KU Executive Council Issue : వరంగల్ కాకతీయ విశ్వవిద్యాలయంలో పూర్తిస్థాయి పాలకమండలి ఏర్పాటు చేయడంలో జాప్యం జరుగుతోంది. వర్సిటీలో పూర్తిస్థాయి పాలక మండలి గతేడాది అక్టోబర్ వరకు కొనసాగింది. ఆ తర్వాత కేవలం రాష్ట్ర ఉన్నత విద్య కమిషనర్, ఆర్థిక శాఖ సంయుక్త కార్యదర్శిలతో మాత్రమే కార్యనిర్వాహక మండలి కొనసాగుతోంది. వర్సిటీ పరిపాలన విభాగంలో అత్యంత ముఖ్యభూమిక పోషించే పాలకమండలి లేకపోవడంతో అనేక సమస్యలు పెండింగ్‌లోనే ఉన్నాయి.
Problems at KU in Warangal : వర్సిటీలో పూర్తిస్థాయి పాలకమండలి లేకపోవడంతో అత్యంత కీలకమైన నిర్ణయాలు తీసుకోవడంలో తీవ్ర జాప్యం నెలకొంది. బోధన, బోధనేతర ఉద్యోగుల సమస్యలతో పాటు విద్యార్థి, పరిశోధకుల సమస్యలు పరిష్కారానికి నోచుకోవడంలేదు. ఏవైనా సమస్యలు ప్రస్తావిస్తే వీసీ లేరంటూ అధికారులు దాటవేస్తున్నారు. పది నెలల నుంచి కొత్త పాలక మండలి నియామకం కోసం నిరీక్షణ తప్పటం లేదంటూ ఉద్యోగులు, పరిశోధకులు వాపోతున్నారు.
ఇటీవలే ఇన్‌ఛార్జి వీసీలను నియమించిన ప్రభుత్వం : రాష్ట్రంలోని పది విశ్వవిద్యాలయాల ఉపకులపతులకు ఇటీవల పదవీకాలం ముగియడంతో ఇన్‌ఛార్జ్ వీసీలను ప్రభుత్వం నియమించింది. ఇదివరకూ కేయూ ఉపకులపతిగా మూడేళ్ల పాటు విధులు నిర్వహించిన ఆచార్య తాటికొండ రమేశ్ పదవీ కాలం ముగియడంతో ప్రభుత్వం ఇన్‌ఛార్జి వీసీగా సీనియర్ ఐఏఎస్ అధికారిణి వాకాటి కరుణను నియమించింది. కొత్త వీసీ వచ్చే వరకు కేయూ బాధ్యతలు ఆమె చూడనున్నారు.
పూర్తిస్థాయి పాలక మండలిని ఏర్పాటు చేయాలి : కానీ కేయూకు(కాకతీయ విశ్వవిద్యాలయం) పాలక మండలి లేకపోవడంతో సెర్చ్ కమిటీ సభ్యులను ఎంపిక చేసి ప్రభుత్వానికి పంపించే అవకాశం లేకుండా పోయింది. 2024 విద్యాసంవత్సరం ప్రారంభం కావొస్తున్న నేపథ్యంలో కాకతీయ యూనివర్సిటీకి పూర్తిస్థాయి పాలక మండలిని, వీసీను నియమించాలని ఉద్యోగ, అధ్యాపక, విద్యార్థి పరిశోధక వర్గాలు కోరుతున్నాయి.
"పాలకమండలి లేకపోవడం వల్ల వీసీలను నియమించడంలో జాప్యం జరుగుతుంది. ప్రభుత్వం వెంటనే ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ను ఏర్పాటు చేయాలని కోరుతున్నాం. యూనివర్శిటీలో వీసీల నియామకానికి సెర్చ్ కమిటీ వేయాలని కోరుతున్నాం. పాలకమండలి లేకుంటే అభివృద్ధి కుంటుపడుతుంది"- మట్టడి కుమార్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అధికారి
కాకతీయ విశ్వవిద్యాలయం వీసీపై విజిలెన్స్ విచారణకు ప్రభుత్వం ఆదేశం - Vigilance Inquiry On KU VC
Warangal KU Bandh Updates : కొనసాగుతోన్న వరంగల్ బంద్.. కేయూ వద్ద భారీగా పోలీసుల మోహరింపు