Cyber Crime on Fedex Scam in Hyderabad : రాష్ట్రంలో సైబర్ నేరగాళ్ల మోసాలు రోజురోజుకి పేట్రేగిపోతున్నాయి. రోజుకో మార్గంలో రెచ్చిపోతూ, దొరికినంత దోచుకో అన్న రీతిలో అమాయకుల సొమ్మును స్వాహా చేస్తున్నారు. తాజాగా హైదరాబాద్‌కు చెందిన ఓ డాక్టర్ నుంచి ఫెడెక్స్ స్కామ్‌తో 12 లక్షలు 75 వేల రూపాయలు కాజేశారు. బాధితుడి ఆధార్‌తో పలు అకౌంట్‌లు అనుసంధానమయ్యాయని, వాటినుంచి రూ.8వేల కోట్ల నగదు బదిలీ అయినట్లు తాము గుర్తించామని నేరగాళ్లు బెదిరించారు.
తనను తాను ముంబయి సైబర్ క్రైమ్ డీసీపీగా పరిచయం చేసుకున్న నిందితుడు, బాధితుడిపై మనీలాండరింగ్ చట్టం ప్రకారం కేసు నమోదు అవుతుందని, అకౌంట్లు అన్ని ఫ్రీజ్ అవుతాయని బెదిరించి కోరిన మొత్తం చెల్లించాలని డిమాండ్ చేశారు. భయంతో బాధితుడు రూ.12,75,000 చెల్లించి, మోసపోయినట్లు గుర్తించాడు. చివరకు సైబర్ పోలీసులను ఆశ్రయించాడు.
Credit Card Fraud in Telangana : మరోవైపు క్రెడిట్ కార్డు నెలవారీ చార్జీల నుంచి మినహాయింపు ఇస్తామని నగరానికి చెందిన వ్యాపారవేత్త నుంచి 2 లక్షల 03 వేలు రూపాయలు కాజేశారు. లింక్ పంపించి క్రెడిట్ కార్డు వివరాలు నమోదు చేయమని సూచిస్తే, బాధితుడు అలాగే చేయడం, వెంటనే ఖాతా నుంచి డబ్బు మాయమవడం చకచకామంటూ క్షణాల్లో జరిగిపోయాయి. బ్యాంకుకు వెళ్లి ఆరా తీసి సైబర్ నేరం జరిగినట్లుగా నిర్ధారణ చేసుకుని సైబర్ క్రైం పోలీసులను ఆశ్రయించాడు.
ఇదేమాదిరిగా మరో కేసులో క్రెడిట్ కార్డ్ కేవైసీ పేరిట నగరానికి చెందిన ఓ మహిళను సైబర్ మోసగాళ్లు నమ్మించి, ఆమె క్రెడిట్ కార్డ్ నుంచి లక్ష 19 వేల 337 రూపాయలు కాజేశారు. బాధిత మహిళకు యాక్సిస్ బ్యాంక్ నుంచి ఫోన్ చేసి క్రెడిట్ కార్డ్ కేవైసీ చేయాలని నమ్మించారు. వివరాలు సేకరించి ఆమెకు ఒక లింక్ పంపించారు. ఆమె దానిని క్లిక్ చేయడంతో ఖాతాలో డబ్బు ఖాళీ అయ్యాయి. వెంటనే తేరుకున్న బాధితురాలు మహిళ యాక్సిస్ బ్యాంక్ కస్టమర్ కేర్‌ను సంప్రదించగా, సైబర్ క్రైమ్‌కు ఫిర్యాదు చేయమని సూచించారు.
Cyber Crime Alert : దీంతో బాధిత మహిళ సైబర్ క్రైంకి ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. బెదిరింపులు గానీ , అపరిచిత లింక్‌లు వస్తే క్లిక్ చేయొద్దని పోలీసులు సూచిస్తున్నారు. సైబర్ మోసానికి గురైతే ఠాణాల్లో వెంటనే ఫిర్యాదులు చేయాలని, లేదా 1930 టోల్ ఫ్రీ నంబర్‌కు కాల్ చేయాలని సైబర్ క్రైమ్ పోలీసులు సూచిస్తున్నారు. అదేవిధంగా cybercrime.gov.in పోర్టల్‌లో రిపోర్ట్ చేయాలని కోరుతున్నారు.
ట్రేడింగ్ పేరుతో టీచర్‌కు టోకరా - రూ.29 లక్షలు కాజేసిన సైబర్ నేరగాళ్లు - Cyber Criminals Fraud