TS Government Committee Formed for Kaleshwaram Project : మేడిగడ్డ ఇతర ఆనకట్టల విషయంలో నిపుణుల కమిటీ సూచనల మేరకే ముందుకెళ్లాలని నిర్ణయించిన సర్కార్, ఆ దిశగా చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల ఆనకట్టల విషయంలో కమిటీ ఏర్పాటు చేసింది. ఆనకట్టలకు తాత్కాలిక చర్యలు, తదుపరి పరీక్షల కోసం ఈ కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈఎన్‌సీ జనరల్ నేతృత్వంలో ఈ కమిటీ ఏర్పాటు కాగా సభ్యులుగా ఓఅండ్‌ఎమ్ ఈఎన్‌సీ, సీడీఓ సీఈ, రామగుండం సీఈ ఉంటారు. ఈ మూడు ఆనకట్టల విషయంలో చేపట్టాల్సిన కార్యాచరణ, ఎన్‌డీఎస్‌ఏ నిపుణుల కమిటీ నివేదిక ఆధారంగా చేపట్టే చర్యల్లో భాగంగా ఈ కమిటీ ముందుకు సాగనుంది.
ఎన్‌ఎస్‌ఏ నిపుణుల కమిటీ సూచన మేరకు పరీక్షలు : బ్యారేజీలకు పరీక్షల కోసం దిల్లీలోని సెంట్రల్ సాయిల్ అండ్ మెటీరియల్స్ రీసెర్చ్ స్టేషన్( సీఎస్‌ఎమ్‌ఆర్‌ఎస్), పూణెలోని సెంట్రల్ వాటర్ అండ్ పవర్ రీసెర్చ్ స్టేషన్(సీడబ్ల్యూపీఆర్‌ఎస్), హైదరాబాద్‌లోని నేషనల్ జియోఫిజికల్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్(ఎన్‌జీఆర్‌ఐ) సేవలను వినియోగించుకోవాలని రాష్ట్ర ప్రభుత్వానికి కమిటీ సూచించింది. ఈ మేరకు నీటిపారుదలశాఖ ఇప్పటికే ఆయా సంస్థలను సంప్రదించింది.
ఎన్‌ఎస్‌ఏ నిపుణుల కమిటీ సూచన మేరకు పరీక్షలు నిర్వహించాలని, అందులో భాగంగా మొదట బ్యారేజీలను పరిశీలించాలని కోరింది. సీడబ్ల్యూపీఆర్‌ఎస్ సంస్థ ప్రతినిధులు బుధవారం మూడు ఆనకట్టలను పరిశీలించనున్నారు. ఎన్‌జీఆర్‌ఐ ప్రతినిధులు కూడా ఒకట్రెండు రోజుల్లో పరిశీలన చేస్తారని చెబుతున్నారు. మూడు సంస్థలు క్షేత్రస్థాయిలో పరిశీలించి, అధికారులతో చర్చించిన తర్వాత, ఎవరితో ఏ పరీక్షలు చేయించాలన్న విషయమై ఓ నిర్ణయానికి వస్తారు.
Kaleswaram Works Started Before Rains Started : వీలైనంత త్వరగా పరీక్షలు ప్రారంభించాలన్న ఆలోచనలో ప్రభుత్వం ఉంది. ఎన్‌డీఎస్‌ఏ నిపుణుల కమిటీ సిఫారసు చేసిన పరీక్షల్లో, కొన్ని వర్షాకాలం కంటే ముందే పూర్తి చేయాల్సి ఉంది. వర్షాలు పడి ఒకసారి బ్యారేజీల్లోకి నీటి ప్రవాహాలు ప్రారంభమైతే ఆ పరీక్షలకు ఆటంకం కలుగుతుంది. అందుకు అనుగుణంగా త్వరితగతిన పరీక్షలు ప్రారంభించాలని భావిస్తున్నారు. బ్యారేజీలకు మూడు రకాల పరీక్షలు సూచించిన కమిటీ, పియర్స్ కుంగిన నేపథ్యంలో మేడిగడ్డకు అదనంగా కాంక్రీట్ నిర్మాణానికి సంబంధించిన ఇన్వెస్టిగేషన్స్ కూడా చేయాలని తెలిపింది.
