Congress Screening Committee Meeting : రాష్ట్రంలోని 17 లోక్‌సభ స్థానాలను కైవసం చేసుకోవడమే లక్ష్యంగా కాంగ్రెస్ (Congress) కసరత్తు చేపట్టింది. అభ్యర్థుల ఎంపికపై జూబ్లీహిల్స్‌లోని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంట్లో శుక్రవారం దాదాపు 2 గంటలు స్క్రీనింగ్ కమిటీ (Screening Committee) సమావేశమైంది. రాష్ట్రంలోని 17 లోక్‌సభ స్థానాలకు 309 దరఖాస్తులు రాగా, ప్రదేశ్ ఎన్నికల కమిటీ వాటిని పరిశీలన చేసి, ఒక్కో నియోజకవర్గానికి మూడు నుంచి నాలుగు పేర్లతో కూడిన జాబితా సిద్దం చేసినట్లు తెలుస్తోంది. ఆ జాబితాతో పాటు అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా ఏఐసీసీ, పీసీసీ స్థాయిలో ఇచ్చిన హామీలు, కొత్తగా పార్టీలో చేరిన నేతలను దృష్టిలో పెట్టుకొని అభ్యర్థుల ఎంపికపై స్క్రీనింగ్ కమిటీ విస్తృతంగా చర్చించింది.
మహబూబ్‌నగర్ లోక్‌సభ అభ్యర్థిగా ఏఐసీసీ కార్యదర్శి వంశీచంద్ రెడ్డిని కోస్గీ బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) అధికారికంగా ప్రకటించారు. ఇక 16 లోక్‌సభ స్థానాలపై చర్చలు జరిపిన స్క్రీనింగ్ కమిటీ కొందరి పేర్లను కొలిక్కి తెచ్చింది. కరీంనగర్ నుంచి ప్రవీణ్ కుమార్ రెడ్డి, నిజామాబాద్ నుంచి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, పెద్దపల్లి నుంచి గడ్డం వంశీ పేరు ఖరారు చేసినట్లు విశ్వసనీయ సమాచారం. జహీరాబాద్ నుంచి సురేశ్ షెట్కార్, చేవెళ్ల నుంచి సునీతా మహేందర్ రెడ్డి, సికింద్రాబాద్ నుంచి బొంతు రామ్మోహన్ కుటుంబం నుంచి పేరు సిఫార్సు చేసినట్లు తెలుస్తోంది.
దమ్ముంటే కేసీఆర్ మహబూబ్‌నగర్ స్థానం నుంచి పోటీ చేయాలి : వంశీచంద్‌రెడ్డి
Congress Lok Sabha Candidate Selection : నల్గొండ నుంచి జానారెడ్డి కుటుంబ నుంచి టికెట్టు ఇచ్చే అవకాశం ఉంది. భువనగిరి నుంచి చామల కిరణ్ రెడ్డి, మహబూబాబాద్ నుంచి బలరాం నాయక్ పేరును ప్రతిపాదించినట్లు తెలుస్తోంది. ఖమ్మం, నాగర్‌కర్నూల్, వరంగల్, ఆదిలాబాద్, మెదక్, మల్కాజ్‌గిరి అభ్యర్థుల ఎంపికలో ఏకాభిప్రాయం కుదరలేదని సమాచారం. ఖమ్మం నుంచి రాహుల్ గాంధీ (Rahul Gandhi) పోటీ చేసే అవకాశం ఉండటం, ఉప ముఖ్య మంత్రితో పాటు మరో ఇద్దరు మంత్రుల కుటుంబాల నుంచి టికెట్ ఆశిస్తుండటంతో నిర్ణయం అధిష్ఠానానికి వదిలి పెట్టినట్లు తెలుస్తోంది. నాగర్ కర్నూల్ నుంచి పోటీకి మల్లురవితో పాటు మరికొందరు టికెట్ ఆశిస్తుండటంతో ఎటూ తేల్చలేదు. మిగిలిన స్థానాల్లో పరిశీలన చేసినా, అక్కడ సరైన అభ్యర్థులు లేరన్న భావన వ్యక్తమైనట్లు తెలుస్తోంది.
స్క్రీనింగ్ కమిటీ సిద్ధం చేసిన అభ్యర్థుల జాబితాలు పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీకి పంపించింది. కేంద్ర ఎన్నికల కమిటీ ఆ జాబితాను పరిశీలించి, అభ్యర్థుల ఎంపికను అధికారికంగా ప్రకటిస్తుంది. ఎక్కడైనా ఇద్దరు సమవుజ్జీలు టికెట్ కోసం పోటీపడితే, ఆ నియోజకవర్గం అభ్యర్థి ఎంపికను పార్టీ అధిష్ఠానానికి నివేదిస్తుంది. పార్టీ అధిష్ఠానం ఆ రెండు పేర్లపై పూర్తి వివరాలు పరిశీలించి, ఏఐసీసీ నిర్ణయం తీసుకుంటుంది. ఏకాభిప్రాయం కుదిరినా నియోజకవర్గంలోని సంబంధిత నాయకులకు ఉన్న ప్రజాదరణ, ఇతర అంశాలపై ప్రత్యేకంగా సర్వే నిర్వహించనున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడిస్తున్నాయి.
పాలమూరు-రంగారెడ్డి నిధులపై పూర్తిస్థాయిలో విచారణ జరిపిస్తాం : కాంగ్రెస్
ధరణి సమస్యలు పరిష్కరించేందుకు ప్రత్యేక డ్రైవ్ : కోదండ రెడ్డి