Congress Govt on New Airports in Telangana : రాష్ట్రంలో కొత్త విమానాశ్రయాలపై ఆశలు చిగురిస్తున్నాయి. ప్రస్తుతం శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం మాత్రమే అందుబాటులో ఉండగా, బేగంపేటలో విమానాశ్రయం ప్రముఖులు మాత్రమే ఉపయోగించుకుంటున్నారు. ఇటీవల వరంగల్‌లో జరిగిన సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వరంగల్, కొత్తగూడెం, రామగుండం, ఆదిలాబాద్‌లలో ఎయిర్‌పోర్టులను ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. గత ప్రభుత్వం కూడా ఈ ప్రక్రియపై కసరత్తు చేసింది. ఎయిర్‌పోర్టు అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ) బృందం సైతం పర్యటించి టెక్నో ఎకనామిక్ ఫీజిబిలిటీతో పాటు ఇతర అంశాలపై పరీక్షలు నిర్వహించింది.
ఏఏఐ బృందం నిర్విహించినా, దాని నివేదికలు మాత్రం బయటకు రాలేదు. వివిధ కారణాలతో కొత్త ఎయిర్‌పోర్టుల నిర్మాణం ముందుకు సాగలేదు. తాజాగా కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న చర్యలతో రాష్ట్రంలో విమానాశ్రయాలు రానున్నాయి. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రిగా తెలుగు వ్యక్తి రామ్మోహన్‌నాయుడు ఉండడంతో అనుమతుల విషయంలోనూ సానుకూల స్పందన లభించే అవకాశం ఉంది. ఇప్పటికే కొత్త ఎయిర్‌పోర్టుల నిర్మాణం అంశంపై మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కేంద్రమంత్రి దృష్టికి తీసుకెళ్లారు.
నాలుగేళ్లలో అందుబాటులోకి వచ్చేలా : రాష్ట్రంలో హైదరాబాద్ తర్వాత రెండో పెద్ద నగరం వరంగల్. వరంగల్‌లోని మామునూరులో నిజాం కాలంలోనే వాయుదూత్ విమానాలు నడిచేవి. అక్కడ విమానాశ్రయం మూతపడి సుమారు 32 ఏళ్లు అవుతోంది. దీనికి సంబంధించి అక్కడ 696.14 ఎకరాల భూమి ఉంది. అయినా మరింత భూమి కావాలని ఎయిర్‌పోర్టు అథారిటీ ఆఫ్ ఇండియా రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లింది. ఈ నేపథ్యంలో విస్తరణకు అవసరమైన 253 ఎకరాల భూసేకరణకు ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం రూ.205 కోట్లను విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. చిన్న విమానాల రాకపోకలకు మొదటి దశలో వరంగల్‌లోని మామునూరు ఎయిర్‌పోర్టును తీర్చిదిద్దనున్నారు.
ఎయిర్‌పోర్టు అభివృద్ధికి, మాస్టర్ ప్లాన్ తయారీకి దాదాపు 8 నెలల గడువును లక్ష్యంగా పెట్టుకున్నారు. రెండో దశలో పెద్ద విమానాలు, కార్గో విమానాల ఆపరేషన్‌కు వీలుగా సంవత్సరంలోపు అన్ని ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. రాబోయే నాలుగేళ్లలో మామునూరుతో పాటు భద్రాద్రి కొత్తగూడెం, ఆదిలాబాద్, రామగుండంలో కూడా విమానాశ్రయాలను అందుబాటులోకి తీసుకొచ్చేలా రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోనూ దాదాపు వెయ్యి ఎకరాల్లో నిర్మాణ పనులకు అడుగులు పడుతున్నాయి. ఇప్పటికే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని మూడు మండలాలలోని భూసేకరణపై ఓ అంచనా వేశారు.
మరో రెండింటిపై సందిగ్ధత : రామగుండంలో కూడా అడ్డంకులు తొలిగిపోయే అవకాశాలు ఉన్నాయి. గతంలోనే ఈ పట్టణ సమీపంలో బసంత్‌నగర్‌లో ఎయిర్‌పోర్టు ఉండేది. బీకే బిర్లా తమ సిమెంట్ పరిశ్రమ సమావేశాలకు రావడానికి ఈ ఎయిర్‌పోర్టును ఏర్పాటు చేసుకున్నారు. ప్రస్తుతం ఇదే ప్రాంతంలో కొత్తది ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది. అదిలాబాద్‌లో 1,592 ఎకరాల భూమి సిద్ధంగా ఉందని, గతంలోనే స్థానిక ప్రజాప్రతినిధులు కేంద్రం దృష్టికి తీసుకెళ్లారు.
ఈ ప్రాంతాల్లో విమానాశ్రయాల ఏర్పాటుకు ఏఏఐ నుంచి సానుకూల స్పందన వస్తే రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రక్రియను ముందుకు తీసుకెళ్లడానికి సిద్ధంగా ఉంది. గతంలో మహబూబ్‌నగర్, నిజామాబాద్ జిల్లాల్లోనూ విమానాశ్రయ ఏర్పాట్లపై ఏఏఐ బృందం క్షేత్రస్థాయిలో పర్యటించింది. అయితే ఇక్కడ ఎయిర్‌పోర్టుల ఏర్పాటుకు పరిస్థితులు అనుకూలంగా లేనట్లు గుర్తించింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం వరంగల్, రామగుండం, భద్రాద్రి కొత్తగూడెం, ఆదిలాబాద్‌లో ఏర్పాటు చేస్తామని ప్రకటించడంతో మిగతా రెండింటిపై సందిగ్ధత కొనసాగుతోంది.
అడుగు పడింది - విమానం ఎగరనుంది - త్వరలోనే సాకారం కానున్న వరంగల్ వాసుల కల!