చిన్న చిన్న విషయాలే ఒక్కోసారి తీవ్ర దుష్పరిణామాలకు దారి తీస్తాయి. రూ.5 కోసం ఇద్దరి వ్యక్తుల మధ్య గొడవ రెండు ఊళ్లకు పాకేలా చేసిన ఉదంతాలను చూశా. అలాంటి ఓ చిన్న వివాదంతో ఈ ఘటన మొదలైంది. పెట్రోల్ బంకులో జరిగిన గొడవ విషయంలో ముగ్గురు యువకులకు శిరోముండనం చేయించిన ఘటన నాగర్‌కర్నూల్ జిల్లా లింగాలలో జరిగింది. గత ఆదివారం (అక్టోబర్ 13) ఈ ఘటన జరగగా, వీరిలో ఓ యువకుడు మనస్తాపంతో శుక్రవారం (ఈ నెల 18) ఉదయం ఆత్మహత్యాయత్నానికి పాల్పడటంతో విషయం వెలుగులోకి వచ్చింది.
స్థానికులు, విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు ముగ్గురు యువకులు గత ఆదివారం రాత్రి లింగాలలోని ఓ పెట్రోల్ బంకులో రూ.20కు పెట్రోల్ పోయాలని నిర్వాహకుల్ని అడిగారు. అందుకు వారు తిరస్కరించడంతో యువకులకు, బంకు నిర్వాహకులకు మధ్య వివాదం తలెత్తింది. బంకు నిర్వాహకులు ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు ముగ్గురు యువకుల్ని పీఎస్‌కు తరలించారు. వారిలో ఒక యువకుడు పోలీస్‌స్టేషన్‌లో తల దువ్వుకోవడంతో ఆగ్రహించిన పోలీసులు ఠాణాలో ముగ్గురు యువకులకూ శిరోముండనం చేయించినట్టు సమాచారం.
వివరాల నిరాకరణ : ఈ ఘటన నేపథ్యంలో వారిలో ఓ యువకుడు తీవ్ర మనస్తాపంతో శుక్రవారం (అక్టోబర్ 18) ఇంట్లో ఉరేసుకోగా, గమనించిన కుటుంబ సభ్యులు నాగర్‌కర్నూల్ జిల్లా ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆ యువకుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. అయితే, యువకుడి కుటుంబ సభ్యులు పూర్తి వివరాలు వెల్లడించడానికి నిరాకరించారు. యువకుల మధ్య గొడవతో మనస్తాపం చెంది, తమ బిడ్డ ఆత్మహత్యకు యత్నించాడని చెప్పి కుటుంబ సభ్యులు బాధితుడ్ని ఆసుపత్రిలో అడ్మిట్ చేశారని వైద్యులు వెల్లడించారు.
ఈ వ్యవహారంపై నాగర్‌కర్నూల్ జిల్లా ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్‌ను వివరణ కోరగా, కొందరు యువకుల మధ్య గొడవ జరిగినట్లు సమాచారం ఉందని అన్నారు. స్థానిక ఎస్సై 4 రోజుల నుంచి సెలవులో ఉన్నారని తెలిపారు. శిరోముండనం జరిగి ఉంటే కచ్చితంగా విచారణ చేయిస్తామన్నారు. ఈ ఘటనకు కారకులైన వారు, విషయం బయటికి రాకుండా బాధిత కుటుంబసభ్యులపై ఒత్తిడి చేస్తున్నట్లు తెలిసిందని చెప్పారు. నేరం రుజువైతే తప్పకుండా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.
శిరోముండనం కేసు- ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులుకు 18 నెలల జైలు శిక్ష - Venkatayapalem Shiromundanam Case
ప్రేమపెళ్లి చేసుకుందని కుమార్తెపై తల్లిదండ్రుల కర్కశం.. ఏం చేశారంటే?