Congress Speed Up Lok Sabha Candidate Selection : తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ గెలుపు గుర్రాలకే లోక్‌సభ టికెట్లు ఇవ్వాలని నిర్ణయించింది. పార్లమెంట్ ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న రాష్ట్ర కాంగ్రెస్, కనీసం 14 స్థానాలను ఛేజిక్కించుకోవాలన్న లక్ష్యంతో ముందుకు వెళుతోంది. దీంతో బీజేపీ, బీఆర్‌ఎస్ అభ్యర్థులను దీటుగా ఎదుర్కోగలిగే నాయకులనే లోక్‌సభ ఎన్నికల బరిలో దించేందుకు వ్యూహాలు పన్నుతోంది. ఇప్పటికే లోక్‌సభ టికెట్లు ఆశిస్తూ దరఖాస్తు చేసుకున్న 309 మందిలో, కనీసం 50 మంది కూడా ప్రజాదరణ కలిగి, సత్తా ఉన్న నాయకులు లేరని ప్రాథమికంగా తేల్చినట్లు తెలుస్తోంది. రాష్ట్రంలోని మొత్తం 17 లోక్‌సభ స్థానాల్లో వరంగల్, నాగర్‌కర్నూల్, పెద్దపల్లి నియోజకవర్గాలు ఎస్సీలకు, మహబూబాబాద్, ఆదిలాబాద్ నియోజకవర్గాలు ఎస్టీలకు రిజర్వ్‌డ్ స్థానాలు. మిగిలిన 12 లోక్‌సభ నియోజకవర్గాల్లో కనీసం 5 స్థానాలను బీసీలకు ఇవ్వాలని రాష్ట్ర నాయకత్వం యోచిస్తున్నట్లు తెలుస్తోంది.
తెలంగాణ నుంచి లోక్‌సభ ఎన్నికల బరిలో రాహుల్ గాంధీ! - ఖమ్మం లేదా భువనగిరి నుంచి పోటీ
రిజర్వ్‌డ్ స్థానాలు 5పోగా భువనగిరి, నల్గొండ, మహబూబ్‌నగర్, చేవెళ్ల, మల్కాజిగిరి, సికింద్రాబాద్, హైదరాబాద్, జహీరాబాద్, మెదక్, నిజామాబాద్, కరీంనగర్, ఖమ్మం నియోజకవర్గాలు ఉన్నాయి. ఇందులో కూడా మహబూబ్‌నగర్ లోక్‌సభ స్థానానికి ఏఐసీసీ కార్యదర్శి, సీడబ్ల్యుసీ ప్రత్యేక ఆహ్వానితుడు వంశీచంద్ రెడ్డిని స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డినే కోస్గి సభలో అభ్యర్థిగా ప్రకటించారు. అత్యధిక మెజారిటీతో ఆయనను గెలిపించాలని నియోజకవర్గ ప్రజలకు పిలుపు నిచ్చారు. అంతేకాదు ఆయన్ను గెలిపిస్తే మరో రూ.5 వేల కోట్ల నిధులు నియోజకవర్గ అభివృద్ధికి తీసుకొస్తారని కూడా హామీ ఇచ్చారు.
ఇక మిగిలిన 11 లోక్‌సభ స్థానాల్లో హైదరాబాద్ ఎంఐఎం సిట్టింగ్ స్థానం. అక్కడ ఏ పార్టీ పోటీలో నిలబడినా పేరుకే ఉంటుందే తప్ప ఆ సీటుపై ఆధిపత్యం సాధించే అవకాశాలు తక్కువని చెప్పొచ్చు. ఇక ఉండే పదింటిలో నల్గొండ, భువనగిరి, చేవెళ్ల నియోజక వర్గాలు దాదాపు రెడ్లకు ఇచ్చే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. సికింద్రాబాద్, జహీరాబాద్, కరీంనగర్ నియోజకవర్గాలు బీసీలకు ఇచ్చే అవకాశం ఉన్నట్లు పీసీసీ వర్గాలు చెబుతున్నాయి.
