Crop Loss Due To No Water in Mulugu District : కాలం చెల్లిపోయి నెలలు గడిచినా పక్కనే ఉన్న ఒర్రెలో నీరును చూసి గంపెడు ఆశతో రైతులు వరి పంటను సాగు చేశారు. కానీ అది చేతికి వచ్చే సమయానికి సాగునీరు అందక ఎకరాల కొద్ది పంట పొలాలు ఎండిపోతున్నాయి. దీంతో పంటంతా పశువులకు మేతగా మారింది. ములుగు జిల్లా వెంకటాపూర్ మండలం లక్ష్మీదేవి పేట గ్రామానికి చెందిన రైతుల పరిస్థితి దయనీయంగా మారింది.
Laxmidevipeta Farmers Issues : గతేడాది వర్షాకాలంలో కురిసిన భారీ వర్షాలకు మారేడుగొండ చెరువుకు నాలుగు చోట్ల గండి పడడంతో పంటలన్నీ కొట్టుకుపోయాయి. దానికి ప్రభుత్వం ఇప్పటివరకు ఎలాంటి పరిహారం అందిచలేదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గండి కారణంగా అప్పుడు పంటలు వేసుకునే అవకాశం లేక సాగు చేయలేదు. చెరువు ఎగువ భాగం నుంచి వెళ్లే దేవాదుల పైప్ లైన్ నుంచి చెరువులోకి గేటు కాల్వను మళ్లించి ఆ నీటితో రైతులు తమ పొలాలు సాగు చేసుకున్నారు. అలా సుమారు 100 ఎకరాలకు పైనే వరి పంట సాగు చేశారు. గత 25 రోజుల నుంచి నీరు సరఫరా ఆపివేయడంతో పంట పొలాలు ఎండు ముఖం పడ్డాయి. అప్పటికే చేతికొచ్చే దిశలో ఉన్న పంట పొలాలు 50 ఎకరాలరు పైనే ఎండిపోయాయి.
"మారెేడుగొండు చెరువుకు గండి పడ్డాక, దేవాదుల పైప్లైన్ నుంచి నీటి మళ్లించుకుని ఇన్ని రోజులు వ్యవసాయం చేశాం. పంట అంతా మంచిగా సాగింది, కానీ నోటికి వచ్చే సమయానికి దేవాదుల నీరు అందించే అధికారులు నీళ్లు అందించడంలేదు. ప్రభుత్వం స్పందించి మాకు న్యాయం చేయాలి. చెరువు కింద రైతుల బతుకు ఎడారి అయిపోయింది. మంత్రి సీతక్కను కలిశాక నీటి సరఫరా చేసే అధికారులతో మాట్లాడారు. నీళ్లు వస్తాయని చెప్పారు 25 రోజులు గడుస్తుంది కానీ ఇప్పటివరకు నీరు రావడం లేదు." - బాధిత రైతులు, లక్ష్మీదేవి పేట
నీటిపారుదల శాఖ అధికారుల చుట్టు ఎన్నిమార్లు తిరిగినా నీళ్లను విడుదల చేయడం లేదని రైతులు వాపోతున్నారు. మంత్రి సీతక్కను కలిసి సమస్యను వివరించినా ప్రయోజనం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. సీతక్క, అధికారులతో మాట్లాడి దేవాదుల పైప్లైన్ ద్వారా నీరు అందేలా కృషి చేస్తానని చెప్పినా ఇప్పటి వరకు ఆ ఊసే లేదని అంటున్నారు. రోజురోజుకు పంట పొలాలు ఎండిపోతున్నాయని రైతులు ఆవేదన చెందుతున్నారు. నష్ట పోయిన పంటకు పరిహారం చెల్లించాలని అన్నదాతలు వేడుకుంటున్నారు. ఎండాకాలం ముగిసేసరికి మారేడుగొండ చెరువుకు పడ్డ గండిపై అధికారులు దృష్టి సారించాలని కోరారు.
రాష్ట్రంలో ఎండుతున్న పంటలు - అన్నదాతకు తప్పని తిప్పలు - Telangana Farmers Worried Crop Loss
సాగర్ ఆయకట్టు రైతులకు నీటికష్టాలు - ఎండిన పంటలను తగలబెడుతున్న అన్నదాతలు