White Paper on Irrigation Projects : శాసనసభలో నీటపారుదల రంగంపై ప్రభుత్వం పెట్టనున్న శ్వేతపత్రం శనివారానికి వాయిదా పడింది. చాలా విస్తృతమైన అంశం ఐనందున, ఎక్కువ సమయం కావాలని అసెంబ్లీ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్ బాబు కోరగా, అందుకు అంగీకరించిన సభాపతి గడ్డం ప్రసాద్ రేపటికి సభను వాయిదా వేశారు. శనివారం బీఏసీ సమావేశం తర్వాతే తదుపరి నిర్ణయం ఉంటుందని మంత్రి పేర్కొన్నారు. అంతకుముందు రేపటికి వాయిదా వేయడాన్ని బీఆర్‌ఎస్, బీజేపీ తీవ్రంగా వ్యతిరేకించాయి.
Harish rao on Irrigation White Paper : అజెండాలో ఉన్న నీటిపారుదల అంశంపై చర్చించేందుకు సిద్ధంగా ఉన్నామని హరీశ్‌రావు(Harish Rao) ప్రకటించారు. బీఏసీ చర్చించకుండా నిర్ణయం తీసుకోవడం ఏంటని ప్రశ్నించారు. నీటిపారుదల శాఖపై లఘు చర్చ అని ఎజెండాలో చెప్పారని, కానీ ఎందుకు వాయిదా వేస్తున్నారని ప్రశ్నించారు. ఇవాళ అసెంబ్లీ ముగుస్తుందని చెబుతున్నారని, నీటిపారుదలపై ఎంతసేపు చర్చకైనా సిద్ధంగా ఉన్నామని హరీశ్‌రావు స్పష్టం చేశారు. ప్రధాన ప్రతిపక్షానికి గౌరవం ఇస్తూ నడుచుకోవాలని, ఇష్టారీతిన సభ నడుపుదామనడం సబబు కాదన్నారు.
"అజెండాలో ఉన్న నీటిపారుదల అంశంపై చర్చించేందుకు సిద్ధంగా ఉన్నాము. ఇవాళ శ్వేతపత్రం విడుదల చేయండి. నీటిపారుదలపై లఘు చర్చ అని ఎజెండాలో చెప్పారు, కానీ ఎందుకు వాయిదా వేస్తున్నారు. ప్రధాన ప్రతిపక్షానికి గౌరవం ఇస్తూ నడుచుకోవాలి, ఇష్టారీతిన సభ నడుపుదామనడం సబబు కాదు". - హరీశ్‌రావు, మాజీమంత్రి
'పాలితులుగా ఉన్న వారిని పాలకులుగా చేయడమే మా ఉద్దేశ్యం' - అసెంబ్లీలో కులగణన తీర్మానం ఆమోదం
అసెంబ్లీలో జీరో అవర్ నిర్వహించాలని బీజేపీ(BJP) శాసనసభ పక్షనేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి డిమాండ్ చేశారు. అవసరమైతే సభను మరో 4 రోజులు పొడిగించాలన్నారు. ఎజెండాలో పెట్టిన నీటిపారుదల అంశంపై ఇవాళే చర్చించాలని, ఎజెండా బేఖాతరు చేసి రేపటికి వాయిదా వేయడం సబబు కాదని మండిపడ్డారు. నీటిపారుదలలో అవినీతిపై సీబీఐ విచారణకు సిద్ధమా? కాదో? చెప్పాలని ప్రశ్నించారు. కాళేశ్వరంలో అవినీతి జరిగినట్లు ఆరోపిస్తున్నారని, సీబీఐతో విచారణ జరిపించి నిజానిజాలు బయటపెట్టాలని డిమాండ్ చేశారు. న్యాయవిచారణ వీలు కావట్లేదని మీరే చెబుతున్నారని, సీబీఐ విచారణ అంశంపై ఎందుకు యూటర్న్ తీసుకున్నారని అడిగారు.
Sridhar babu on Irrigation White Paper : దీనిపై శాసనసభ వ్యవహారాల మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ బీఏసీలో చర్చించిన అంశాలనే సభ ముందుంచామన్నారు. ప్రతి రోజూ బీఏసీ ఉండదని సభ్యులు గుర్తించాలని మంత్రి పేర్కొన్నారు. ముఖ్యమైన అంశం కావున రేపు ఉదయం బీఏసీలో నిర్ణయం తీసుకోవాల్సి ఉందని, నీటిపారుదలపై శ్వేతపత్రం పెట్టేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. శాసనసభ రేపు ఉదయం 10 గంటలకు వాయిదా పడింది.
"శనివారం ఉదయం బీఏసీ సమావేశం తర్వాత నిర్ణయం తీసుకుంటాము. శాసనసభలో శనివారం నీటిపారుదల శాఖపై శ్వేతపత్రం విడుదల చేస్తాము. ఇది చాలా విస్తృతమైన అంశం ఐనందున సభ్యులందరూ పాల్గొనాలి.". - శ్రీధర్‌బాబు, మంత్రి
రాష్ట్రానికి పెనుభారంగా మారనున్న కాళేశ్వం ప్రాజెక్ట్ - కాగ్ రిపోర్ట్‌లో సంచలన విషయాలు
భూకంప అధ్యయనం లేకుండానే మల్లన్నసాగర్ రిజర్వాయర్ నిర్మాణం : కాగ్