CS Review Meeting on Paddy Procurement in Telangana : రాష్ట్రంలో యాసంగి ధాన్యం కొనుగోళ్ల కోసం సర్కారు సన్నద్ధమైంది. అందుకోసం 7 వేల 149 కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు సీఎస్ శాంతికుమారి వెల్లడించారు. నాలుగైదు రోజుల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలన్నీ ప్రారంభమవుతాయని ఆమె తెలిపారు. ఇప్పటికే ప్రారంభమైన పలు కేంద్రాల్లో ధాన్యం కొనుగోళ్లు ముమ్మరంగా సాగుతున్నాయన్నారు. ప్రైవేట్ వ్యాపారులు కాంటాలు తెరిచి, మద్దతు ధర కంటే తక్కువకు కొనుగోళ్లు చేస్తే చర్యలు తీసుకోవాలని కలెక్టర్లను సీఎస్ ఆదేశించారు. రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్లు, వేసవి జాగ్రత్తలు, నీటి సరఫరా, మన ఊరు-మన బడి పనులపై కలెక్టర్లతో సీఎస్ శాంతికుమారి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
రాష్ట్రంలో తాగునీటి సరఫరాను మరింత సమర్థవంతంగా నిర్వహించేందుకు జిల్లా, మండల, గ్రామ స్థాయిలో ప్రత్యేకాధికారులను నియమిస్తున్నట్టు వెల్లడించారు. జిల్లాలో తాగునీరు సరఫరా పర్యవేక్షణ బాధ్యత స్థానిక సంస్థల అదనపు కలెక్టర్లదేనని స్పష్టం చేశారు. మండలానికి జిల్లా స్థాయి అధికారి, వార్డు, గ్రామాలకు మండల స్థాయి అధికారిని నియమిస్తున్నట్టు చెప్పారు.
Government Safety Measures for Summer in Telangana : ఎక్కడైనా మంచినీటి సరఫరాకు ఆటంకం ఏర్పడితే, గ్రామాల్లోని వ్యవసాయ బావుల నుంచి అద్దె ప్రాతిపదికపై నీటిని సరఫరా చేయాలని లేదా ట్యాంకర్ల ద్వారా పంపించాలని శాంతికుమారి సూచించారు. నాగార్జునసాగర్ నుంచి పాలేరు జలాశయానికి తాగునీటి అవసరాల కోసం కృష్ణా జలాలను విడుదల చేశామన్నారు. మన ఊరు - మన బడి కార్యక్రమం కింద అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో పనులన్నీ వెంటనే ప్రారంభించి, పురోగతిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని కలెక్టర్లను సీఎస్ ఆదేశించారు.
High Temperature in Telangana : రెండు నెలల పాటు ఉష్ణోగ్రతలు ఎక్కువగా నమోదవుతాయన్న వాతావరణ శాఖ హెచ్చరికలతో వడ దెబ్బ, డీ -హైడ్రేషన్‌పై ప్రజలను చైతన్యపరచాలని కలెక్టర్లకు తెలిపారు. ఉత్తర తెలంగాణ జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలకు చేరడం, వడగాలులు వీచే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఇప్పటికే అన్ని జిల్లాలకు ఓఆర్ఎస్ ప్యాకెట్లు, ఐ.వీ ఫ్లూయిడ్లు, మందులను పంపించామని, వాటిని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, సబ్ సెంటర్లలో అందుబాటులో ఉంచాలని అధికారులకు సూచించారు.
ఆశా కార్యకర్తలు, ఉపాధి హామీ పనుల కేంద్రాల వద్ద ఓఆర్ఎస్ ప్యాకెట్లను అందుబాటులో పెట్టాలన్నారు. ఉదయం 11 నుంచి సాయంత్రం 4 వరకు పిల్లలు, వృద్ధులు బయటకు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సీఎస్ సూచించారు. రాష్ట్రంలో ఏ ఒక్కరూ ఎండదెబ్బ బారిన పడకుండా ముందు జాగ్రత చర్యలను చేపట్టాలని కలెక్టర్లకు స్పష్టం చేశారు.