గత పదేళ్లలో కేసీఆర్ వందేళ్లలో చక్కదిద్దలేనంత విధ్వంసం చేశారు : సీఎం రేవంత్
ఇక మిగిలిన 4 నియోజకవర్గాల్లో మల్కాజిగిరి ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి సిట్టింగ్ స్థానం కావడం, అక్కడ ఎవరు నిలబడాలన్నది సీఎం రేవంత్ రెడ్డినే (CM Revanth Reddy) పీసీసీ అధ్యక్షుడి హోదాలో నిర్ణయిస్తారని పార్టీ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. నిజామాబాద్ నుంచి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి పోటీలో దిగుతారని పార్టీ వర్గాలు చెబుతున్నప్పటికీ, ఆయనకు కొన్ని నియోజకవర్గ ప్రజలు అడ్డుతగులుతున్నట్లు తెలుస్తోంది. మెదక్ నుంచి కేసీఆర్ కుటుంబం (KCR) నుంచి పోటీలో దిగే అవకాశం ఉండటంతో అక్కడ పోటీ చేస్తామని దరఖాస్తు చేసిన వారిలో పీసీసీ అధికార ప్రతినిధి భవాని రెడ్డి, బండారు శ్రీకాంతరావులతో పాటు మరికొంత మంది ఉన్నప్పటికీ, వారి స్థాయి అక్కడ ఇతర పార్టీల నుంచి బరిలో దిగుతున్న నాయకుల బలాబలాల ముందు సరిపోదని పార్టీ రాష్ట్ర నాయకత్వం భావిస్తోంది.
Ministers Family Members Focus on Khammam MP Ticket : అక్కడ నుంచి బలమైన అభ్యర్థిని నిలబెట్టేందుకు పీసీసీ కసరత్తు చేస్తోంది. ఇక ఖమ్మం లోక్‌సభ నియోజకవర్గం అత్యంత పోటీ కలిగిన స్థానంగా చెప్పొచ్చు. రాజ్యసభకు ఎంపిక కావడంతో రేణుకా చౌదరి పోటీ నుంచి దూరమైనప్పటికీ, ఉమ్మడి ఖమ్మంలో ఉన్న ముగ్గురు మంత్రుల కుటుంబసభ్యులు దరఖాస్తు చేసుకున్నాయి. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క (Bhatti VIkramarka) సతీమణి నందిని, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సోదరుడు ప్రసాద్ రెడ్డి, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కుమారుడు ఉపేందర్‌లు కూడా ఎన్నికల్లో నిలిచేందుకు పోటీ పడుతున్నారు. దీంతో ముగ్గురు మంత్రుల కుటుంబ సభ్యులు బరిలో ఉంటామని చెబుతుండడం, టికెట్ కోసం పట్టుబడుతుండడంతో పాటు పార్టీ మాజీ పీసీసీ అధ్యక్షుడు హనుమంతరావు కూడా టికెట్ కోసం పోటీ పడుతున్నారు. గత కొంతకాలంగా ఆ నియోజకవర్గంలో పని చేసుకుంటూ పోతున్నట్లు వెల్లడించిన ఆయన, ఖచ్చితంగా ఖమ్మం నుంచి పోటీ చేసి తీరుతానని స్పష్టం చేస్తున్నారు.
గ్రేటర్‌పై కాంగ్రెస్ గురి - అధిక పార్లమెంట్ స్థానాలే లక్ష్యంగా చేరికలకు ఆహ్వానం
రాష్ట్రంలో ఇప్పటికి ఒక స్థానానికి అభ్యర్థిని ప్రకటించిన కాంగ్రెస్, 16 లోక్‌సభ నియోజకవర్గాలకు అభ్యర్థుల ఎంపికలో రాష్ట్ర నాయకత్వం ఆచితూచి ముందుకు వెళ్లాల్సి వస్తోంది. నాగర్ కర్నూల్ లోక్‌సభ నియోజక (Lok Sabha Elections 2024) వర్గం టికెట్ తనకేనని మాజీ ఎంపీ మల్లు రవి చెబుతూ రావడం రాష్ట్ర నాయకత్వానికి తలనొప్పిగా మారినట్లు పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. దిల్లీ ప్రత్యేక ప్రతినిధి పదవికి రాజీనామా చేసి పోటీలో నిలిచేందుకు సిద్ధపడడంతో ఎలా ముందుకు వెళ్లాలో పార్టీ నాయకత్వానికి దిక్కుతోచడం లేదు. అయినా కూడా టిక్కెట్ల విషయంలో రాజీలేని ధోరణిలో ముందుకు వెళ్లాలని రాష్ట్ర నాయకత్వం నిర్ణయించింది.
కాంగ్రెస్‌లోకి కొనసాగుతున్న వలసలు - బీఆర్ఎస్కు తీగల కృష్ణారెడ్డి రాజీనామా