Cong Govt Plans to Rythu Runamafi : రాష్ట్రప్రభుత్వం త్వరలో రైతులకు శుభవార్త అందించబోతోంది. రైతు రుణమాఫీ(Rythu Runamafi) దిశగా చర్యలు చేపట్టినట్లు కాంగ్రెస్ వర్గాలు వెల్లడించాయి. ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా రైతు రుణమాఫీ ఏకకాలంలో చేస్తామని, ఇచ్చిన హామీకి కట్టుబడి ఉన్నామని ధరణి కమిటీ సభ్యుడు ఎం.కోదండరెడ్డి పేర్కొన్నారు. బ్యాంకులలో రైతుల అప్పుల వివరాలు సేకరించే పనిలో ప్రభుత్వం ఉందని, పూర్తి సమాచారం రాగానే రుణమాఫీ ప్రక్రియ కార్యరూపం దాల్చుతుందని స్పష్టం చేశారు.
Congress Plan on Farmer Loan Waiver : పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి, ఎస్సీ సెల్ ఛైర్మన్ ప్రీతం, కాంగ్రెస్ ఫిషర్‌మెన్ కమిటీ ఛైర్మన్ మెట్టు సాయికుమార్ తదితరులతో కలిసి ఆయన సోమవారం గాంధీభవన్‌లో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. గత ప్రభుత్వం హయాంలో అక్రమంగా భూములు పొందిన అధికారులపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు.
సాగు భూమికే రైతు భరోసా! - వ్యవసాయ రుణమాఫీపై త్వరలోనే నిర్ణయం : సీఎం రేవంత్ రెడ్డి
ధాన్యానికి మద్దతు ధర కంటే తక్కువ వచ్చినప్పుడు బోనస్ రూ.500 ఇస్తామని చెప్పాం. కానీ ప్రస్తుతం మద్దతు ధర రూ.2060 కాగా, కొనుగోలు కేంద్రాల్లో రూ.2600 ఇస్తున్నారు. అందుకే బోనస్ గురించి ప్రస్తావించలేదని చెప్పారు. అనంతరం జగ్గారెడ్డి మాట్లాడుతూ మాజీ సీఎం కేసీఆర్(KCR) శాసనసభపక్ష నేతగా అసెంబ్లీ సమావేశాలకు రాకుండా ప్రజల తీర్పును అవమానిస్తున్నారని మండిపడ్డారు.
Crop Loan Waiver Scheme : రాష్ట్రంలోని రైతులు తీసుకున్న పంట రుణాలు రూ.20 వేల కోట్ల నుంచి రూ.25 వేల కోట్ల వరకు ఉంటాయని ప్రభుత్వం అంచనా వేసింది. ఆ మొత్తాన్ని పూర్తిగా రైతులకు రుణమాఫీ చేసేందుకు సమాయత్తమవుతోంది. ఇందులో భాగంగా రైతులు చెల్లించాల్సిన రుణాన్ని ప్రభుత్వమే చెల్లిస్తుందని బ్యాంకులకు హామీ ఇచ్చి, రూ.రెండు లక్షల రుణమాఫీకి ప్రణాళికలు రచిస్తోంది.
ఉదాహరణకు రూ.25 వేల కోట్లకు బ్యాంకర్లకు ప్రభుత్వం హామీ ఇచ్చినట్లైతే, ఆ మొత్తాన్ని 50 నెలల పాటు ప్రతి నెల రూ.50 కోట్లు వడ్డీతో కలిపి ప్రతి నెల రూ.550 కోట్లు నుంచి రూ.600 కోట్లు చెల్లిస్తే అప్పు తీరుతుందని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. దీనిద్వారా రాష్ట్ర ప్రభుత్వంపై ఒకేసారి ఆర్థిక భారం పడకపోగా, ఇచ్చిన హామీ మేరకు రుణమాఫీ జరుగుతుందని ప్రభుత్వం భావిస్తోంది. వీలైనంత త్వరగా రుణమాఫీ చేయడంతో పాటు రూ.3 లక్షల వరకు వడ్డీ లేని రుణాలు తీసుకోడానికి వెసులుబాటు కల్పించనుంది. ఇప్పటివరకు రైతులు చెల్లించే పావలా వడ్డీ కూడా రాష్ట్ర ప్రభుత్వం భరించడం ద్వారా వడ్డీ లేని రుణాలు తీసుకోడానికి అవకాశం ఇవ్వనుంది.
ఆరు గ్యారంటీలకే బడ్జెట్లో పెద్దపీట - మొత్తం ఎన్ని నిధులు కేటాయించారో తెలుసా?