మూడు బ్యారేజీలకు సాధారణ, జియోఫిజికల్ పరీక్షలతో పాటు బ్యారేజీ ఫౌండేషన్‌ను అధ్యయనం చేసేందుకు జియోటెక్నికల్ ఇన్వెస్టిగేషన్స్ చేయాలని సిఫారసు చేసింది. సాధారణ పరీక్షల్లో భాగంగా, మేడిగడ్డ బ్యారేజీకి 5వేల మీటర్ల వరకు ఎగువన, దిగువన వంద మీటర్ల అంతరంతో రివర్స్ క్రాస్ సెక్షన్స్ పరిశీలించాలని తెలిపింది. ప్లింత్ స్లాబ్, సీసీ బ్లాకులు లాంఛింగ్ ఆఫ్రాన్ సహా బ్యారేజీ ఎగువన, దిగువన లెవల్స్ తీసుకోవాలని, గేజ్ పరీశీలన, ఏడీసీపీ నుంచి డిశ్చార్జ్ సేకరించి, లోఫ్లోస్, హైఫ్లోస్‌కు గేజ్ - డిశ్చార్జ్ కర్వ్ వ్యాలిడేషన్ చేయాలని పేర్కొంది.
Committee to Carry out Geophysical Tests : ఎక్కువ రెజల్యూషన్ ఉన్న కెమెరా ద్వారా డ్రోన్ సాయంతో మొత్తం బ్యారేజీ స్ట్రక్చర్‌కు సంబంధించిన సర్ఫేస్ క్రాక్ మ్యాపింగ్ చేయాలని సూచించింది. సివిల్ కాంపోనెంట్లు అయిన రాఫ్ట్, పియర్స్, బ్రిడ్జ్ డెక్ స్లాబ్‌తో పాటు హైడ్రో మెకానికల్ కాంపోనెంట్లకు సంబంధించిన కచ్చితత్వంతో సర్వే చేయాలని, డిజైన్ లెవల్స్‌ను పరిగణలోకి తీసుకోని నిలువుగా, అడ్డంగా విలువలు నమోదు చేయాలని కమిటీ సూచించింది. బ్యారేజీ రాఫ్ట్‌పై గ్రౌండ్ పెనెట్రేటింగ్ రాడార్(జీపీఆర్), ఎగువ దిగువ భాగాల్లో ఎలక్ట్రికల్, రెసిస్టివిటీ టోమోగ్రఫీ (ఈఆర్‌టీ) విధానంలో జియోఫిజికల్ పరీక్షలు చేయాలని కమిటీ తెలిపింది.
ఆ పరీక్షల ఫలితాలను బోర్ గుంతల పరీక్షల ద్వారా పరిశీలించాలని, ఆ ప్రక్రియ వర్షాకాలం కంటే ముందే పూర్తి కావాలని పేర్కొంది. బ్యారేజీ అప్ స్ట్రీమ్, డౌన్ స్ట్రీమ్ సీకెంట్ పైల్ కటాఫ్, పారామెట్రిక్ జాయింట్‌ల సామర్థ్యాన్ని అధ్యయనం చేసేందుకు తదుపరి మరిన్ని జియోఫిజికల్ పరీక్షలు కూడా వర్షాకాలం ముందే నిర్వహించాలని సూచించింది. మేడిగడ్డ బ్యారేజీ ఏడో బ్లాక్‌లోని సీకెంట్ పైల్స్‌లను ప్యారలల్ సెస్మిక్ మెథడ్ ద్వారా, సీకెంట్ పైల్స్‌కు సమీపంలో బోర్ గుంతలు వేసి అండర్ ప్యారలల్ సెస్మిక్ విధానం ద్వారా పరీక్షలు చేయాలని సూచించింది.
'గుత్తేదారు స్పందించకపోతే - అప్పుడే ఎందుకు చర్యలు తీసుకోలేదు' - Judicial Inquiry On Kaleshwaram