Congress Focus on Second Phase MP List : రాష్ట్రం నుంచి లోక్‌సభకు పోటీ చేసే అభ్యర్థులపై కాంగ్రెస్ కసరత్తు ముమ్మరం చేసింది. తొలి జాబితాలో రాష్ట్రానికి చెందిన నలుగురి పేర్లను ప్రకటించిన హస్తం పార్టీ, మిగిలిన 13 నియోజకవర్గాల అభ్యర్థులపై ఎడతెగని చర్చలు సాగిస్తోంది. ఇప్పటికే కాంగ్రెస్ వ్యూహకర్త సునీల్ కనుగొలు బృందం, ఆ 13 స్థానాలకు సంబంధించిన నాయకులపై ఫ్లాష్ సర్వేలు నిర్వహిస్తోంది. ఒకటి రెండ్రోజుల్లో సర్వే నివేదికలు వచ్చే అవకాశం ఉందని పార్టీ వర్గాలు వెల్లడిస్తున్నాయి.
పోటీ అధికంగా ఉన్న నియోజకవర్గాల నాయకులు, కొత్తగా పార్టీలో చేరి టికెట్లు ఆశిస్తున్న వారితో, రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహరాల ఇన్‌ఛార్జీ దీపాదాస్ మున్షీ సమావేశమై వారి అభిప్రాయాలు తెలుసుకుంటున్నారు. ఈ మేరకు నాగర్‌కర్నూల్ అభ్యర్థి ఎంపికపై, మంత్రి జూపల్లి కృష్ణారావు(Minister Jupalli Krishna Rao), ఎమ్మెల్యేలు కసిరెడ్డినారాయణరెడ్డి, రాజేశ్‌రెడ్డి, గద్వాల జడ్పీఛైర్‌పర్సన్ సరిత సహా పలువురు నేతల అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు.
Congress Plans Flash Surveys For MP Candidates : సికింద్రాబాద్ లోక్‌సభ అభ్యర్థిగా మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ కుటుంబానికి ఇవ్వాలని కాంగ్రెస్ భావించగా, పలువురు అభ్యంతరం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ప్రత్యామ్నాయంగా విద్యా స్రవంతి, చార్టెడ్ అకౌంటెంట్ వేణుగోపాలస్వామి పేర్లు పరిశీలిస్తున్నట్లు సమాచారం. భువనగిరి నుంచి చామల కిరణ్ కుమార్ రెడ్డితో పాటు కోమటిరెడ్డి మోహన్‌రెడ్డి కుమారుడు సూర్యపవన్ రెడ్డి పేరు పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.
ఎస్సీ రిజర్వుడ్ స్థానమైన (SC Reserve Seat) వరంగల్ స్థానం నుంచి దొమ్మాట సాంబయ్యను ప్రతిపాదించగా, స్టేషన్ ఫన్‌పూర్‌కు చెందిన ఇందిర టికెట్ ఇవ్వాలని కోరుతున్నారు. అద్దంకి దయాకర్‌ను అక్కడి నుంచి బరిలో దించడాన్ని పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. నిజామాబాద్‌లో ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డికి అవకాశమివ్వాలని రాష్ట్ర నాయకత్వం భావించగా, స్థానిక నాయకులు అభ్యంతరం వ్యక్తం చేసినట్లు సమాచారం.
Congress Candidate List Lok Sabha Election : అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలైన ఎవరికీ టికెట్లు ఇవ్వకూడదని కాంగ్రెస్ నిర్ణయించినందున జీవన్‌రెడ్డి టికెట్ కేటాయింపుపై ప్రతిష్ఠంభన నెలకొంది. టికెట్ ఇవ్వాలని మాజీ ఎమ్మెల్యే ఇరావత్రి అనిల్, ఆరెంజ్ ట్రావెల్స్ యజమాని సునీల్ రెడ్డి పట్టుబడుతున్నట్లు తెలుస్తోంది. పెద్దపల్లి ఎస్సీ రిజర్వుడు స్థానం నుంచి ఎమ్మెల్యే వివేక్ కుమారుడు వంశీకృష్ణను బరిలో దించాలని రాష్ట్ర నాయకత్వం భావిస్తుండగా, పలువురు తీవ్ర అభ్యతంరం వ్యక్తం చేస్తున్నారు.
ఇటీవలే దిల్లీ వెళ్లి అధిష్ఠానానికి ఫిర్యాదు చేయడంతో స్థానిక నాయకులతో సంప్రదింపులు జరపాల్సిన పరిస్థితి నెలకొంది. మల్కాజ్‌గిరి నుంచి హరివర్ధన్‌రెడ్డి ఆశిస్తుండగా, ఇటీవల కాంగ్రెస్‌లో చేరిన కంచర్ల చంద్రశేఖర్‌రెడ్డి (Kancharla Chandrasekhar Reddy) టికెట్ కోసం పట్టుబడుతున్నట్లు సమాచారం. ఆ ఇద్దరి కంటే బలమైన వారు ముందుకొస్తే బరిలో దింపాలని భావిస్తోంది.
ఖమ్మం గుమ్మంలో రాజకీయ కాక : ఖమ్మం స్థానం కోసం ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క భార్య నందిని, పొంగులేటి ప్రసాద్‌రెడ్డి పోటీపడుతున్నారు. కమ్మ సామాజికవర్గం ఓట్లు అధికంగా ఉన్నందున రాజేంద్రప్రసాద్ పేరును పరిశీలిస్తున్నారు. కరీంనగర్ నుంచి ప్రవీణ్ రెడ్డి, రాజేంద్రరావు టికెట్ ఆశిస్తున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మెదక్ నుంచి నీలం మధు, చేవెళ్ల నుంచి పట్నం సునీతా మహేందర్ రెడ్డికి (Patnam Sunita Mahender Reddy) ఇవ్వాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. హైదరాబాద్ నుంచి మస్కట్ డైరీ యజమానిని బరిలో దించాలని రాష్ట్ర నాయకత్వం యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఆదిలాబాద్ నుంచి బలమైన అభ్యర్థి కోసం వేటసాగుతున్నట్లు సమాచారం.
12 లోక్‌సభ స్థానాలకు అభ్యర్థులను ఫైనల్ చేసిన కాంగ్రెస్! - ఇక తేలాల్సింది ఆ 5 సీట్లే
అగ్రనేతలొస్తే ఓకే లేదంటే మాకే - ఖమ్మం ఎంపీ అభ్యర్థి ఎంపికపై ఉత్కంఠ