Condolences to Dharmapuri Srinivas : సీనియర్ రాజకీయ నేత, రాజ్యసభ మాజీ సభ్యుడు ధర్మపురి శ్రీనివాస్ మృతిచెందారు. హైదరాబాద్‌లోని తన నివాసంలో తెల్లవారుజామున 3 గంటలకు ఆయన తుది శ్వాస విడిచారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన, హైదరాబాద్‌లోని సిటీన్యూరో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గుండెపోటుతో చనిపోయినట్లు కుటుంబసభ్యులు తెలిపారు.
రేపు డీఎస్ అంత్యక్రియలు- నిజామాబాద్ వెళ్లనున్న సీఎం రేవంత్ - cm revanth tributes to ds
బంజారాహిల్స్‌లోని నివాసానికి డీఎస్ పార్థివదేహాన్ని తరలించారు. డీఎస్‌కు ఇద్దరు కుమారులు. వారిలో చిన్న కుమారుడు ధర్మపురి అర్వింద్ ప్రస్తుతం బీజేపీ తరఫున నిజామాబాద్ ఎంపీగా ఉన్నారు. పెద్ద కుమారుడు సంజయ్ గతంలో నిజామాబాద్ మేయర్ పనిచేశారు. తండ్రి మృతిపట్ల కుమారుడు ఎంపీ అర్వింద్ భావోద్వేగ ట్వీట్ చేశారు. అన్నా అంటే నేనున్నా అని ఏ ఆపదలో అయినా ఆదుకునే శీనన్న ఇకలేరని, నా తండ్రి, నా గురువు అన్నీ మా నాన్నే అని ట్వీట్లో పేర్కొన్నారు.
కేసీఆర్ సంతాపం.. డీ. శ్రీనివాస్ మృతిపట్ల ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సంతాపం తెలిపారు. ఉమ్మడి రాష్ట్రంలోని కాంగ్రెస్‌లో సుదీర్ఘ కాలం కాంగ్రెస్‌కు డీఎస్ విశిష్ట సేవలు అందించారని ఆయన గుర్తుచేశారు. డీఎస్ మృతిపట్ల డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సహా రాష్ట్రమంత్రులు, మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. మంత్రిగా, ఎంపీగా డీఎస్ సుదీర్ఘకాలం సేవలందించారని కేసీఆర్ తెలిపారు. డీఎస్ కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపిన ఏపీ సీఎం చంద్రబాబునాయుడు, సుదీర్ఘకాలం రాజకీయాల్లో డీఎస్ తనదైన ముద్రవేశారన్నారు.
కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి నివాళి.. మాజీ మంత్రి డీఎస్ భౌతికకాయానికి పలువురు రాజకీయ ప్రముఖులు నివాళి అర్పించారు. డీఎస్ పార్థివదేహానికి వెంకయ్యనాయుడు నివాళులు అర్పించారు. కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి హైదరాబాద్ బంజారాహిల్స్ లోని ఆయన నివాసంలో డీఎస్ భౌతికకాయానికి నివాళులు అర్పించారు. మంత్రులు పొన్నం ప్రభాకర్, కోమటిరెడ్డి వెంకటరెడ్డి కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్, మాజీ స్పీకర్ పోచారం శ్రీనినివాస్ రెడ్డి, మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్, ఎంపీలు బలరామ్‌నాయక్, కొండా విశ్వేశ్వరరెడ్డిలు అంజలి ఘటించారు.
నిజామాబాద్‌కు డీఎస్ పార్థివదేహాన్ని తరలించారు. రేపు ఉదయం అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంసభ్యులు తెలిపారు. ప్రభుత్వ అధికార లాంఛనాలతో అంత్యక్రియలకు ఏర్పాట్లు చేయాలని సీఎస్‌ను సీఎం ఆదేశించారు.
"డీఎస్ చాలా కాలం ప్రత్యక్ష రాజకీయాల్లో ఉన్నారు. ప్రజలకు విస్తృత సేవలందించారు. డీఎస్ మరణం చాలా బాధాకరం. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలి. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాను". - కిషన్‌రెడ్డి, కేంద్రమంత్రి.
"కాంగ్రెస్ సీనియర్ నేత ధర్మపురి శ్రీనివాస్ మృతి చెందడం బాధాకరం. ఆయన కాంగ్రెస్ పార్టీకి ఎంతో కాలం సేవలందించారు. ఆయన మృతి పట్ల సంతాపం తెలుపుతున్నాము. డీఎస్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి ప్రకటిస్తున్నాము". - భట్టి విక్రమార్క, ఉపముఖ్యమంత్రి
కాంగ్రెస్ సీనియర్ నేత డీఎస్ కన్నుమూత - ధర్మపురి అర్వింద్ భావోద్వేగ పోస్ట్ - D Srinivas passed away