Creates Awareness Over Yesteryear Electronic Devices : నేటి యువత ఆలోచనల్లో ఏఐ, క్లౌడ్ కంప్యూటింగ్ వంటి సాంకేతికలే ఎక్కువగా మెదులుతున్నాయి. మైక్రో ప్రొసెసర్లు, సిలికాన్ చిప్‌లే కళ్లెదుట కనిపిస్తున్నాయి. కానీ పాతకాలంలో ఎలక్ట్రానిక్ ఉపకరణాల్లో ఏం వినియోగించారు? దశాబ్దాల క్రితం సాంకేతికత ఎలా ఉండేది? అనే విషయాల గురించి పాఠ్యపుస్తకాల్లోనే చూస్తున్నారు విద్యార్థులు. అయితే సంవత్సరాల పరిశోధనల ఫలితంగానే కొత్త ఆవిష్కరణలు, నూతన సాంకేతిక పరికరాలు అందుబాటులోకి వచ్చాయని 'ఎలక్ట్రోస్పియర్'లో తెలియజేశారు PSCMR ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులు.
పాతకాలంలో వినియోగించిన ఎలక్ట్రానిక్ వస్తువుల నుంచి నేటి రోబోటెక్నాలజీ వరకు 'ఎలక్ట్రోస్పియర్'లో ప్రదర్శించారు విజయవాడ పొట్టిశ్రీరాములు ఇంజనీరింగ్ కళాశాలలోని ఈసీ విభాగం విద్యార్థులు. ప్రదర్శనకు హాజరైన వందలమంది ఇతర కళాశాలల విద్యార్థులు ఈ వివరాలను ఆసక్తిగా విన్నారు.
కూచిపూడిలో గిరిజన బిడ్డల ప్రతిభ- దేశ విదేశాల్లో అద్భుత ప్రదర్శనలు - Kuchipudi in Srikakulam district
"ఆధునిక యుగంలో ఎలక్ట్రానిక్స్, సెమీ కండక్టర్ల రంగం కీలకంగా మారుతోంది. ఒకప్పుడు సాంకేతికత అంటే రెసిస్టర్, ఇండక్టర్, కెపాసిటర్‌లే. ఆ తేడాను తెలిపేందుకు ఈ ఎలక్ట్రోస్పియర్ ఎంతో ఉపయోగపడుతుంది. అలాగే విద్యుత్తు లెక్కింపు మీటర్లు? కీబోర్డులు ఎలా పనిచేస్తాయి? పాత కాలం PCBలు ఎలా ఉండేవి? ఇప్పుడు ఎలాంటి మార్పులు చోటుచేసుకున్నాయనే విషయాలను తెలుసుకోవచ్చు." - ప్రవల్లిక, విద్యార్థిని
"స్మార్ట్‌ఫోన్లతో క్షణాల్లో వీడియో లేదా ఆడియో కాల్స్ చేస్తున్నాం. గతంలో డేటా ట్రాన్స్‌ఫర్ కోడ్ విధానాలను ఏవిధంగా అనుసరించేవారో తెలుసుకొవచ్చు. అలాగే డేటా స్టోరేజీ కోసం ఒకప్పుడు గ్రామ్‌ఫోన్ రికార్డులు ఉండేవి. అప్పటి నుంచి ఉన్న హార్డ్‌డిస్క్‌లు,పెన్‌డ్రైవ్ వరకు ఎలా మార్పులు జరిగాయో తెలుసుకోవచ్చు." - కృష్ణసాయి, విద్యార్థి
"ఒక రోబోటిక్ కంపెనీతో కలిసి మైక్రో బెల్ట్ డిస్ఇన్ఫెక్షన్ రోబోను తయారు చేశాం. దీని ద్వారా ఆసుపత్రిలో ఎక్కడైతే వైరస్ ఎక్కువగా ఉంటుందో ఆ ప్రాతంలో ఈ రోబోతో వైరస్‌ను నాశనం చేయవచ్చు. దీన్ని రిమోట్ ద్వారా కంట్రోల్ చేయవచ్చు." - సూర్య, ఈసీ ప్రొఫెసర్
"కాలానుగుణంగా జరిగిన శాస్త్ర పరిజ్ఞానంపై విద్యార్థులకు అవగాహన కల్పించడమే ఎలక్ట్రోస్పియర్ ఉద్దేశం. దీని ద్వారా సెన్సార్ల ఆధారంగా పక్షులకు ఆహారం, నీరు అందించే బర్డ్ ఫీడింగ్ సిస్టమ్ గురించి తెలుసుకోవచ్చు. అలాగే మైక్రో ప్రోసెసర్లు, మైక్రో కంట్రోలర్‌లు గతంలో ఎలా పనిచేసేవని విశ్లేషించుకోవచ్చు. అదేవిధంగా ఎలక్ట్రానిక్ పరికరాల్లో సెన్సార్ల అవసరం, వాటి ప్రయోజనాలను క్లుప్తంగా తెలుసుకోవచ్చు. ఒకప్పుడు డయోడ్లను రేడియో, టీవీల్లో విరివిగా వాడేవారు. ప్రస్తుతం మన దేశంలో వినియోగంలో లేని డయోడ్ల గురించి కూడా తెలుసుకోవచ్చు." - డాక్టరు ఎ.పతంజలి శాస్త్రి, ప్రిన్సిపల్, పిఎస్‌సిఎంఆర్ ఇంజనీరింగ్ కళాశాల
ఒకప్పుడు ఎంతో ఖరీదైన ఎలక్ట్రానిక్ పరికరాలు ఇప్పుడు చౌకధరలకే ఎలా అందుబాటులోకి వచ్చాయో ఈ ప్రదర్శనలో వివరించారు PSCMR విద్యార్థులు. పాత, కొత్త రూపాలను కళ్లారా చూసేందుకు ఎలక్ట్రోస్పియర్ మంచి అవకాశం అంటున్నారు ప్రదర్శనకు హాజరైన విద్యార్థులు.