Delay In Double Bedroom Houses Distribution Warangal : గూడు లేని నిరుపేదల కోసం గత ప్రభుత్వ హయాంలో నిర్మించిన రెండు పడక గదుల ఇళ్లు లబ్ధిదారులకు పంపిణీ చేయడంలో అధికారులు విఫలమయ్యారు. వరంగల్ జిల్లా తిమ్మాపూర్‌లో 320, దూబకుంటలో 600, దేశాయిపేటలో 220 ఇళ్లు రెండేళ్ల క్రితమే నిర్మాణాలు పూర్తయ్యాయి.
కానీ గత పాలకులు అలసత్వం కారణంగా లబ్ధిదారుల పంపిణీకి నోచుకోలేదు. ఫలితంగా ఆ భవనాలు అసాంఘీక కార్యకలాపాలకు అడ్డాగా మారాయి. రాత్రివేళల్లో కొంత మంది ఆకతాయిలు తాళాలు పగలగొట్టి విద్యుత్ సామాగ్రి, తలుపులు, కిటికీలు వంటి వస్తువులను దొంగిలిస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి.
Double Bedroom Houses Distribution Issue : ప్రభుత్వం తమ పేరిట ఇళ్లను కేటాయించడంతో కొంత మంది లబ్ధిదారులు భవన సముదాయాల వద్దనే చిన్నచిన్న గుడిసెలు ఏర్పాటుచేసుకుని జీవిస్తున్నారు. వర్షాకాలంలో పాముల బెడదతో భయం గుప్పిట్లో జీవనం గడుపుతున్నట్లు చెబుతున్నారు. ఇదిగో అదిగో అంటూ ఊదరగొట్టి చివరికి తమకు ఇళ్లు లేకుండా చేశారని వాపోతున్నారు. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరడంతో తమ సొంతింటి కల నెరవేర్చాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
"డబుల్ బెడ్రూంలు కట్టి పేదలకు పంపిణీ చేస్తామన్న మాటను కేసీఆర్ ప్రభుత్వం నిలబెట్టుకోలేదు. రేవంత్ రెడ్డి సర్కారు వచ్చాక మాకు ఇళ్లను ఇస్తామని చెప్పారు. వర్షాకాలం ప్రారంభమవ్వడంతో మా గుడిసెల్లోకి పాములు, పురుగులు వచ్చి చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాం. మాకు ఇళ్లు కావాలి. మేము కూలీనాలీ చేసుకుని బతుకుతున్నాం. కనుక ప్రభుత్వం స్పందించి వీలైనంత త్వరగా మాకు ఇళ్లను కేటాయిస్తుందని ఆశిస్తున్నాం" - లబ్ధిదారులు
ఇప్పటికే నిర్మాణాలు పూర్తయిన డబుల్ బెట్రూం ఇళ్లు : ఈ రెండు పడక గదుల ఇళ్లను గత ప్రభుత్వ నియమ నిబంధనలు మేరకు నిర్మాణాలు పూర్తిచేసిన గుత్తేదారుల నుంచి అధికారులు స్వాధీనం చేసుకుని ప్రభుత్వానికి నివేదించవలసి ఉంటుంది. అయితే ఆ ప్రక్రియ ముందుకు సాగడం లేదు. ఫలితంగా పలుచోట్ల గుత్తేదారులకు ప్రజలకు గొడవలు తలెత్తుతున్నాయి.
అన్ని హంగులతో నిర్మాణాలు పూర్తిచేసుకుని సిద్ధంగా ఉన్న రెండు పడక గదుల ఇళ్లను త్వరితగతిన లబ్ధిదారులకు పంపిణీ చేయాలని గుత్తేదారులు సైతం కోరుతున్నారు. ఓవైపు టెండర్ ద్వారా పనులు చేపట్టి సకాలంలో నిర్మాణాలు పూర్తిచేసినప్పటికీ తమకు పూర్తిస్థాయిలో నిధులు రాలేదని గుత్తేదారులు వాపోతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం త్వరిత గతిన ఇళ్ల పంపిణీ పూర్తిచేసి పేదల సొంతింటి కల నెరవేర్చాలని అర్హులు కోరుతున్నారు.
ఇళ్లైతే ఇచ్చారు - మరి మౌలిక సదుపాయాల మాటేంటి మహాప్రభో!
ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఎదురుచూపులు డబుల్ - నిర్మాణాలు పూర్తయినా అందని ద్రాక్షగానే!