Cotton Prices Decrease : మూడేళ్ల క్రితం డీఏపీ (DAP) బస్తా ధర రూ.1050 ఉంటే, పత్తి క్వింటా ధర సగటున రూ.9 వేలు పలికింది. అదే డీఏపీ ధర ఇప్పుడు రూ.1350 పలికితే, పత్తి ధర సగటున రూ.7 వేల లోపు ఉంటోంది. ఎరువుల ధరలు పెరిగినట్లు పత్తి ధర పెరగకపోగా, తగ్గటమేంటని రైతులు ప్రశ్నిస్తున్నారు. పెట్టుబడులు భారమై, మద్దతు ధర దక్కట్లేదని అంటున్న అన్నదాతల ఆవేదన అరణ్యరోదనగా మిగిలిపోతోంది.
ఆదిలాబాద్ జిల్లా పత్తి పంట సాగులో ప్రసిద్ధి పొందింది. మేలి రకమైన నాణ్యతతో కూడిన పంట ఖండాంతర ఖ్యాతి గడించింది. అందుకే ఇక్కడ మార్కెట్కు అమ్మకానికి వచ్చే సరకును ఎగుమతి చేసేటప్పుడు ఇతర ప్రాంతాల్లోని సరకుతో కలిపి విక్రయించటం ద్వారా మంచి ధరనే లభిస్తుందనే మాట వ్యాపార వర్గాల నుంచే వినిపిస్తోంది. కానీ పంట రైతుల దగ్గర ఉన్నప్పుడు కాకుండా వ్యాపారుల దగ్గర చేరిన తర్వాత ధరలు పెరగటం ఆనవాయితీగా కొనసాగుతోంది. ఫలితంగా వచ్చే లాభం రైతులకు కాకుండా వ్యాపారులకు లబ్ధి చేకూరుతోందన్న ఆరోపణలు వ్యక్తం అవుతున్నాయి.
ఇదిలా ఉంటే రైతుల పెట్టుబడి ఖర్చులకు తగినట్లు పంట మద్దతు ధర లభించటం లేదు. దాంట్లో శాస్త్రీయత అనే విధానమే లేదు. జాతీయ, అంతర్జాతీయ మార్కెట్లు హెచ్చుతగ్గుదల పేరిట మాయాజాలం సాగుతోంది. మూడేళ్ల క్రితం ఆదిలాబాద్ మార్కెట్ యార్డులో క్వింటా పత్తి రూ.9,500 పలికింది. ఇప్పుడు అదే పత్తి రూ.6,500 నుంచి రూ.7000 మధ్య పలుకుతోంది. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా పత్తి ధర పెరగాల్సింది పోయి, తగ్గటం ఏంటనే రైతులు ఆవేదన అరణ్యరోదనగానే మిగిలిపోతోంది.
రైతుల గోడు ఎవరికీ పట్టడం లేదు : తేమ, నాణ్యత పేరిట సీసీఐ కొనుగోళ్లలో కొర్రీలు పెడుతుండటంతో వ్యాపారులకు కలిసి వస్తోంది. గత్యంతరం లేక వ్యాపారులు నిర్ణయించిన ధరలకే రైతులు సరకు విక్రయించుకోవాల్సి వస్తోంది. ఆదిలాబాద్ జిల్లాలో పండే పత్తి నాణ్యమైనదే అని అంగీకరిస్తున్న వ్యాపారులు, కేంద్ర ప్రభుత్వం ఎగుమతులను ప్రోత్సహించకపోవటంతోనే ధరలు పతనమవుతున్నాయని చెబుతున్నారు. రైతులకు మంచి ధరలు రావాలంటే ప్రైవేటు సంస్థలకు రాయితీలు ఇవ్వాలని ప్రతిపాదనలను వ్యాపారులు తెరపైకి తెస్తుంటే, అది కేంద్ర ప్రభుత్వ పరిధిలోని అంశమన్నట్లు మార్కెటింగ్ అధికారులు చెబుతున్నారు. ఫలితంగా రైతుల గోడు ఎవరికీ పట్టటం లేదు.
రైతుల బతుకు ఛిద్రం : రైతులు పంట అమ్ముకునేందుకు మార్కెట్కు వచ్చినప్పుడు తెర మీదకు వస్తున్న ప్రభుత్వ నిబంధనలు, అంతర్జాతీయ హెచ్చుతగ్గులు, సీజన్ ముగిసిన తర్వాత ప్రస్థావనకు రాకుండా పోతోంది. ప్రభుత్వాలు సైతం రైతులకు క్షేత్రస్థాయిలో ఎదురవుతున్న ఇబ్బందులను పరిగణలోకి తీసుకోవటం లేదు. ఫలితంగా తెల్ల బంగారం పండించే పత్తి రైతు బతుకు పొగ చూరుతోంది.
నిరీక్షణకు తెర - ఆదిలాబాద్ వ్యవసాయ మార్కెట్లో ఎట్టకేలకు పత్తి కొనుగోళ్లు ప్రారంభం