Congress Focus on GST Evasion in Telangana : దేశవ్యాప్తంగా 2017 నుంచి అమలవుతున్న జీఎస్టీ ఈ ఏడాది నెల వరకు రాబడిలో భారీగా పెరుగుదలను నమోదు చేసింది. కానీ రాష్ట్రంలో మాత్రం జీఎస్టీ రాబడుల్లో పెరుగుదల ఆశించిన స్థాయిలో కనిపించడం లేదు. 2022-23 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రంలో జీఎస్టీ కింద రూ.37 వేల 26 కోట్లు ఆదాయం రాగా, 2023-24 ఆర్థిక సంవత్సరంలో రూ.40 వేల 650 కోట్లు రాబడి వచ్చింది. జీఎస్టీ వృద్ధి కేవలం 10 శాతం నమోదైనట్లు వాణిజ్య పన్నుల శాఖ అధికారిక లెక్కలు వెల్లడిస్తున్నాయి. ఇక పెట్రోల్, డీజిల్, మద్యం అమ్మకాలపై వ్యాట్ రాబడులను పరిశీలిస్తే, 2022-23 ఆర్థిక సంవత్సరంలో రూ.29 వేల 516 కోట్ల రాబడి రాగా, 2023-24 ఆర్థిక సంవత్సరంలో రూ.29 వేల 985 కోట్లు ఆదాయం వచ్చి కేవలం 2 శాతం మాత్రమే వృద్ధి సాధించింది.
VAT Scams in Telangana : మొత్తమ్మీద అటు జీఎస్టీ కానీ, ఇటు వ్యాట్ కానీ ఆశించిన స్థాయిలో పెరుగుదల నమోదు చేయలేదు. వాణిజ్య పన్నుల శాఖ నుంచి 2023-24 ఆర్థిక సంవత్సరంలో రూ.83 వేల 500 కోట్ల ఆదాయం వస్తుందని ప్రభుత్వం అంచనా వేయగా, రూ.72 వేల 157 కోట్లు మాత్రమే వచ్చినట్లు వాణిజ్య పన్నుల శాఖ అధికారిక గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ఈ పరిస్థితులపై ఇటీవల ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించిన రాష్ట్ర ముఖ్యమంత్రి, వాణిజ్య పన్నుల శాఖతో పాటు ఇతర శాఖల పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. పన్నుల ఎగవేతదారులపై ఉక్కుపాదం మోపాలని సీఎం ఆదేశించారు.
బిల్లులు వేరేవి చూయించి ట్యాక్స్ ఎగవేత : ముఖ్యమంత్రి ఆదేశాలతో రాష్ట్రంలో పన్నుల ఎగవేతదారులపై కఠిన చర్యలు తీసుకునేందుకు వాణిజ్య పన్నుల శాఖ సన్నద్ధమవుతోంది. బయట నుంచి రాష్ట్రానికి దిగుమతి అవుతున్న వస్తువుల్లో ఎక్కువ భాగం గూడ్స్ రైళ్ల ద్వారానే వస్తుండగా, మరికొన్ని రోడ్డు మార్గాన కూడా దిగుమతి అవుతుంటాయి. ఈ నేపథ్యంలో బయట రాష్ట్రాల నుంచి దిగుమతి అయ్యే వస్తువులపై వాణిజ్య పన్నుల అధికారులు ప్రత్యేక దృష్టి సారించాల్సి ఉంది. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే వస్తువుల్లో బిల్లుల్లో చూపించే ధరకు, వాస్తవ ధరకు పొంతనే ఉండటం లేదు. రూ.100 వస్తువును సైతం రూ.10 నుంచి రూ.15 మాత్రమే బిల్లులో చూపించే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తుండటంతో, ఆ 10 రూపాయలకు మాత్రమే జీఎస్టీ వస్తుంది.
