Man Lost Rs.1 Lakh In Cyber Crime in Kamareddy : కుమార్తె ఆపదలో ఉందని నమ్మించిన సైబర్ నేరగాడు ఆమె తండ్రి నుంచి డబ్బులు కాజేసిన ఘటన కామారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకెళ్తే కామారెడ్డి జిల్లా పల్వంచ మండలం భవానిపేట గ్రామానికి చెంది నారెడ్డి వెంకట్ రెడ్డి కుమార్తె అమెరికాలో చదువుతోంది. ఆయన సెల్‌ఫోన్‌కు శనివారం మధ్యాహ్నం గుర్తుతెలియని వ్యక్తి కాల్ చేశాడు.
అమెరికాలో ఉండే మీ కుమార్తె రాధవి గదిలో ఉంటున్న మరో అమ్మాయి మరణించింది. ఆమెను మీ కుమార్తె హత్య చేసినట్లు ఆనవాళ్లున్నాయని, తనని అరెస్టు చేసే అవకాశముందని సైబర్ నేరగాడు నమ్మబలికాడు. తనపై కేసు కావొద్దంటే వెంటనే రూ.2లక్షలు పంపించండి. ఆ డబ్బులతో పోలీసులను సముదాయించి కేసు తప్పించడానికి అవకాశముంటుంది అని వెంకట్ రెడ్డితో చెప్పాడు.
మీ కుమార్తెతో మాట్లాడతావా అంటూ ఓ అమ్మాయి ఏడుస్తున్న గొంతును వినిపించాడు. ఆమె ప్రస్తుతం మాట్లాడే పరిస్థితిలో లేదు, మీరు వీలైనంత త్వరగా డబ్బులు పంపించండి అంటూ తొందరపెట్టాడు. లేదంటే మీ అమ్మాయిని పోలీసులు అరెస్టు చేస్తారు అని భయపెట్టాడు. అనుమానం వచ్చిన తండ్రి అమెరికాలో ఉన్న తన కుమార్తెకు ఫోన్ చేశాడు. ఆమె ఫోన్ కలవలేదు. దీంతో నిజమేనని అనుకున్న వెంకట్‌రెడ్డి సైబర్ నేరగాడు చెప్పిన విధంగా మూడు విడతల్లో మొత్తం కలిపి రూ.లక్ష పంపించాడు. అంతలోనే కుమార్తె రాధవికి ఫోన్ కలవడంతో వెంకట్‌రెడ్డి మాట్లాడాడు. ఇదే విషయంపై అడగ్గా తనకేమీ కాలేదని, ప్రమాదంలో లేనని తెలిపింది. వెంటనే గ్రహించిన బాధితుడు 1930కి జరిగిన మోసంపై ఫిర్యాదు చేశాడు.
భర్త అరెస్ట్ అయ్యాడంటూ కాల్ : ఇటీవలే సీబీఐ పోలీసులమని చెప్పి హైదరాబాద్‌కు చెందిన ఓ మహిళకు మంగళవారం రోజున సైబర్ నేరస్థుల నుంచి వీడియో కాల్ వచ్చింది. తెలిసినవారనుకొని ఆమె కాల్ లిఫ్ట్ చేసింది. అంతే క్షణాల్లోనే ఎదురుగా పోలీసులు ప్రత్యక్షమయ్యారు. దీంతో ఆమె ఒక్కసారిగా షాక్‌కు గురైంది. తాము సీబీఐ పోలీసులమని అవతలి వ్యక్తులు పరిచయం చేసుకున్నారు. మీ భర్త, కుమారుడిని డ్రగ్, మనీలాండరింగ్ కేసులో ‘నాన్-బెయిల్ వారెంట్’పై అరెస్టు చేశామని ఆమెకు తెలిపారు. వారిని కేసు నుంచి తప్పించాలన్నా ఇంటికి పంపాలన్నా వెంటనే రూ.50 వేలు తాము చెప్పిన అకౌంట్‌కు ట్రాన్స్ఫర్ చేయాలని హుకుం జారీ చేశారు.
వీడియో కాల్ కట్ చేసి భర్తకు ఫోన్ : ఓ సందర్భంలో ఆమె డబ్బు పంపిద్దామనే నిర్ణయానికి కూడా వచ్చారు. వారి వ్యవహార శైలిపై అనుమానం వచ్చి ధైర్యం చేసి ఆ వీడియో కాల్ కట్ చేసింది. వెంటనే తన భర్తకు ఫోన్ చేయగా ఆయన మాటలు విని ఊపిరి పీల్చుకుంది. జరిగిందంతా ఆమె భర్తకు వివరించింది. అనంతరం భర్తతో కలిసి హైదరాబాద్ సైబర్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.