CM Revanth Review On Dharani Portal : ధరణి సమస్యలకు శాశ్వత పరిష్కారం కోసం మరింత లోతుగా అధ్యయనం జరగాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభిప్రాయపడ్డారు. భూ సమస్యలు రోజురోజుకీ మరింత ఎక్కువవుతున్నందున సమగ్ర చట్టం తయారు చేయాల్సిన అవసరం ఉందన్నారు. పైలట్ ప్రాజెక్టుగా ఒక మండలంలో భూసమస్యలని అధ్యయనం చేయాలని సూచించారు. అవసరమైతే శాసనసభలో చర్చించి తుది నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు.
ధరణి సమస్యలపై సీఎం సమీక్ష : ధరణి సమస్యలు, పరిష్కార మార్గాలపై సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సమావేశం జరిగింది. ఒకప్పుడు గ్రామ స్థాయిలోనే అందుబాటులో ఉండే రికార్డులు చట్టాల మార్పుతో క్రమంగా జిల్లా కేంద్రం, రాష్ట్ర స్థాయికి వెళ్లిపోయాయన్నారు. గతంలో భూ సమస్యల పరిష్కారానికి అప్పీలు చేసుకునే అవకాశం ఉండేదని గుర్తు చేశారు. ధరణితో గ్రామ, మండల స్థాయిలో ఏ సమస్యకూ పరిష్కారం లేకుండా పోయిందని, అన్ని అధికారాలు జిల్లా కలెక్టర్కు అప్పజెప్పారన్నారు.
CM Revanth On Dharani Issue : కలెక్టర్ల వద్ద కూడా సమస్యలు పరిష్కారం కావడం లేదన్న సీఎం కలెక్టర్ల నిర్ణయాన్ని ప్రశ్నించే అవకాశం లేకుండా ధరణిని రూపొందించారన్నారు. భూ సమస్యల పరిష్కారానికి విస్తృతస్థాయి సంప్రదింపులు జరపాలని, ప్రజల నుంచి సూచనలు స్వీకరించాలని రేవంత్ రెడ్డి తెలిపారు. అఖిలపక్ష సమావేశం కూడా నిర్వహించి అందరి అభిప్రాయాలతో సమగ్ర చట్టం తీసుకురావల్సి ఉందన్నారు.
ధరణిపై మరింత లోతుగా అధ్యయనం చేయండి : భూదాన్, పొరంబోకు, బంచరాయి, ఇనాం, కాందిశీకుల భూముల సమస్యలున్న ఓ మండలాన్ని పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసి అధ్యయనం చేస్తే స్పష్టత వస్తుందని సీఎం సూచించారు. అవసరమైతే ధరణికి సంబంధించిన అన్ని అంశాలపై శాసనసభలో చర్చించి తుది నిర్ణయం తీసుకుంటామని రేవంత్ రెడ్డి వెల్లడించారు. సమావేశంలో మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, మంత్రి సీతక్క, పొన్నం ప్రభాకర్, సలహాదారులు కేశవరావు, వేం నరేందర్ రెడ్డి, మాజీ మంత్రి జానా రెడ్డి, ధరణి కమిటీ సభ్యులు కోదండరెడ్డి, సునీల్ కుమార్, రేమండ్ పీటర్, మధుసూదన్, సీసీఎల్ఏ నవీన్ మిత్తల్, సీఎస్ శాంతి కుమారి, సీఎంవో అధికారులు పాల్గొన్నారు.
CM Review On Panchayat Raj Dept : సచివాలయంలో పంచాయతీ రాజ్ శాఖపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఆ శాఖకు సంబంధించిన పలు అంశాలపై సమీక్షించారు. పంచాయతీ ఎన్నికల కార్యాచరణపై డిప్యూటీ సీఎం, ఇతర మంత్రులతో సీఎం చర్చించారు. ఈ సమీక్షలో సీఎస్, డిప్యూటీ సీఎం భట్టి, మంత్రులు పొంగులేటి, సీతక్క పాల్గొన్నారు.
ప్రజల ఆలోచనలు వినడం మా ప్రభుత్వ విధానం : సీఎం రేవంత్ రెడ్డి - TG Fire dept passing out parade