Congress Vani in Gandhi Bhavan Telangana : తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత పార్టీ కార్యకలాపాలలో వేగం తగ్గింది. కొత్తగా ఏర్పాటు అయిన ప్రభుత్వం కావడంతో పరిపాలనపై పూర్తిస్థాయిలో ముఖ్యమంత్రి, ఉప ముఖ్య మంత్రి, మంత్రులు దృష్టి సారించాల్సిన పరిస్థితి ఏర్పడింది. రోజువారి సమీక్షలతో సీఎం, మంత్రులు బిజీ బిజీగా గడుపుతుండడంతో పార్టీకి సంబంధించిన కార్యక్రమాలపై ఆశించిన రీతిలో సమయం కేటాయించలేక పోతున్నారన్న భావన పార్టీ వర్గాల్లో వ్యక్తం అవుతుంది. పార్టీకి చెందిన నాయకులకు, కార్యకర్తలకు పీసీసీ అధ్యక్షుడు కానీ ఇతర నాయకులు గానీ అందుబాటులో లేకపోవడం ఆ ప్రభావం పార్టీపై స్పష్టంగా కనబడుతోంది.
Congress Focus On Parliament Elections 2024 : పార్లమెంట్ ఎన్నికలు దగ్గర పడుతుండడంతో పార్టీని మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఏర్పడింది. కాంగ్రెస్ అధిష్టానం పార్లమెంట్ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. దీంతో పార్టీ నాయకులతో తరచూ సమావేశాలు నిర్వహించి, పార్టీని బలోపేతం చేసే దిశలో ముందుకు వెళ్లాల్సి ఉంది. అదే విధంగా ప్రజాపాలన దిశగా ముందుకు వెళుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం పార్టీపై కూడా దృష్టి సారించాల్సి ఉందని పార్టీ వర్గాలు అభిప్రాయ పడుతున్నాయి. ఇదే అంశాన్ని ఇటీవల పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డి, దీపా దాస్ మున్షిలు సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లినట్లు తెలుస్తోంది.
కాళేశ్వరం ప్రాజెక్టు అధ్యయనానికి నిపుణుల కమిటీ ఏర్పాటుకు సీఎం రేవంత్‌రెడ్డి నిర్ణయం
Congress TO Focus on Party Activities : పార్టీపై ప్రత్యేక దృష్టి సారించాలని పీసీసీ అధ్యక్షుడు హోదాలో రేవంత్ రెడ్డి నిర్ణయించినట్లు సమాచారం. ప్రజా భవన్లో వారానికి రెండు రోజులు పాటు ప్రజావాణి ద్వారా ప్రజల నుంచి వినతులు స్వీకరించినట్లుగా గాంధీభవన్‌లో కూడా పార్టీ కోసం కాంగ్రెస్ వాణి ఏర్పాటు చేయాలని భావిస్తున్నట్లు సమాచారం. ఇక్కడ కూడా వారానికి రెండు రోజులు మంత్రులు అందుబాటులో ఉండాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ప్రజా భవన్లో ప్రతి మంగళవారం, గురువారం రోజుల్లో మంత్రులు అందుబాటులో లేనప్పుడు అధికారులు ప్రజావాణి ద్వారా ప్రజల నుంచి వినతులు స్వీకరిస్తున్నారు.
15 రోజులకోసారి అందుబాటులో సీఎం : ప్రతి 15 రోజులకు ఒక రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ప్రతి వారంలో రెండు రోజులు మంత్రులు గాంధీభవన్‌లో అందుబాటులో ఉండాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. గాంధీభవన్‌లో ప్రతి బుధవారం శుక్రవారం లేదా శనివారం గాని ఏదో ఒక మంత్రి మూడు గంటల పాటు అందుబాటులో ఉండి కాంగ్రెస్ నాయకులు, పార్టీ శ్రేణుల నుంచి వినతులు స్వీకరిస్తారు. పార్టీ పరంగా వచ్చే విజ్ఞప్తులను ఎప్పటికప్పుడు పరిష్కరించేందుకు ప్రత్యేక యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.
అవును నేను మేస్త్రీనే- తెలంగాణను పునర్నిర్మించే మేస్త్రీని: సీఎం రేవంత్‌రెడ్డి
ప్రధానంగా క్షేత్రస్థాయిలో జరిగే సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలతో పాటు పార్టీ కార్యకలాపాలకు చెందిన అంశాలను కూడా ఇక్కడ ముఖ్యమంత్రి, మంత్రులు స్వీకరిస్తారు. నాయకుల ద్వారా వచ్చే వినతులను రాష్ట్ర పార్టీ యంత్రాంగం ద్వారా సమస్యలను పరిష్కారం చేసే దిశగా చర్యలు తీసుకుంటారు. దీనిపై ప్రాథమికంగా నిర్ణయం తీసుకున్న పీసీసీ పూర్తిస్థాయిలో చర్చించి ప్రజల నుంచి, పార్టీ నాయకులు నుంచి అందే సమస్యలు, ఇతర అంశాలను ఏ విధంగా పరిష్కరించాలి. అందుకు ఎలాంటి యంత్రాంగం ఉండాలి తదితర అంశాలపై పీసీసీలో చర్చ జరుగుతోంది. ఇదే అంశంపై పీసీసీ కార్యవర్గంలో కూడా చర్చించి ఓ నిర్ణయం తీసుకొని సమస్యల పరిష్కారానికి మార్గ నిర్దేశికాలను సిద్ధం చేయాలని భావిస్తోంది.
రైతులకు కార్పొరేట్ తరహా లాభాలు రావాలనేదే నా స్వప్నం: సీఎం రేవంత్