అయితే మరికొందరు అది కూడా కట్టకుండా జీరో వ్యాపారం చేస్తూ, ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారు. కలకత్తా నుంచి చిన్న పిల్లల దుస్తులు, హరియాణా, పంజాబ్, కశ్మీర్, ఉత్తరాఖండ్‌ల నుంచి బాస్మతి బియ్యం రాష్ట్రానికి వస్తుంటాయి. ఇతర చోట్ల నుంచి తెచ్చిన బాస్మతి రైస్‌కు బ్రాండింగ్ వేసి అమ్ముతుంటారు. దీనికి 5 శాతం జీఎస్టీ ప్రభుత్వానికి చెల్లించాల్సి ఉంటుంది. అదేవిధంగా కాపర్ ఎలక్ట్రిక్ వైర్, సెల్‌ఫోన్‌లు, గిఫ్టెడ్ ఆర్టికల్స్, వన్ గ్రామ్ గోల్డ్ ఆభరణాలు, దిల్లీ, ముంబయి, కలకత్తా నుంచి దిగుమతి అవుతుంటాయి. వీటిపై 18 శాతం జీఎస్టీ వసూలు చేయాల్సి ఉంటుంది.
బరువును బట్టి పన్ను : మొబైల్స్, ఎలక్ట్రానిక్ వస్తువులు, శానిటరీ వస్తువులతో పాటు స్థిరాస్తి వ్యాపారానికి సంబంధించిన వస్తువులు ఎక్కువగా అండర్ వాల్యూయేషన్‌తో దిగుమతి అవుతుంటాయి. బ్రాండెడ్ వస్తువులపై జీఎస్టీ వస్తున్నప్పటికీ ఎక్కువగా అమ్ముడుపోయే చౌక వస్తువులపై మాత్రం ఆశించిన మేరకు రాని పరిస్థితి రాష్ట్రంలో కనిపిస్తోంది. తక్కువ బరువు అంటే కిలో, రెండు కిలోలు, అయిదు కిలోలు, పది కిలోలు ఇలా 25 కిలోల బరువు వరకు మాత్రమే 5 శాతం జీఎస్టీ చెల్లించాల్సి ఉంటుందని చట్టం స్పష్టం చేస్తోంది. దీన్ని ఆసరాగా చేసుకుంటున్న కొందరు వ్యాపారులు 25 కిలోల బియ్యం బస్తాలను కాస్త 26 కిలోలకు పెంచి బ్రాండెడ్ వాటికి సైతం జీఎస్టీ ఎగవేతకు పాల్పడుతున్నారు.
GST ఆల్‌టైమ్ రికార్డ్- రూ.2.10 లక్షల కోట్లు దాటిన ఏప్రిల్ వసూళ్లు - GST Collection April 2024
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశాలతో వాణిజ్య పన్నుల శాఖలో కదిలిక రావడంతో పాటు జీఎస్టీ, వ్యాట్ ఎగవేతదారులపై కఠిన చర్యల దిశగా వాణిజ్య పన్నులశాఖ చర్యలు చేపడుతోంది. బయట రాష్ట్రాల నుంచి దిగమతి అయ్యే రైల్వే స్టేషన్ల పార్సిల్ సర్వీస్ కేంద్రాలు, లారీల ద్వారా వచ్చే వస్తువులు, వాటిని నిల్వ చేసే గోడౌన్లు తదితర వాటితో పాటు వ్యాపార సంస్థలపై ఆకస్మిక తనిఖీలు నిర్వహించడం, వాహన తనిఖీలు చేయడం లాంటి వాటివి చేపట్టే దిశగా ముందుకు వెళ్తోంది.
వాణిజ్య పన్నుల డివిజన్ల వారీగా దిగుమతుల కేంద్రాలు, పెద్ద పెద్ద వ్యాపార సంస్థలు, గోదాములు, పార్సిల్ కేంద్రాలు, ప్రైవేటు గోదాములు లాంటివి ఎక్కడెక్కడ ఉన్నాయో గుర్తించే పనిని అధికారులు ప్రారంభించారు. నిక్కచ్చిగా పన్నులు చెల్లించే వ్యాపారుల పట్ల ఎలాంటి వేధింపులు లేకుండా, పన్నులు ఎగవేసి ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్న అక్రమార్కుల భరతం పట్టినట్టైతే, కనీసం రూ.1500 నుంచి రూ.2 వేల కోట్ల వరకు అదనంగా రాబడి పెరుగుతుందని వాణిజ్య పన్నుల శాఖ అంచనా వేస్తోంది.