Cyber Terrorism Sections Against Phone Tapping Case Accused : సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసుకు సంబంధించి నిందితులపై దర్యాప్తు బృందం సైబర్ టెర్రరిజం సెక్షన్లు నమోదు చేసింది. కేసులో ఐటీ యాక్ట్ 66(ఎఫ్)ను ప్రయోగించనున్న పోలీసులు, ఈ మేరకు నాంపల్లి కోర్టులో మెమో దాఖలు చేసేందుకు సిద్ధమవుతున్నారు.
బెయిల్ పిటిషన్ నేటికి వాయిదా : ఇదిలా ఉండగా ఈ కేసులో అరెస్టైన అదనపు ఎస్పీలు భుజంగరావు, తిరుపతన్న, ఎస్‌ఐబీ మాజీ డీఎస్పీ ప్రణీత్ రావుల బెయిల్ పిటిషన్‌పై బుధవారం నాంపల్లి కోర్టులో వాదనలు ముగిశాయి. ప్రత్యేక పీపీ వాదనలు వినిపిస్తూ కేసు విచారణ కీలక దశలో ఉండగా నిందితులకు బెయిల్ మంజూరు చేస్తే సాక్షులను ప్రభావితం చేస్తారని పేర్కొన్నారు. ఈ వ్యవహారంలో బాధితులు ఒక్కొక్కరుగా ఫిర్యాదులు చేస్తున్నారని, పెద్ద సంఖ్యలో బాధితులుండే అవకాశం ఉందని కోర్టుకు తెలిపారు.
ఫోన్ ట్యాపింగ్ కేసు - విశ్రాంత ఎస్పీ దివ్యచరణ్‌రావును విచారించిన పోలీసులు
నిందితుల తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ ఈ కేసులో ఇప్పటి వరకు అందరినీ పోలీసు కస్టడీలో విచారించారని, కావాల్సిన సమాచారం సేకరించారని న్యాయస్థానానికి తెలిపారు. పోలీసులు ఇప్పటి వరకు సేకరించామని చెబుతున్న హార్డ్ డిస్క్‌ల శకలాలు, ఇతర ఆధారాలు కోర్టుకు ఎందుకు సమర్పింలేదన్నారు. సెక్షన్ 409 సహా ఐటీ యాక్ట్ ఎలా పెట్టారో చెప్పాలన్నారు. ఇరు పక్షాల వాదనలు విన్న నాంపల్లి కోర్టు తీర్పు నేటికి వాయిదా వేసింది.
మరోవైపు ఇదే కేసులో నిందితుడు టాస్క్‌ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్ రావుకు నాంపల్లి కోర్టు బెయిల్ తిరస్కరించింది. తాను ఎల్‌ఎల్‌ఎం పరీక్షలు రాసేందుకు రాధాకిషన్ రావు ఎస్కార్ట్ బెయిల్ మంజూరు చేయాలని కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఎన్నికల హడావిడిలో ఉండటం వలన ఆయనకు భద్రతతో కూడిన బెయిల్ కల్పించలేమని పోలీసులు కోర్టుకు తెలిపారు. రెండేళ్ల ఎల్‌ఎల్‌ఎంలో పరీక్షలు తర్వాత రాసుకోవచ్చని పోలీసుల తరఫున ప్రత్యేక పీపీ వాదనలు వినిపించారు. పోలీసుల వాదనలతో ఏకీభవించిన న్యాయస్థానం, రాధాకిషన్ రావుకు మధ్యంతర బెయిల్ ఇవ్వడానికి నిరాకరించింది. ఇటీవలే తన తల్లి ఆనారోగ్యం రీత్యా రాధాకిషన్ రావుకు కొన్ని గంటల పాటు కోర్టు ఎస్కార్ట్‌తో కూడిన బెయిల్ మంజూరు చేసిన సంగతి తెలిసిందే.
ఫోన్ ట్యాపింగ్ కేసు వ్యవహారం - ప్రత్యేక పీపీని నియమించిన ప్రభుత్వం
ఫోన్ ట్యాపింగ్‌లో కొత్త కోణాలు - పోలీసులే సాక్షులు, వారి వాంగ్మూలాలే ఆధారాలు