CRDA Approves Amaravati Works: అమరావతిలో 24,276.83 కోట్ల రూపాయల పనులకు సీఆర్డీఏ 43వ అథారిటీ సమావేశంలో ఆమోదం తెలిపినట్లు పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ తెలిపారు. అసెంబ్లీ, హైకోర్టు, ఐకానిక్ టవర్ల పనులకు ఆమోదముద్ర వేసినట్లు వెల్లడించారు. అమరావతి సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన సీఆర్డీఏ అథారిటీ సమావేశం జరిగింది.
ఇంతవరకు 3 సమావేశాల ద్వారా 45 వేల 249 కోట్ల పనులకు అథారిటీ అనుమతులిచ్చిందని మంత్రి చెప్పారు. అసెంబ్లీ భవనానికి 765 కోట్లు, హైకోర్టు భవనానికి 1048 కోట్లు, 5 ఐకానిక్ టవర్లకు 4665 కోట్లు ఖర్చు కానుందని వివరించారు. 4 జోన్లలో రహదారుల టెండర్లకు 9 వేల 699 కోట్లు ఖర్చు కానుందని, ట్రంకు రోడ్లకు 7 వేల 794 కోట్లకు అనుమతులిచ్చామని తెలిపారు.
వచ్చే మంత్రివర్గంలో వీటికి ఆమోదం తెలుపుతామన్నారు. సోమవారం నుంచి పనులకు సంబంధించిన టెండర్లు పిలువనున్నట్లు చెప్పారు. వైఎస్సార్సీపీ చేసిన విధ్వంసం నుంచి కోలుకుని మళ్లీ పనులకు టెండర్లు పిలిచే స్థాయికి వచ్చామని తెలిపారు. వైఎస్సార్సీపీ రాజధాని అమరావతి నిర్మాణం ఆపేయటం వల్లే దాదాపు 40 శాతం రేట్లు పెరిగాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. బురద జల్లటం తప్ప క్షేత్రస్థాయి పరిస్థితులు వైఎస్సార్సీపీకి ఏమైనా తెలుసా అని ప్రశ్నించారు.
రాజధాని మొత్తం చూడొచ్చు: అదే విధంగా అసెంబ్లీ భవనాన్ని 103 ఎకరాల్లో నిర్మిస్తున్నామని మంత్రి నారాయణ తెలిపారు. అసెంబ్లీ జరిగేది ఏడాదికి 40, 50 రోజులే అని, మిగతా రోజుల్లో ప్రజలు అసెంబ్లీ భవనం టవర్‌పైకి వెళ్లి సిటీ మొత్తం చూడవచ్చని అన్నారు. మూడ్రోజుల్లో టెండర్లు ప్రారంభం అవుతాయని, ఎలాంటి సమస్యలు ఎదురుకాకుండా చూస్తున్నామన్నారు. సీడ్ యాక్సిస్ రోడ్డు పనులు కూడా చేస్తామని వెల్లడించారు.
రాజధాని పునర్నిర్మాణంపై రోడ్ మ్యాప్ సిద్ధం - R5 జోన్‌తో మాస్టర్ ప్లాన్‌లో ఇబ్బందులు : CRDA