Dasa Avataras Of Lord Shiva : శ్రీమహావిష్ణువు ధరించిన 10 అవతారాల గురించి అందరికీ తెలిసిందే. వాటినే దశావతారాలుగా వ్యవహరిస్తున్నారు. అయితే ఆ పరమశివుడు కూడా పది అవతారాలు ధరించారని మీరెప్పుడైనా విన్నారా? అయితే ఈ శివదశావతారాల గురించి తెలుసుకోండి. వాటి గురించి ప్రతిరోజూ ఉదయం మననం చేసుకున్న భక్తులకు ఆ పరమశివుడు సకల శుభాలు చేకూరుస్తారని కథనం తెలియజేస్తుంది. ఇది శివమహాపురాణంలో శతరుద్రసంహిత 17వ అధ్యాయంలో ఉన్న విషయం. ఈ కథను విన్నా, చదివినా సకల సుఖాలు లభించి, శుభాలు కలుగుతాయని నమ్మకం.
మహా శివుడి దశావతారాలు ఇవే :
- శివుడి దశావతారాలలో మొదటిది మహాకాళి అవతారం. ఈ అవతారంలో శక్తి మహాకాళిగా ఉండి తనను సేవించిన భక్తులను అనుగ్రహిస్తుంది. మహాకాలుడు భక్తజనులకు భుక్తిని, ముక్తిని కల్పిస్తాడు.
- దశావతారాలలో 2వ అవతారం తార్. ఈ అవతార సమయంలో శక్తి తారా అనే పేరుతో మహశివుడిని అనుసరించి ఉంటుంది. ఇద్దరూ తమ సేవకులకు భుక్తి, ముక్తులను అనుగ్రహిస్తారు.
- శివుడి దశ అవతారాలలో మూడో అవతారం బాలభువనేశుడు. ఈ అవతారంలో పరమశివుడి ఇల్లాలైన పార్వతి బాలభువనేశ్వరి అనే పేరున ఉంటూ భక్తులను రక్షిస్తుంది. అప్పుడా తల్లి తన భక్తులకు సర్వసుఖాలను ప్రసాదిస్తుంటుంది.
- శివుడి నాలుగో అవతారం షోడశశ్రీవిద్యేశుడు. ఈ అవతారంలో పార్వతి షోడశీశ్రీవిద్యాదేవిగా ఉంటుంది. ఈ దేవతల ఆరాధన వల్ల భక్తులకు ముక్తి, భుక్తి, సుఖాలు లభిస్తాయి.
- శివుని ఐదో అవతారం పేరు భైరవుడు. అప్పుడు పార్వతీదేవి భైరవిగా ఉంటూ తన ఉపాసకులను, భక్తులను అన్ని కాలాల్లోనూ అనుగ్రహిస్తుంటుంది.
- మహాశివుడి ఆరో అవతారమే చిన్నమస్తకుడు. అప్పుడు చిన్నమస్తకిగా పార్వతిదేవి అవతరించి భక్తులను అనుగ్రహిస్తుంటుంది. ధూమవంతుడు అనేది శివుని ఏడో అవతారం. ఈ అవతారం అప్పుడు పార్వతి ధూమావతి అనే రూపంలో ఉంటుంది. భక్తుల కొంగుబంగారంగా ఈ అవతారంలో ఆదిదంపతులుంటారు.
- బగలాముఖుడు అనే పేరున్న అవతారం శివుడి 8వ అవతారం. అప్పుడా పరమేశ్వరీ బగలాముఖీ, మహానంద అనే పేర్లతో భక్తులను అనుగ్రహిస్తుంటుంది.
- శివుని తొమ్మిదో అవతారం పేరు మాతంగుడు. ఈ అవతారంలో పార్వతిదేవి మాతంగిగా భక్తులను అనుగ్రహిస్తుంది.
- కమలుడు అనే పేరున్న అవతారం శంభుడి పదో అవతారం. అప్పుడు పార్వతి కమల అనే పేరున ఉండి తన భక్తులను రక్షిస్తూ ఉంటుంది. ఈ పది అవతారాలు తమను ఆరాధించే భక్తులను వెన్నంటి ఉంటూ ఎంతో మేలును చేకూరుస్తుంటాయి.
తంత్ర శాస్త్రాల్లో అవతార విశేషాలు : పైన వివరించిన అవతారాలన్నీ విడిగా కన్నా తంత్రశాస్త్రాలలో ఎక్కువగా కనిపిస్తుంటాయి. ఆ తంత్రశాస్త్రాలలో కనిపించే పార్వతీదేవి అవతారాలు శత్రువుల నుంచి తమ భక్తులను సంహరించటం, దుష్టులను శిక్షించటం, నిత్యం బ్రహ్మవర్చస్సును పెంపొందిస్తూ ఉండటం చేస్తుంటాయి. మహాకాలాది శివదశావతారాలు శక్తితో కూడి ఉండి భక్తులను ఆదుకుంటాయి. తంత్రశాస్త్రాల ప్రకారం ధూమావతి, బగలాముఖి లాంటి శక్తులన్నింటికీ విడివిడిగా మంత్రాలు, ఉపాసనా విధులు ఉన్నాయి. వాటన్నిటి గురించి సంపూర్ణంగా తెలిసినా, తెలియకపోయినా ప్రతిరోజూ ఉదయం వేళ ఈ దశావతారాల్లోని శివశక్తులను స్మరించటం పుణ్యప్రదమని శివపురాణం వివరిస్తోంది.