Yogi Vemana University VC, Registrar Issue In AP : కడప యోగివేమన విశ్వవిద్యాలయంలో వీసీ, రిజిస్ట్రార్‌ల నియామకంపై వివాదం ముదురుతోంది. లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొన్న కృష్ణారెడ్డి, రాంప్రసాద్ రెడ్డికి కీలక పదవులు కట్టబెట్టడంపై తీవ్ర దుమారం రేగుతోంది. వీరిని బాధ్యతల నుంచి తొలగించాలని నెల రోజులుగా విద్యార్థి సంఘాలు ఆందోళనలు చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోలేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
గడిచిన ఐదేళ్లలో వైసీపీ ప్రభుత్వం విశ్వవిద్యాలయాలను భ్రష్టుపట్టించిందనే ఆరోపణలు చేసిన కూటమి నేతలు అధికారంలోకి వచ్చిన తర్వాత వారు కూడా అదే తప్పు చేస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. యోగివేమన విశ్వవిద్యాలయంలో ఫిజిక్స్ ఫ్రొఫెసర్‌గా పనిచేస్తున్న కృష్ణారెడ్డికి ప్రభుత్వం వీసీ బాధ్యతలు అప్పగించింది. లైంగిక వేధింపుల ఆరోపణలున్న వ్యక్తికి పదవులేంటంటూ విద్యార్థి సంఘాలు రోడ్డెక్కాయి. వీసీ నియామకాన్ని వ్యతిరేకిస్తూ నెలరోజుల నుంచి విద్యార్థి సంఘాలు, వామపక్ష నేతలు ఆందోళనలు చేస్తూనే ఉన్నారు.
ఇది చాలదన్నట్లు తాజాగా విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్‌గా తప్పెట రాంప్రసాద్ రెడ్డిని ప్రభుత్వం నియమించింది. వీసీ కృష్ణారెడ్డి నియామకాన్ని రద్దుచేయాలని ఆందోళన చేస్తుంటే అగ్నికి ఆజ్యం పోసినట్లు కొత్తగా లైంగిక వేధింపులు ఎదుర్కొన్న మరో వ్యక్తిని రిజిస్ట్రార్‌గా నియమించడం ఏంటని విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కృష్ణారెడ్డిని బాధ్యతల నుంచి తప్పించాలంటూ నిరసనకు దిగారు.
రెండ్రోజుల కిందట రిజిస్ట్రార్‌గా బాధ్యతలు స్వీకరించిన తప్పెట రాంప్రసాద్ రెడ్డి 2011 లో విద్యార్థినులను విహారయాత్రకు తీసుకెళ్లి లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఆరోపణలున్నాయి. దానిపై గతంలోనే త్రిసభ్య కమిటీ నియమించి విచారణ చేపట్టగా వేధింపులు నిజమని నిర్ధారణ కావడంతో ఆయననూ దూరం పెట్టారు. వైసీపీ నేతలతో అంటకాగిన రాంప్రసాద్ రెడ్డి కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ప్లేట్ ఫిరాయించారు.
తాను టీడీపీకి విధేయుడినేనని ప్రచారం చేసుకుని జిల్లాలోని టీడీపీ ఎమ్మెల్యేలతో సిఫార్సు లేఖలు తెచ్చుకుని రిజిస్ట్రార్‌గా బాధ్యతలు తీసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. విద్యార్థులకు నైతిక విలువలు నేర్పాల్సిన వర్సిటీలో ఆరోపణలు ఎదుర్కొంటున్న వారికి ఉన్నత పదవులు కట్టబెట్టడమేంటని విద్యార్థి సంఘాలు ప్రశ్నిస్తున్నాయి. వీసీ, రిజిస్ట్రార్ లైంగిక వేధింపుల బాగోతంపై ఆధారాలతో సహా విద్యాశాఖ మంత్రి లోకేశ్‌కు విద్యార్థి సంఘ నేతలు ఫిర్యాదు లేఖలు పంపారు. వారిద్దరినీ తొలగించకపోతే ఆందోళన తీవ్రం చేస్తామని హెచ్చరించారు.