంతేకాకుండా వర్షాల కారణంగా పారిశుద్ధ్యం లోపించడంతో దోమల వ్యాప్తి కూడా పెరిగింది. దీనికి ఫలితంగా ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా డెంగీ, మలేరియా, గన్యా జ్వరాలు విస్తరిస్తున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, నల్గొండ, సూర్యాపేట, ఖమ్మం జిల్లాల్లో డెంగీ కేసులు ఎక్కువగా నమోదయ్యాయి. ప్రధానంగా హైదరాబాద్‌లోనే మూడోవంతు కేసులు నమోదయ్యాయి.
ఆసుపత్రుల్లో పడకలు సరిపోక : ఆగస్టులో 20 రోజుల్లోనే 1,856కుపైగా నమోదవడంతో వైరల్ జ్వరాల తీవ్రతను సూచిస్తోంది. కొన్నిచోట్ల వైరల్ జ్వరాల మరణాలు సంభవిస్తున్నా ఇతర కారణాలతో మృతి చెందనట్లు ధ్రువీకరించడంతో కేసులు నమోదు కావడం లేదనే ఆరోపణలు సైతం ఉన్నాయి. గ్రామీణం, ఏజెన్సీ ప్రాంతాల్లో కూడా పరిస్థితి మరింత దారుణంగా ఉంది. కొన్నికుటుంబాల్లో ఇద్దరికంటే ఎక్కువమందే వైరల్ జ్వరాల బారిన పడుతున్నారు. మరోవైపు ప్రభుత్వ ఆసుపత్రుల్లో పడకలు సరిపోక ఓపీలోనే వైద్యం చేసి పంపిస్తున్నారు. ప్రభుత్వ ఆసుపత్రులకు వస్తున్న వారిలో పలువురిలో గన్యా, మలేరియా, జపనీస్ ఎన్‌సెఫలైటిస్ లక్షణాలు ఉంటున్నాయి.
డెంగీ లక్షణాలు :
- ఇది చాలా రోజులపాటు ఉంటుంది.
- అకస్మాత్తుగా జ్వరం పెరగడం దీని ముఖ్య లక్షణం.
- తీవ్రమైన తలనొప్పి
- కీళ్ల నొప్పులు, కండరాల నొప్పులు
- జ్వరం మొదలైన కొన్ని రోజుల తరవాత శరీరంపై దద్దుర్లు రావడం
- జ్వరం తీవ్రమైన సందర్భాల్లో ముక్కు లేదా చిగుళ్ల నుంచి రక్తస్రావం కావడం
జాగ్రత్తలు పాటించాలంటున్న వైద్యులు
డెంగీ, గన్యా జ్వరాలు దోమల ద్వారా వ్యాప్తి చెందుతాయని, అందుకే దోమలు కుట్టకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యలు హెచ్చరిస్తున్నారు. కాచి వడపోసిన నీరు తాగాలని, నిల్వ ఉంచిన ఆహార పదార్థాలను తినవద్దని సూచిస్తున్నారు. జ్వరం, దగ్గు, తుమ్ములు, ఆయాసం వంటి లక్షణాలు ఉంటే వెంటనే వైద్యులను సంప్రదించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
Viral Fever Precautions Telugu : జ్వరాల సమయంలో ఈ జాగ్రత్తలు తప్పనిసరి!